రైల్వే కోడూరు: తిరుపతి జిల్లా చిట్వేలి, పెనగలూరు మండలాల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రైల్వే కోడూరులోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్రమ ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలకు అనుమతించిన పరిమితికి మించి భారీగా ఇసుకను తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఒక మీటరు లోతు వరకు మాత్రమే మాన్యువల్‌గా ఇసుక తీయాల్సి ఉండగా, భారీ యంత్రాలతో ఇష్టానుసారంగా లోతుగా తవ్వేస్తున్నారని విమర్శించారు. దీంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. పెనగలూరు మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం వద్ద గ్రామస్తులు అడ్డుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, 25 టన్నుల సామర్థ్యం ఉన్న లారీల్లో 60 నుంచి 70 టన్నుల వరకు ఇసుక లోడ్ చేసి తరలిస్తున్నారని చెప్పారు. అధిక లోడుతో రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ, జియాలజీ, ఆర్టీవో, పోలీసు శాఖల అధికారులు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించడం లేదని ప్రశ్నించిన కొరముట్ల శ్రీనివాసులు, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్న ప్రజలపైనే కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, లేకపోతే వైయస్ఆర్‌సీపీ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు.