నెల్లూరు: ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే.. ఈరోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నెల్లూరులో మీడియాతో కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడారు. అసమర్థత అంగీకరించారు: – ఏదైతేనేం.. ఈరోజు ఈనాడులో వచ్చిన కథనం చూస్తే ప్రభుత్వ అసమర్థతను అంగీకరించిందని అర్థమవుతుంది. కానీ చంద్రబాబు అసమర్థతను దాచిపెట్టి వాస్తవాలను వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందే తప్ప, రైతులకు మేలు చేసేలా వ్యవహరించడం లేదు. – వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద కేసులు పెట్టి వేధించడంలో ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యల పరిష్కారంపై లేదని మేం చెప్పిన మాటలే నిజమయ్యాయి. అది చంద్రబాబు సుఖీభవ అయింది: – వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు చేయడం లేదు. అసలు దాని గురించి ఏ నాయకుడూ మాట్లాడడం లేదు. – వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది. – మద్ధతు ధర దక్కకపోవడానికి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే.. ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా?. – చంద్రబాబు పదే పదే చెప్పే 40 ఏళ్ల అనుభవం, టెక్నాలజీ, రియల్ టైం గవర్నెన్స్, డీప్ టెక్ ఏమయ్యాయి?. చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు: – రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకి లేకపోవడం వల్లే వారి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. – రైతుల సమస్యలపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేనందునే, ఆ నెపాన్ని గత మా ప్రభుత్వం మీద, అధికారుల మీద నెట్టేసి పబ్బం గడుపుతున్నారు. మీ ప్రాధాన్యాలు అమరావతి మీద ఉంటే, అధికారులను తిడితే ఏం ప్రయోజనం ఉంటుంది?. – ధాన్యం కొనాలని కానీ, రైతులకు మేలు చేయాలని కానీ చంద్రబాబుకి లేదు. అందుకే కాలయాపన కార్యక్రమాలతో తన వైఫల్యాలను అధికారులపైకి నెట్టాలని చూస్తున్నారు. – అయితే అనుకూల మీడియాలో కథనాలు రాయించుకున్నంత మాత్రాన మీరు చేసిన పాపాలు తొలగిపోవు. రైతులు మిమ్మల్ని క్షమించరు. మీరు చెప్పిందల్లా రైతులు వింటారనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. – మంత్రి నాదెండ్ల మనోహర్‌కి రైతులు ఎన్నిసార్లు వాట్సప్‌లో హాయ్ హాయ్ అని మెసేజ్‌లు పెట్టినా పట్టించుకున్న దాఖలాలే లేవు. ఎమ్మెస్పీ కూడా దక్కడం లేదు: – వైయస్ జగన్ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని టీడీపీ సానుభూతిపరులు కూడా అంగీకరించారు. ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయని వారు చెప్పారు. – రైతుల ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వాటిని పరిష్కరించారు. మంచి పనిమంతుడు కాబట్టే వాటిని అధిగమించి రైతులకు అండగా నిలిచారు. – చిత్తశుద్ధితో పని చేసిన సీఎం వైయస్ జగన్ అయితే, ప్రెస్‌మీట్ల సీఎం చంద్రబాబు, ఏమీ చేయకుండానే ఆహా ఓహో అని తన భుజాలు తానే తట్టుకుంటున్నాడు. – వైయస్ జగన్ సీఎంగా ఉండగా బస్తాకు నిర్ధారించిన ధర కన్నా అదనంగా అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ నేడు చంద్రబాబు పాలనలో కనీస మద్ధతు ధర కూడా రైతులకు దక్కని పరిస్థితి నెలకొంది. రైతుల కష్టాన్ని దళారులు, మిల్లర్లు కలిసి భోంచేస్తున్నారు. కానీ ఆ నెపాన్ని మాత్రం మాపై నెడుతున్నారు. – చంద్రబాబు ప్రాధాన్యం రైతులు కాదు. ఆయన మనసంతా రాజధాని అమరావతి నిర్మాణంపైనే ఉంది. వేల కోట్ల అప్పులతో పనులు చేసి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనేది చంద్రబాబు తపన. ఆ నిర్ణయం రైతులకు ఉరి: – జగన్ హయాంలో పంట వేసిన వెంటనే ఏ పంట వేశారో చూసి ఈ–క్రాపింగ్ చేశాం. ఈ క్రాప్‌లో వచ్చిన దాని ప్రకారం ఆర్బీకేల ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టాం. పంట దిగుబడికి ఎప్పుడొస్తుంది? గిట్టుబాటు ధర కల్పించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చక్కని ప్రణాళిక రూపొందించే వాళ్లం. – అలాగే ఎప్పటికప్పుడు సీఎం సమీక్షలు నిర్వహించే వారు కాబట్టే రైతులు బ్రహ్మండంగా గిట్టుబాటు ధరలకు ధాన్యం అమ్ముకోగలిగారు. రైతులకు ఇబ్బందులు లేకుండా 21 రోజుల్లో డబ్బులు అకౌంట్లలో జమ చేసే వాళ్లం. అలాంటిది ఈరోజు ధాన్యం కొనుగోళ్లకే రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. – ఈ క్రాప్ కి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మంగళం పాడిందో ఆ క్షణమే రైతులకు ఉరి బిగుసుకుంది. ఇవీ వాస్తవ గణాంకాలు: – వైయస్ జగన్ హయాంలో 2019–24 మధ్య ధాన్యం కొనుగోళ్లు 18 లక్షల టన్నులు తగ్గిందని చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారు. – కానీ, వాస్తవాలు చూస్తే ధాన్యం సేకరణ నుంచి అమ్మకం వరకు అన్ని విభాగాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగ్గా పని చేసిందని మా దగ్గర ఉన్న లెక్కలే తెలియజేస్తున్నాయి. – ధాన్యం సేకరణ చెల్లింపులకు సంబంధించి 2014–19 మధ్య, టీడీపీ ప్రభుత్వ హయాంలో 17.94 లక్షల రైతుల నుంచి 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారికి రూ.40,236 కోట్ల పైకం చెల్లించారు. – అదే 2019–23 మధ్య వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో.. 37.70 లక్షల రైతుల నుంచి 3,40,24,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి పైకంగా రూ.65,255 కోట్లు చెల్లించడం జరిగింది. – ఇంకా టాటా కన్సెల్టెన్సీ సర్వీస్‌ను నియమించుకుని ఆర్బీకే సెంటర్లను వినియోగించి జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్ లేబర్ ట్రాన్స్‌పోర్ట్) విధానం ద్వారా రైతుల ముందే శాంపిళ్ల సేకరణ చేయడం, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా గన్నీ బ్యాగులు ఇవ్వడం, రవాణా వాహనాల కేటాయింపు, హమాలీలు .. అన్నీంటా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించగలిగాం. ఇంకా ఏమేం చేశామంటే..: – చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను కూడా ఎత్తేశారు. మా హయాంలో రైతుతో సంబంధం లేకుండా ఈ–క్రాప్ అయిన వెంటనే పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా చెల్లించాం. – ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో ఇబ్బందులున్నాయని తెలియడంతో దాన్నుంచి వైదొలిగి రైతు వాటా, కేంద్రం వాటా, రాష్ట్రం వాటా మొత్తం మేమే భరించాం. ఈ ఘనత నాటి సీఎం జగన్‌కే దక్కుతుంది. – ఇంకా చంద్రబాబు దిగిపోతూ ఎగ్గొట్టిపోయిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు కూడా చెల్లించాం. ఇప్పుడేం జరుగుతోంది?: – ఈ ప్రభుత్వంలో తుపాన్‌లు, వరదలొచ్చినా కనీసం ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు. – రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు రూ.1720 ఏ రైతు అందుకున్న దాఖలా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పౌర సరఫరాల శాఖ మంత్రిని రైతులు ఎన్నిసార్లు కలిసినా వారి బాధలు తీరడం లేదు. – ఒక్కో బస్తా మీద రైతు రూ.325 నష్టపోతున్నాడు. అలా ఈ సీజన్‌లో రూ.1,480 కోట్లు రైతులకు చెందాల్సిన డబ్బు దళారుల జేబుల్లోకి పోయే ప్రమాదం ఏర్పడింది. దళారులు దోచుకు పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. – ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వాస్తవ పరిస్థితి గుర్తించి, అది సజావుగా జరిగేలా చూడాలి. రైతులకు తప్పనిసరిగా ఎమ్మెస్పీ దక్కేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. – రైతుల సమస్యలపై ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు.