వైయ‌స్  జగన్‌ గారిపై విషం చిమ్మడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం 

మాజీ మంత్రి పేర్ని నాని

చంద్రబాబు 23గ్రామాలకు...పవన్‌ ఇప్పటానికే పరిమితం 

అమరావతిలో పొలాలకు నిప్పు పెట్టినప్పుడు నీ నోటికి ఏమైంది..? 

 ఆనాడు దేవాలయాలు, మసీదులు కూలిస్తే పవన్‌ కి గునపాలు గుచ్చుకోలేదా..?: 

చంద్రబాబు కాళ్ల దగ్గర చోటుంటే చాలు అనుకుంటున్నాడు 
 
సజ్జలకి నువ్వు బొడ్డుకోసి పేరు పెట్టావా..? 

వైయ‌స్ జగన్‌ గారిని గెలవనివ్వకపోవడానికి పవన్‌ కళ్యాణ్‌ ఎవరు..? 

వైయ‌స్ జగన్‌ గారి ఓటమి తప్పదు పవన్‌ అన్నప్పుడే 151 సీట్లు వచ్చాయి 

 2014లో రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన పవన్‌ కళ్యాణ్ 

 గుడ్డలూడదీసి తంతా అనేది ప్రజాస్వామ్యమా..రౌడీయిజమా..? 

 ఎక్కడా మద్యం ఉండకూడదు కానీ తన ఫిల్మ్‌సిటీలో మాత్రం ఉండాలంటాడు రామోజీ 

తాడేప‌ల్లి: విద్వేషపూరితంగా ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారిపై విషం చిమ్మడం, చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం మాత్రమే పవన్‌ కళ్యాణ తాపత్రయపడుతార‌ని మాజీ  మంత్రి పేర్ని నాని అన్నారు. ప‌వ‌న్  తెర మీద కంటే ఎక్కువగా తన నటనా కౌశల్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ప్రతి ఎన్నికలోనూ తనకు బాగా అలవాటు అయిన వైయ‌స్ఆర్‌సీపీని  కూల్చేస్తా అంటూ మాట్లాడుతుంటాడు. ఎవరో సినిమా రైటర్‌ పవన్‌ కళ్యాణ్‌కు రాసిచ్చింది చదువుతున్నట్లున్నాడ‌ని విమ‌ర్శించారు. ఆదివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.      పవన్‌ కళ్యాణ్‌ మరో సారి మైకు ముందు తన విపరీత నటనా కౌశల్యంతో తెలుగు ప్రజలందరినీ ఆహ్లదపరిచి తిరిగి విమానం ఎక్కేశాడు. ఆయన ప్రసంగంలో ఈ రాష్ట్ర ప్రజలకు పనికొచ్చేది దమ్మిడీ కూడా లేదు. 

 పవన్‌ నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే..!:
    అసలు అక్కడ గడపలే కూల్చలేదని ఇప్పటం గ్రామస్థులు చెప్తుంటే ఈయన మాత్రం గోల చేస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ని కష్టాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా నమ్ముకుంటే మాత్రం కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే. వల్లంతా ఆముదం పూసుకుని దొరక్కుండా పారిపోయే రకం పవన్‌ కళ్యాణ్‌.

కాళ్ల కాడికి పిలిపించుకుని ముష్టి వేస్తాడా..?
    ఇప్పటం వాళ్లు ఏం పోరాటం చేశారో పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి. రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసిన ప్రహరీ గోడలను తొలగించారు. చట్టానికి లోబడి నోటీసులిచ్చినా వారు తొలగించుకోకపోతే ప్రభుత్వం తొలగించింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు పవన్‌ కళ్యాణ్‌ విపరీతమైన యాక్షన్‌ చేశాడు. చంద్రబాబు డబ్బున్న 23 గ్రామాలకు పరిమితమైతే...పవన్‌కళ్యాణ్‌ ఇప్పటంలోనే గిరగిర తిరుగుతున్నాడు. ఇప్పటంలో ప్రభుత్వం ఎవర్ని ఇబ్బంది పెట్టిందో పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి. పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన లక్ష రూపాయలు బాధలో ఉన్న వారింటికి వెళ్లి ఇచ్చాడా..? బాధల్లో ఉన్నవారిని ఆయన కాళ్ల కాడికి పిలుచుకుని ముష్టి వేస్తాడా..?

ఆ 14 లక్షలు..అంతకు ముందు 50 లక్షలు ఎవరు కడతారు..? 
    తప్పుడు కాగితాలపై వారితో వేలు ముద్రలు వేయించి సాక్షాత్తు హైకోర్టులో ఇప్పటం పరువు తీశాడు. హైకోర్టు ఒక్కొక్కరికి లక్ష చొప్పున 14 లక్షలు ఫైన్‌ వేసింది...ఆ డబ్బు ఎవరిస్తారో పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి. టీవీల ముందే పవన్‌ కళ్యాణ్‌ అబద్దాలు చెప్తాడని అనుకున్నాం కానీ సాక్షాత్తు హైకోర్టులో కూడా అబద్దాలు ఆడుతున్నారు. ఆ 14 మందికి లక్ష చొప్పున ఇవ్వాల్సింది చీకట్లో ఇస్తాడా..నేరుగా కోర్టుకు పవన్‌ కళ్యాణ్‌ కడతాడో చెప్పాలి. గతంలో ఆయన ఇస్తానన్న 50 లక్షలు ఎప్పుడిస్తాడో సమాధానం చెప్పాలి. 

అమరావతిలో పచ్చటి పోలాలు తగలబెడితే ఏమీ గుచ్చుకోలేదా..? 
    పవన్‌ కళ్యాణ్‌ పార్ట్‌నర్‌ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి గ్రామాల్లో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పొలాల్లో రోడ్లు వేసినప్పుడు పవన్‌ కళ్యాణ్‌కు కనీసం గుండు సూది కూడా గుచ్చుకోలేదు. పచ్చటి పొలాలను తగలబెట్టినప్పుడు ఆయనకు ఏమీ గుచ్చుకోలేదా..?పొలాలు ఇవ్వకపోతే లాఠీలతో కుళ్లబొడిస్తే పవన్‌ కళ్యాణ్‌ అప్పుడెందుకు ఊగిపోలేదో సమాధానం చెప్పాలి. అప్పుడు ఆయనకు తోలు మందంగా ఉందా...ఇప్పుడు తోలు పలుచనైందా..? చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాలు, మసీదులు పడగొడితే ఈ పవన్‌ కళ్యాణ్‌కి ఏమీ గుచ్చుకోలేదు కానీ...కేవలం మెట్లు, అరుగులు తొలగిస్తే ఏదో గుచ్చుకుందంటాడు. ప్రజల గుండెల్లో చోటుంటే చాలు అని మైకుల ముందు చెప్పి చంద్రబాబు కాళ్ల దగ్గర చోటుంటే చాలు అని తృప్తి పడతాడు. నిన్ను అభిమానించే వారు కూడా నువ్వు చంద్రబాబు కాళ్ల వద్ద కూర్చుంటున్నావనే కదా. 

