తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, చంద్రబాబు పాలనా వైఫల్యాలతో ఈ ప్రభుత్వం అతి తొందర్లోనే కుప్పకూలిపోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి అత్యంత హేయమని ఆయన అభివర్ణించారు. దాడిని నిలువరించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని, పైగా తమ పార్టీ కార్యకర్తలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆక్షేపించారు. ఇంకా హిందూపురం బయలుదేరిన తమ పార్టీ నాయకులను నిన్న (ఆదివారం) ఎక్కడికక్కడ అడ్డుకున్నారని, ఇలాంటి ప్రజావ్యతిరేక చర్యలే కూటమి పతనానికి నాంది పలుకుతాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విశ్వేశ్వర్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ఆ ఘటనకు ఆయనే పూర్తి బా«ధ్యుడు: హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూపురంలో నందమూరి బాలకృష్ణను వరుసగా ఎందుకు గెలిపిస్తున్నారని అక్కడి ప్రజలను అడిగితే.. బయట వ్యక్తి అయితే ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంటాడు, మేం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెబుతుంటారు. ఇలాంటి ప్రశాంతత కోరుకునే హిందూపురంలో జరిగిన ఈ ఘటన తర్వాత అక్కడి ప్రజలు టీడీపీని, ఎమ్మెల్యే బాలకృష్ణను అసహ్యించుకుంటున్నారు. కేవలం రాజకీయ విమర్శ చేసినందుకే, పార్టీ ఆఫీస్‌పై దాడి చేసి ధ్వంసం చేయడం హేయం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సహించరానివి. అది కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో ఉండగానే, నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టిన రోజునే ఈ ఘటన జరగడం చూస్తుంటే.. దాడి వెనుక ఆయన ప్రోద్భలం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాలకృష్ణ ఆదేశాలతోనే టీడీపీ గూండాలు దాడి చేసినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకవైపు ఆపకపోగా.. మరోవైపు: దాడి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు నిలువరించకపోగా, అడ్డుకున్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నష్టపోయిన బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్న దారుణమైన పరిస్థితులు బహుషా ఏపీలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరగడం లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, హత్యలు చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. టీడీపీ గూండాలు మా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే పరిస్థితిని సమీక్షించడానికి వెళ్తున్న మా పార్టీ నాయకులనే పోలీసులు అడ్డుకున్నారంటే.. ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నా. హిందూపురం వెళ్తున్న అనంతపురం, సత్యసాయి జిల్లాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను అడ్డుకుని వెనక్కి పంపారు. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేశారంటే వైయస్ఆర్‌సీపీని చూసి ఈ ప్రభుత్వం ఎంతలా భయపడుతున్నారో తెలుస్తుంది. ఏ ఆధారాలతో సతీష్‌కుమార్‌ది హత్య అని ప్రచారం చేశారు?: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే ఏ ఘటన జరిగినా, అధికార తెలుగుదేశం పార్టీ చేసే ఆలోచన తక్షణం దాన్ని డైవర్ట్ చేయడానికి వైయస్ఆర్‌సీపీ నాయకులపై నిందలు మోపి అక్రమ కేసులు పెట్టడమే. అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తప్ప, ఏ ఒక్క సందర్భంలోనూ వైయస్ఆర్‌సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సాహసం చేయడం లేదు. పరకామణి చోరీ కేసులో విచారణకు హాజరవుతున్న టీటీడీ మాజీ ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే, దానిపై ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాకుండానే, చివరకు పోస్టుమార్టమ్ కూడా నిర్వహించకముందే, వైయస్ఆర్‌సీపీని నిందిస్తూ ఎల్లో మీడియాతో పాటు, టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అది హత్య అని నిర్ధారించే ఆధారాలు ఏవీ లేకపోయినా ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ మీద నిందలు మోపి, రాజకీయంగా బురద జల్లడమే లక్ష్యంగా ‘హత్య‘ అంటూ ఒక కట్టుకథను ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి ఆక్షేపించారు.