తిరుపతి: ‘రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఏడేళ్లు దాటినప్పటికీ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఇప్పటికీ పూర్తిగా అమలు చేయడం లేదు. దాంతో రాష్ట్రం మరింతగా నష్టపోతోంది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని విభజన చట్టం హామీలను అమలు చేయాలి’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతిలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన అనేక కీలక అంశాలపై కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజనకు సంబంధించి అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని చెప్పారు. దాంతో రెండు రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై కూడా అవి ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఏపీ ఎంతగానో నష్టపోతున్న దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే ► రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ మేరకు కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తిగా కట్టాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జాప్యం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంలో 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండడం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. ► సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సీసీ) వంటి పలు కేంద్ర కమిటీలు కూడా పెరిగిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అనుమతించాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013–14 నాటి వ్యయం అంచనా మేరకే నిధులిస్తామని, మిగిలిన వనరులను రాష్ట్రమే స్వయంగా సమకూర్చుకోవాలని కేంద్రం చెబుతోంది. ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీని నేరుగా ఉల్లంఘించడమే. ► ప్రాజెక్టులో తాగునీటి కాంపొనెంట్‌కు నిధులు విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఏ జాతీయ సాగునీటి ప్రాజెక్టులో అయినా, సాగునీటి సరఫరాతో పాటు, తాగు నీటి సరఫరా పనులను కలిపి చూస్తారు. ఈ రెండింటినీ కలిపే.. ప్రాజెక్టు ఖర్చులను నిర్ధారిస్తారు. ► అయితే ఇక్కడ చోటుచేసుకుంటున్న దురదృష్టకర పరిణామాల వల్ల రాష్ట్రానికి జీవనాడి, ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలో పడేసే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు మంజూరు చేయాలి. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యేందుకు పూర్తి నిధులను కేంద్రం మంజూరు చేసి విడుదల చేయాలి. రెవెన్యూ లోటు కేంద్రమే పూడ్చాలి ► రాష్ట్ర విభజన జరిగాక మొదటి ఆర్థిక సంవత్సరం.. 13వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు జరుగుతున్న కాల వ్యవధిలో ఉంది. ఆ మేరకు నాటి ప్రధాని రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తేదీ (అపాయింటెడ్ డేట్), 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుకు మధ్య కాలంలో ఉత్పన్నమయ్యే రీసోర్స్ గ్యాప్‌ను, ఒక పరిహారంగా 2014–15 కేంద్ర బడ్జెట్ ద్వారా నిధులు ఇచ్చి పూడుస్తామని స్పష్టంగా చెప్పారు. ► రీసోర్స్ గ్యాప్ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించనప్పటికీ, అది రెవెన్యూ లోటు అని స్పష్టంగా చెప్పవచ్చు. 2014–15కు సంబంధించి కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లు. మరోవైపు నిధుల కొరత వల్ల కీలకమైన ఆర్థిక లావాదేవీలు కూడా రాష్ట్రం పూర్తి చేయలేకపోయింది. నిజానికి అవి నాడు కేంద్రం స్పష్టంగా ఇచ్చిన హామీ రీసోర్స్ గ్యాప్ చెల్లింపులకు సంబంధించినవే. ► ఆ నేపథ్యంలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర మొత్తం రెవెన్యూ లోటు (రీసోర్స్ గ్యాప్) ఏకంగా రూ.22,948.76 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రామాణిక వ్యయం’ (స్టాండర్డైజ్‌డ్ ఎక్స్‌పెండీచర్) అన్న విధానాన్ని తీసుకువచ్చింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.4,117.89 కోట్ల లోటు మాత్రమే పూడ్చగలమని తెలిపింది. దాంతో నాడు కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల ఆ లోటు అలాగే మిగిలిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దష్ట్యా ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి. విద్యుత్ బకాయిలు రూ.6,112 కోట్లు ► రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల చెల్లింపు అంశం అపరిష్కృతంగా ఉంది. తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ► రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో)కు ఆ మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ డిస్కమ్‌లు ఆ మొత్తం చెల్లించలేదు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయలేమని ఏపీ జెన్‌కో స్పష్టం చేసింది. ► అయినప్పటికీ కేంద్ర విద్యుత్ శాఖ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుని, తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాల్సిందేనని నిర్దేశించింది. దీంతో అనివార్యంగా ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల పాటు కొంత మొత్తం చెల్లించగా, ఇంకా రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ► ఆ బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక వైఖరి తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ డీమెర్జర్ ప్లాన్) ఇంకా తేలలేదు కాబట్టి, అవి పూర్తయిన తర్వాత ఈ బకాయిల గురించి ఆలోచిస్తామంటూ ముడి పెట్టింది. మూడేళ్ల పాటు కొంత మొత్తం చెల్లించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ మెలిక పెట్టింది. అది పూర్తిగా అసమంజస నిర్ణయం. ► బకాయిలు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఏపీ జెన్‌కో కూడా సతమతమతుండటం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. నాడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సమస్యను పరిష్కరించాలి. ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందే ► విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాల్లో ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ ఒక ప్రధాన అంశం. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ, నిబంధనతోనే రాష్ట్రాన్ని విభజించారు. అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. ► విభజన చట్టంలోని 8వ షెడ్యూల్ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. ► బుందేల్‌ఖండ్‌కు ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అత్యంత అల్పంగా దీన్ని అమలు చేశారు. ► షెడ్యూల్ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ అంశం ఉంది. వాటి విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు. అయితే ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడంతో ఆస్తుల పంపిణీ జరగక ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దష్ట్యా వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వ అత్యవసర జోక్యం తప్పనిసరి. కోరినప్పుడల్లా నీరిస్తున్నా.. ► 1976, 1977, 1983 నాటి అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు పూర్వ ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిలో 5 టీఎంసీల చొప్పున చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కేటాయించాల్సి ఉంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ‘తెలుగు గంగ’ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు సరఫరా చేస్తూనే ఉంది. ► అయితే ఇందు కోసం తగిన వసతుల కల్పన, నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు సంబంధించి పదేళ్లుగా ఆ రాష్ట్రం నుంచి రూ.338.48 కోట్లు రావాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వీలైనంత త్వరగా ఆ బకాయిలు చెల్లించేలా చూడాలి. ► పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కుప్పం ప్రజలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. పాలారు ప్రాజెక్టు ద్వారా కేవలం 0.6 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నాం. మరోవైపు తమిళనాడు అవసరాల కోసం ఏటా దాదాపు 10 టీఎంసీల నీటిని పంపుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో పాలారు నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. నికర రుణ పరిమితిలో కోత అన్యాయం ► ఈ ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)ని రూ.42,472 కోట్లుగా నిర్థారించింది. అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ద్రవ్య బాధ్యత బడ్జెట్ యాజమాన్యం (ఎఫ్‌ఆర్‌బీఎం)కు అనుగుణంగా ఆ మొత్తం నిర్థారించారు. ► అయితే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ... ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితిలో రూ.19,923.24 కోట్లు సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఇలా చేయడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించ లేదు. పైగా నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించింది. ► 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది ఆడిట్ ఖాతాల వివరాలను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడంతో పాటు, ఆ వివరాలను 2018 ఏప్రిల్ 6 నాటికి అందరికీ (పబ్లిక్) అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడే ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పరిమితికి మించి రుణం సేకరించిన విషయం అప్పటికే తేటతెల్లమైనప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు? దాన్ని కట్టడి చేస్తూ ఆ తర్వాత ఏడాది అంటే 2018–19లోనే రుణ సేకరణలో పరిమితి ఎందుకు విధించలేదు? ► ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. పరిమితికి మించి అంటూ కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తోంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవి గ్రాంట్ కాదు. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న రుణాలు అవి. ఈ రుణాలను సక్రమంగా తీరుస్తోంది కూడా. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. ► గత ప్రభుత్వం తమ ఐదేళ్ల పాలనలో అధిక మొత్తంలో రుణాలు సేకరించిందంటూ.. ఊహించని విధంగా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. మరోవైపు ఇప్పటికే కోవిడ్ మహమ్మారితో ప్రభుత్వం ఆర్థికంగా సతమతమవుతోంది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి చైర్మన్‌గా కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలి. మరింత మంది లబ్ధిదారులకు రేషన్ అందించాలి ► రేషన్ బియ్యం కేటాయింపులో హేతు బద్ధత లేని రీతిలో కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాల్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 2.68 కోట్ల మందికి రేషన్ అందుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 61 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41 శాతం మందికి మాత్రమే రేషన్ సరుకులు అందుతున్నాయి. ► నిజానికి ఇది ఏ మాత్రం సరికాదు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందిని ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇక్కడి కంటే కనీసం 10 శాతం ఎక్కువ మందికి రేషన్ సరుకులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. అక్కడ మాదిరిగా టయర్–1 నగరాలు ఏపీలో లేవు. ► జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో కేంద్రం గుర్తించిన లబ్ధిదారుల (పీడీఎస్ లబ్ధిదారులు)కు తోడు మరో 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రేషన్ సరుకులు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. రాష్ట్ర జనాభా, ఇక్కడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పీడీఎస్‌లో మరింత మంది లబ్ధిదారులను చేరుస్తూ, ఆ గణాంకాలు సవరించాలి. విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం 2015–16లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అది కేవలం రూ.8,979 మాత్రమే. ఈ లెక్కన విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో నష్టపోయిందో చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రుణ పరిమితిలో కోత ఎలా విధిస్తారు? అనాడే కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకు అభ్యంతరం తెలుప లేదు? 2018–19 లోనే రుణ పరిమితిలో ఎందుకు కోత విధించ లేదు? ప్రస్తుత ప్రభుత్వంలో రుణ పరిమితిలో కోత విధిస్తామనడం అన్యాయం కాదా?