శ్రామికులుగా కాదు.. పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఎస్సీ, ఎస్టీల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం

దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమం ప్రారంభించాం

ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను

రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా రూ.కోటి ఇన్సెంటివ్స్‌

రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చడమే లక్ష్యం

సచివాలయాల్లో 82 శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకే దక్కాయి

గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు

‘జగనన్న వైయస్‌ఆర్‌ బడుగు వికాసం’ ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌
 

తాడేపల్లి: ‘దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ‌ల వారు కేవలం శ్రామికులుగా ఉండే రోజులు పోవాలి.. ఎవరికీ తీసిపోని విధంగా వీరు కూడా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా మారాలని మనసారా కోరుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న వైయస్‌ఆర్‌ బడుగు వికాసం’ పేరుతో రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏం మాట్లాడారంటే..

దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా 1కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం. ఎస్సీల్లో, ఎస్టీల్లో పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకువస్తున్నాం. వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ తీసుకువచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీల కోసం ఫెసిలిటేషన్‌ సెల్‌ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వం చొరవ తీసుకొని చేస్తున్న కార్యక్రమాలు. ప్రభుత్వ చొరవతో ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ఎస్సీ, ఎస్టీల నుంచి రావాలని మనసారా కోరుకుంటున్నాను. 

ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూములు కచ్చితంగా ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశాం. దీని ద్వారా ఊతం వస్తుందని నమ్ముతున్నాను. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, పవర్‌ చార్జీల్లో రాయితీలు, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు... ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి. 

ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి. వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు, 30 లక్షల పక్కా ఇళ్లు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ వంటి పథకాలు తెచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. పూర్తి ఫీజురీయింబర్స్‌ మెంట్‌ అమలుచేస్తున్నాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, కుల,మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు, వలంటీర్ల వ్యవస్థను చేపట్టాం. ఆసరా, చేయూత లాంటి పథకాలను ప్రవేశపెట్టాం.  

మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్‌ను, ఐటీసీ, పీ అండ్‌జీని, రిలయన్స్‌లాంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకువచ్చాం. మార్కెటింగ్‌ పరంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. శాశ్వతంగా వీళ్లకు మంచి జరగాలని భావితరంతో పోటీపడేలా ఎదగాలని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌మీడియం తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం. దేవుడి దయతో అందరికీ మంచి జరగాలని, అందరికీ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top