సజ్జలకి నువ్వు బొడ్డుకోసి పేరు పెట్టావా..? 
    అందరికీ సంస్కారం లేదని శుద్దులు చెప్తున్న పవన్‌ కళ్యాణ్‌ మీరు ఏది చెబితే అదే సంస్కారమా..? ప్రజలు మనకు బాధ్యత అప్పచెప్పింది అధికారం కాదని, సేవా దృక్పదం మాత్రమే ఉండాలని మొదట్లోనే ఎమ్మెల్యేలకు మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారు. ఎప్పటికప్పుడు ఎన్నికలు కీలకమనే అంటాడు. ఏ రోటికాడ ఆ పాట అన్నట్లు ప్రతి ఎన్నికకు జగన్‌ ను గెలవనివ్వను అంటూ అదే పాట పాడుతూ ఉంటాడు. గెలపిచండానికి, గెలిపించకపోవడానికి పవన్‌ కళ్యాణ్‌ ఎవరు..? ప్రజల మనసుల్లో స్థానం ఉంటే వారే గెలిపిస్తారు. 2019లో ప్రజల మనసులను శ్రీ వైఎస్‌జగన్‌ చూరగొన్నారు. ఈ మూడున్నరేళ్లలో సేవా తత్పరతతో ప్రజలకు చేరువై వారి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తున్నానంటూ పవన్‌ మాట్లాడుతున్నాడు...ఆయనేమైనా సజ్జలకు బొడ్డుకోసి పేరు పెట్టాడా అనేది చెప్పాలి. 

మోడీని కలవడంలో పవన్‌ రెండు నాల్కలు.. 
     మూడు నాలుగు సార్లు మోడీని కలిశానని చెప్తాడు. మొన్న వైజాగ్‌లో కలిసినప్పుడు 2014 తర్వాత మోడీని కలిసి ఎనిమిదేళ్లు అయ్యింది..అందుకే నన్ను మోడీ కలవమన్నారు అని చెప్పాడు..ఇందులో ఏది నిజమో ఆయనకే తెలియాలి. నువ్వు, మోదీ ఏం మాట్లాడుకున్నారో మాకెందుకు..? ఇద్దరు కలిసి వాటేసుకోండి..తన్నుకోండి..తిట్టుకోండి మాకెందుకు..? మోడీ కాళ్లు పట్టుకునేది నువ్వే...దూరం పారిపోయి చంద్రబాబు సంకలో ఎక్కి మోడీని తిట్టేది పవన్‌ కళ్యాణే. మేము ఎప్పుడూ మోడీ అంటే మర్యాదగానే ఉంటాం. భారతీ జనతా పార్టీతో పోరాటం పోరాటంగానే కొనసాగుతుంది. మోడీతో ఏం మాట్లాడుకున్నావో çసజ్జల చెవిలో చెప్పడం కాదు...ఏం మాట్లాడుకున్నారో అని చంద్రబాబు టెన్షన్‌తో చచ్చిపోతున్నాడు..వెళ్లి ఆయన చెవిలో చెప్పండి. 

 పవన్‌ కళ్యాణ్‌ పార్టీని ఈసీ మ్యూజియంలో పెట్టాలి: 
    ఇదే ఇప్పటంలో మార్చి నెలలో మోడీగారు నాకు దారిచూపించండి అని మాట్లాడింది పవన్‌ కళ్యాణ్‌. చీకట్లో చంద్రబాబు అనే టార్ఛ్‌ లైట్‌ వేసుకుని వెళ్దామని చెప్పాడు. ఒక రాజకీయ పార్టీ పెట్టి దాని అధ్యక్షుడు నాకు రాజకీయ పంథా చూపండి అని ఎవరైనా అడుక్కుంటారా..? ఇలాంటి పార్టీలన్నిటినీ మ్యూజియంలో పెట్టాలి..ఎన్నికల కమిషన్‌ పవన్‌ మాటలను, వీడియోలను మ్యూజియంలో పెట్టాలి. పవన్‌ కళ్యాణ్‌పై పడి ఏడ్వటం కాదు లేచినప్పటి నుంచి ఆయనే జగన్‌ గారిపై పడి ఏడుస్తున్నాడు. 2009లో మహానేత రాజశేఖరరెడ్డిపై ఏడ్చాడు...2019 వరకూ జగన్‌ గారికి అధికారం లేదు..అప్పుడు కూడా పవన్‌... జగన్‌ గారిపై పడి ఏడ్చాడు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నోటికొచ్చినట్లు మాట్లాడినా మొక్కవోని దీక్షతో జగన్‌ గారు అధికారంలోకి వచ్చారు. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన పవన్‌ కళ్యాణ్‌..తనకంటే వయసులో చిన్నవాడైన జగన్మోహన్‌ రెడ్డి గారు 40 ఇండస్ట్రీ చంద్రబాబుపై పోటీ చేసి 67 సీట్లు సంపాదించారు. జగన్మోహన్‌రెడ్డి గారిని గెలవనివ్వం..శాసనం అన్నప్పుడు 151 సీట్లొచ్చాయి. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ నోట్లో వేలు పెట్టుకుని చూశాడు. రేపు 175 సీట్లు వచ్చినా నోట్లో వేలేసుకుని చూడాల్సిందే. 

 పవన్‌ అభిమానులే కాదు..అందరి అభిమానులు జగన్‌ కి ఓట్లేశారు 
    పవన్‌ కళ్యాణ్‌ మీ అభిమానులు మాత్రమే కాదు..చిరంజీవి, మహేష్, ప్రభాస్, జూనియర్‌ ఎన్టీఆర్, బన్నీ, చరణ్‌ అభిమానులు రాజకీయాల్లో జగన్మోహన్‌రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని తిరుగుతారు. ఇవన్నీ తెలుసుకోకుండా పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు వెంట తిరగడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఓ లక్ష పుస్తకాలు చదివేస్తే ఉపయోగం ఏమీ ఉండదు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి తీసిపోని విధంగా జగన్‌ గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం అమలు చేయడంలో ఏ ముఖ్యమంత్రీ శ్రీ వైఎస్‌ జగన్‌ గారితో పోటీ పడలేరు.

 మాకు అంటే ఎవరు..? చంద్రబాబు, పవనా..? 
    వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతివ్వండి అంటున్న పవన్‌ నాకు అని మాత్రం అనడం లేదు. మాకు అంటే ఎవరు..చంద్రబాబు, పవన్‌ కళ్యాణా..? లేక బీజేపీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కి మద్దతు ఇవ్వాలా అనేది మాత్రం చెప్పడం లేదు. మరో వైపు అధికారం నాదే..ముఖ్యమంత్రిని నేనే అంటున్నాడు. నా విధి విధానాలను చూసి ఓటు వేయండి అంటున్నాడనే ప్రజలు ఓట్లు వేయడం లేదు. నా సినిమాలు చూసి ఓటు వేయండి అన్నా ప్రజలు ఓట్లు వేస్తారేమో కానీ..వి«ధి విధానాలు చూసి మాత్రం జెండా మోసే కార్యకర్త కూడా ఓటు వేయడు.మాటి మాటికీ జెండాలు మారుస్తుంటే పాపం కార్యకర్తలు కూడా జెండాలు మార్చలేక చచ్చిపోతున్నారు. ఆచితూచి అడుగులు వేస్తూ వ్యూహాలు మారుస్తూ ఊసరివెళ్లిలా రంగులు మారుస్తాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక వ్యూహం ఉంటుంది..ప్రతిపక్షంలో ఉంటే మరో వ్యూహం ఉంటుంది. 2019లో గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా అన్న పవన్‌ కళ్యాణ్‌ వదల్లేదు. మళ్లీ అదే మాట ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పు రేపు అన్నట్లు మళ్లీ 2024లో గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా అంటున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటంలో రాజకీయాల్లో స్పెషలిస్టు పవన్‌ కళ్యాణే. మార్చి 14న మీటింగు పెట్టి నాకు రోడ్డు మ్యాప్‌ ఇవ్వండి అంటూ కోరినా వాళ్లు లెక్కకూడా చేయలేదు. 

ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుంటావా..?
    మొన్న మొన్నటి వరకూ నాకు కులాలు లేవు అన్నాడు. కులరహిత సమాజం కావాలని పవన్‌ కళ్యాణ్‌ సెలవిచ్చాడు. మళ్లీ ఇప్పుడు తూర్పు కాపులను పిలిచి బొత్స సత్యనారాయణకు ఓటేస్తే ఆయన జగన్‌ గారి వద్ద నోర్మూసుకుని కూర్చున్నాడంటూ చెప్తున్నాడు. మరి పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు వద్ద నోర్మూసుకుని కూర్చోవడం లేదా..? మేమంతా ఒక పార్టీని నమ్ముకుని జగన్మోహన్‌ రెడ్డి గారు మా నాయకుడు...మా పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని స్పష్టంగా చెప్తున్నాం. మరి ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఆయనే అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు వద్ద చేతులు కట్టుకోవడం ఏమిటి..? రాయలసీమ వెళ్లి బలిజలను, కోస్తా వచ్చి కాపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడాడు...ఇప్పుడు తూర్పు కాపులను కూడా రెచ్చగొట్టి చంద్రబాబు చేతిలో పెట్టాలని చూస్తున్నాడు. మున్నూరు కాపులు బతికి పోయారు..వారి వెనుక కేసీఆర్‌ ఉన్నాడు కాబట్టి వారి జోలికి వెళ్లడు.

చంద్రబాబు కాళ్ల వద్ద కాపులను తాకట్టు పెట్టొద్దు:
     సినీ ఫీల్డులో సీన్‌ లేకుండా పోయింది ఇక్కడకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ నటించేస్తున్నాడు. ఒబీసీ సర్టిఫికెట్‌ ఎవరిస్తారో కూడా పవన్‌ కళ్యాణ్‌ కి తెలియదా...కావాలని రెచ్చగొడుతున్నాడా..? ఒబీసీ సర్టిఫికెట్‌ కోసం ఆ కులాన్ని కేంద్రమే గుర్తించి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తుంది..దాన్ని ఆధారంగా తాసీల్దార్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. ముస్లింలకు జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రెండు మూడు చోట్ల ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తే కేంద్రం నుంచి తాఖీదులు వచ్చాయి. ముస్లింలను మహానేత ఉమ్మడి రాష్ట్రంలో ఒబీసీ కింద చేర్చినా కేంద్రం ఒప్పుకోలేదు. ఒబీసీలను నోటిఫై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. తూర్పు కాపుల విషయంలో మేం ప్రయత్నం చేస్తున్నా కావడం లేదు. మోడీగారు పవన్‌కి బాగా ఫ్రెండ్‌ కదా...తూర్పు కాపులపై కపట ప్రేమ చూపకుండా ఒబీసీ సర్టిఫికెట్‌ ఇప్పించాలి. కాపులను వాడుకోవాలి అనుకున్నప్పుడు మోడీ గారికి ఫోన్‌ చేసి ఒబీసీ సర్టిఫికెట్‌ ఇప్పించండి. బొత్స సత్యనారాయణ అంటే ఏ పార్టీలో ఉన్నా కాపు కులస్తుల్లో పెద్దోడనే గౌరవం ఇస్తారు. చంద్రబాబు కోసం కాపులను ఆయన కాళ్ల దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం కట్టిపెట్టండి. 

మావాడనే చంద్రబబు సంక ఎక్కొద్దని హితవు చెప్తున్నాం.. 
    పవన్‌ కళ్యాణ్‌ తెగువ, గుండె ధైర్యం సినిమాల్లో కాదు...రాజకీయాల్లో చూపించాలి. దమ్ముంటే 175కి 175 స్థానాల్లో పోటీ చేసి తన తెగువను ప్రదర్శించాలి. సాటి కాపు కులస్థుడిగా, కాపుల్లో ఒక మంత్రిగా చేసిన వాడిగా మనోడు ఇలా చెడిపోతున్నాడేమిటీ అని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. వేరే కులాల వారు చెప్తే ఫీలవుతాడని మేమే ఆయన చంద్రబాబు సంక ఎక్కవద్దు అని చెప్తున్నాం.

 అభిమానులను రెచ్చగొట్టాలని చూడటం రౌడీయిజమే: 
    పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు అమాయకులు. వారిని రెచ్చగొట్టి వారితో తప్పులు చేయించి ఎవర్నో భయపెట్టాలని పవన్‌ చూస్తున్నాడు. అలాంటి మనిషిని రౌడీ అనక ఏమంటారు..? గుడ్డలూడదీసి తంతా..కాలర్‌ పట్టుకుంటాను..ఎగిరెగిరి తంతాను అని మైకులో చెప్తున్నాడు..దాన్ని ప్రజాస్వామ్యం అంటారా..? రౌడీయిజం అంటారా..? అనేది పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి. దమ్ముంటే ప్రజాస్వామ్యంలో 175 చోట్లా పోటీ చేసి జగన్మోహన్‌ రెడ్డి గారిని ఓడించు. నోటి తీట తీర్చుకుంటాని, మైకు పట్టుకుని బూతులు తిడితే రౌడీయిజం కాక ఏమవుతుంది పవన్‌ కళ్యాణ్‌..?

 ఒక్కో సినిమాకి 18 కోట్లు సంపాదన: 
    అన్ని చోట్లా నా కష్టార్జితం అంటూ చాలా డబ్బులు పంచుతున్నాడు. మేం ఇవ్వడం ఆలస్యమైతే ఆయనే వెళ్లి ఇవ్వొచ్చు. ఎనిమిదేళ్లలో 6 సినిమాలు చేశానని, 120 కోట్లు సంపాదించానని పవన్‌ చెప్తున్నాడు. అంటే సినిమాకి 18 కోట్లు తీసుకుంటున్నాను అని చెప్పకనే చెప్తున్నాడు. ఆ డబ్బులున్నాయిగా ప్రజలకు ఇవ్వొచ్చు. మోడీగారిని తిట్టాడు...పాచిపోయిన లడ్లు అన్నాడు..చంద్రబాబు కొడుకును ఈ భూ ప్రపంచంలో ఇంత లంచగొండి ఎవరూ లేరన్నాడు. మళ్లీ చొక్కా మార్చినంత త్వరగా మాట మారుస్తాడు. 

 చంద్రబాబు ఫ్యాన్స్‌ అధ్యక్షుడు రామోజీ: 
    చంద్రబాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ లో అద్యక్షుడు రామోజీరావు అయితే ప్రధాన కార్యదర్శి పవన్‌ కళ్యాణ్‌ . చంద్రబాబు అధికారంలో ఉంటే రామోజీ ఈ రాష్ట్రంలో మద్యం అమ్మితే తప్ప ఆదాయం రాదని చెప్తాడు. చంద్రబాబు అధికారంలో లేకపోతే మద్యం ఏరులై పారిపోతుంది అంటూ రాస్తాడు. దేశంలో ఎక్కడా మద్యం ఉండకూడదు కానీ తారా, సితారాలో మాత్రం ఉండాలంటాడు. ఎక్కడా నైట్‌ లైఫ్‌ ఉండకూడదు కానీ రామోజీ ఫిల్మ్‌ సిటీలో మాత్రం బెల్లీ డాన్సులు ఉండొచ్చన్నట్లు రాతలు రాస్తాడు.  

 ఈ రాష్ట్రానికి బీజేపీ వల్ల దమ్మిడి ఉపయోగం ఉందా..? 
    ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ వల్ల దమ్మిడి ఆదాయం లేదు. అయినా వాళ్లేదో చేస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటుంటే మేం చేసింది చెప్పకోవడంలో తప్పేమీ లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు పేర్ని నాని సమాధానమిచ్చారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసి, రైల్వే జోన్‌ శంకుస్థాపన చేస్తానని చేయకుండా వెళ్లారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ఇస్తానని, రామాయపట్నం పోర్టు కడతానని కట్టకుండా వెళ్లింది బీజేపీనేనని పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. 

Back to Top