తుపాన్‌ వల్ల కోవిడ్‌ రోగులకు ఇబ్బందులు తలెత్తకూడదు

లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించండి

ఆక్సిజన్‌ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలి

అవసరమైతే సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలి

ఆస్పత్రుల వద్ద విద్యుత్‌ సిబ్బందితో పాటు డీజిల్‌ జనరేటర్లు ఉండాలి 

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: యాస్‌ తుపాన్‌ వల్ల కోవిడ్‌ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ముందుజాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే.. వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని సూచించారు. యాస్‌ తుపాన్‌ ప్రభావంపై కేంద్రమంత్రి అమిత్‌షాతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను వెంటనే సహాయక శిబిరాల్లోకి చేర్చాలన్నారు. సహాయక శిబిరాల్లో అన్ని రకాల సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. కోవిడ్‌ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైతే సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. 

ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆక్సిజన్‌ సిలిండర్లను రీఫిల్లింగ్‌ చేసే ప్లాంట్లకూ విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఆస్పత్రులకు కరెంట్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్‌ జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా విద్యుత్‌ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. 

తుపాన్‌ కారణంగా ఒడిశా ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ సేకరణకు ఇబ్బంది వస్తే.. ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. తగినంత ఆక్సిజన్‌ నిల్వలు పెట్టుకోవాలని సూచించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆక్సిజన్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, తుపాన్‌ పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.  
 

తాజా వీడియోలు

Back to Top