గూడూరులో వైయస్ఆర్‌సీపీ ర్యాలీకి పోలీసుల అడ్డంకి

జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని రెండు గంటల పాటు నిలిపివేత

 డీఎస్సీ అక్రమాలపై పోరాటాన్ని అణచివేసే కుట్ర అని మండిపడ్డ నేతలు

నెల్లూరు జిల్లా : డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలకు నిరసనగా గూడూరులో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూదూరు గురవయ్యలను గూడూరులోకి వెళ్లనీయకుండా దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై నిలిపివేశారు. చివరకు నడిచి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా వ్యవహరించడాన్ని వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు

శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలు, నిరసనలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాకాని గోవర్ధన్‌రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. డీఎస్సీ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకే వైయస్సార్‌సీపీ చేపడుతున్న పోరాటాన్ని అణచివేసేందుకు పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం "రెడ్‌బుక్" విధానాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష గొంతును అణచివేస్తోందని నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని, దానిని అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. పోలీసులు ఇదే తరహాలో వ్యవహరిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించిన వైయస్ఆర్‌సీపీ నేతలు, డీఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉద్యమాలను కొనసాగిస్తాయని తెలిపారు.

 

Back to Top