తాడేపల్లి:కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన మోసాలపై 'తొలి అడుగు-ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమం కోసం వచ్చే టీడీపీ నేతలుకు తగిన విధంగా బుద్ది చెప్పేందుకు జనం సిద్దంగా ఉన్నారని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి, ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళుతున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇంటింటికీ వెళ్ళే టీడీపీ నేతలకు చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలుకుతారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అబద్ధాలతో, ఎల్లో మీడియా బలంతోనే నడిపించాడు. మోసపూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. నందమూరి వారసులందర్నీ తొక్కేసి పార్టీని కబ్జా చేసిన మోసగాడు. ప్రజలను మాయమాటలతో మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి ఆయన. నాడు వైయస్ జగన్ సీఎంగా వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందర్నీ గడపగడపకు పంపించడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామా లేదా అని ఇంటింటికీ వెళ్లి అడిగిన ఘనత మాది. ఇంటింటికీ అందించిన లబ్ధితో కూడిన పేపర్‌ను వారికి అందజేసి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మీద ప్రజలు ఎంతో సంతృప్తిని వెలిబుచ్చారు. కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా 'తొలి అడుగు-ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేసింది లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఏం చెప్పుకుంటారు? 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారని చెప్పుకుంటూ 99 శాతం ప్రజలను వంచన చేశారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏడాది పాలన పూర్తయిన తర్వాత కూడా ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులను మహిళలు చెప్పులు, చీపుర్లతో తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. సాక్షి మీడియాతోనే ప్రజల్లోకి వాస్తవాలు 2014-19 మధ్య మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని పూర్తిగా అమలు చేయకపోగా టీడీపీ వెబ్‌సైట్ నుంచి ఏకంగా మేనిఫెస్టోనే మాయం చేసేశారు. విభజన హామీలు నెరవేర్చలేదు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పి దగా చేశారు. ప్రత్యేక హోదా పేరెత్తితో కేసులు పెట్టి వేధించారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచారు. ఆ ఐదేళ్లు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఎలాగైతే ప్రజలను మోసం చేశారో ఇప్పుడు కూడా అదే పాలనను పునరావృతం చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యల్లో, మహిళల మీద అత్యాచారాల్లో దేశంలోనే ఏపీని మొదటిస్థానంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని స్వేచ్ఛగా అబద్ధాలను ప్రచారం చేసుకున్నారు. సాక్షి మీడియాతో ద్వారా ప్రజల్లోకి ఎప్పటికప్పుడు నిజాలు తెలుస్తుండటంతో ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. సాక్షి మీడియా, సోషల్ మీడియా లేకపోతే కూటమి నాయకుల అరాచకాలు, వాస్తవాలు ప్రజలకు తెలిసేవే కావు. ఆ కేసులన్నీ ఏమయ్యాయి? ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ సీఎం వైయస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానం చెప్పుకోలేక ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌ను నమ్ముకుంటోంది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి వేధించడం ద్వారా ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తోంది. సమయం సందర్భం లేకుండా వివేకానందరెడ్డి మర్డర్, కోడి కత్తి కేసులు అంటూ అవహేళనగా మాట్లాడుతున్నారు. వివేకా హత్య కేసులో సునీతకి చంద్రబాబు ఏం న్యాయం చేశాడు? ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మీద కోడి కత్తి దాడి చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయింది. ఈ కేసులో ఆయన ఏం తేల్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. వైయస్ జగన్ సీఎంగా ఉండగా ఆయన మీద జరిగిన రాళ్ల దాడి వాస్తవం కాదా? నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం చంద్రబాబుకి తెలియదా? ఆ కేసును దర్యాప్తు చేయించి నిందితులెవరో చంద్రబాబే ప్రజలకు చెప్పొచ్చు కదా. వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో సఫారీ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మరణించాడని ఎస్పీ స్వయంగా ప్రకటించారు. దాన్ని ఎలాగైనా ప్రతిపక్ష నేతకు అంటగట్టాలనే కుట్రతో ఏఐ టెక్నాలజీతో వీడియో తయారు చేసి బురదజల్లడం వాస్తవం కాదా? సింగయ్య మరణానికి ముమ్మాటికీ కారణం చంద్రబాబే. వైయస్ జగన్ పర్యటనకు పోలీసులు సరైన భద్రత కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. వైయస్ జగన్ పర్యటనలకు వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబుకి భయం పట్టుకుంది. పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య లేక ప్రమాదమా అనే అనుమానాలు ఇప్పటికే ప్రజల్లో అలాగే ఉన్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు సృష్టించిన తిరుపతి లడ్డూ వివాదం ఆయన కుటుంబాన్ని వదలదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడితప్పాయి. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేయిస్తున్నారు. దారుణాలకు మూల్యం చెల్లించక తప్పదు వైయస్ జగన్ సీఎంగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఏడాదిలోనే నిర్వీర్యం చేశారు. విద్య, వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించకుండా పేద విద్యార్థులను చదువులకు దూరమయ్యేలా చేస్తున్నారు. 'తొలి అడుగు-ఇంటింటికీ తెలుగుదేశం' పేరుతో ఇంటింటికీ వెళితే వీటన్నింటికీ సమాధానం చెప్పడానికి టీడీపీ నాయకులు సిద్ధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ప్రాణాలే తీసినా మా పోరాటం ఆపేది లేదు. ఈ మోసకారి ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా విశ్రమించేది లేదు. వైయస్ జగన్ ని సీఎం కాకుండా ఈ అక్రమ కేసులు, పోలీసు లాఠీలు ఆపలేవు. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చేసిన దారుణాలన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించాలి.