తిరుపతి: ఉగాది పర్వదినం రోజున సీఎం చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఉగాది పర్వదినం రోజునే రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజున ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడం పూర్తిగా అసత్యమని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలు, మ్యానిఫెస్టోలోని 145 వాగ్దానాలు అమలు కాలేదని ఆరోపించారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, నిరుద్యోగులకు రూ.3000 భృతి వాగ్దానం చేసి మోసం చేశారని ఆమె విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పేదలు, ఉద్యోగులు, రైతులు సంతోషంగా ఉన్నారని రోజా గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఉగాది సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయలేదని తప్పుపట్టారు. అర్హతలేని వారికి పదవులు ఇస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.