ఆధునిక‌ భారతీయ మహిళ మన రాష్ట్రం నుంచే ఆవిర్భవించాలి

మహిళా దినోత్సవ వేడుకల్లో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 
మహిళ అంటే ఆకాశంలో సగభాగం, సృష్టిలో కూడా సగభాగం 

అక్కచెల్లెమ్మలు అందిస్తున్న గొప్ప సేవలకు కొలమానం లేదు 

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తుల నోట్ల నుంచి వచ్చిన మాటలు చూసి ఆశ్చర్యపోయాను
 
21 నెలల పాలనలోనే అక్కచెల్లెమ్మల చేతుల్లో.. నేరుగా రూ.80 వేల కోట్లు జమ 

తాడేపల్లి: 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రం నుంచే ఆవిర్భవించాలనే ధృడ సంకల్పంతో.. రేపటి తరం చిన్నారులకు సింహ భాగం అన్ని పథకాల్లో వారికిచ్చామని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సగర్వంగా పేర్కొన్నారు. మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నిజంగా స‌గ భాగం ఇస్తున్నామా?
రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు, చిన్నారులకు, అవ్వలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మహిళ అంటే ఆకాశంలో సగభాగం, సృష్టిలో కూడా సగభాగం అంటారు. అటువంటి మహిళలు, అక్కచెల్లెమ్మలకు మనమంతా గుండెలపై చేతులు వేసుకొని ఆలోచనలు చేయాలి. వారందరికీ నిజంగా సగభాగం ఇస్తున్నామా..? హక్కుల్లో సగభాగం ఇస్తున్నామా..? వాళ్లకు రావాల్సిన రాజకీయంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో ఇస్తున్నామా.. లేదా అనేది మనమంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 

వారే క్రియాశీలకం... 
నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మహిళల కష్టాలు నా కళ్లారా చూశా.. మామూలుగా అయితే ఎవరైనా కూడా ఉన్నత స్థానాల్లో, పదవుల్లో ఉన్నవారినే మన సమాజం కొద్దోగొప్పో గౌరవం ఇస్తూ చూసుకుంటుంది. ఆ స్థాయిలో లేకపోయినా కూడా పొలాల్లో కూలీలుగా, నాట్లు మొదలు కోతలు వరకు, ప్రతి దశలోనూ అక్కచెల్లెమ్మలు మనకు కనిపిస్తూనే ఉంటారు. పొలం పనుల్లో, ఇంటిని చూసుకునే బాధ్యతలో, గ్రామాల్లో పాడిపశువుల పెంపకంలో, ఎంఎస్‌ఎంఈ సెగ్మెంట్లలో కనిపిస్తుంటారు. దేశ గర్వించే విధంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఉద్యమంలో వారే క్రియాశీలకంగా ఉంటారు. ఇంటిని అన్ని రకాలుగా బాగుపరచాలనే తపన, తాపత్రయం అక్కచెల్లెమ్మల్లోనే కనిపిస్తుంది. అటువంటి అక్కచెల్లెమ్మలు గుర్తింపు లేకపోయినా ప్రతి ఇంట్లోనూ వీళ్లంతా ఉన్నతంగా మనల్ని చూసుకోబట్టే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామని గమనించాలి.

వారి ‌సేవ‌ల‌కు కొల‌మానం లేదు..
భూదేవి అంతటి సహనంతో, మానవత్వపు మమతలతో, కుటుంబానికి చుక్కానిలా.. కష్టాలను, నష్టాలను దిగమింగుకుంటూ ఇంటింటా మహిళా మూర్తులు అందిస్తున్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొలమానాలు లేవు. జీడీపీ, జీఎస్‌డీపీ లెక్కలు చూసుకున్నా కూడా.. అక్కచెల్లెమ్మలు అందిస్తున్న గొప్ప సేవలకు కొలమానం లేదు. 

మన సమాజం ఎటుపోతుందో ఒకసారి ఆలోచన చేయాలి...
ఈ రోజు ఇంత గొప్పగా సేవలు అందిస్తున్న అక్కచెల్లెమ్మలకు నిజంగా వాళ్ల పరిస్థితులను, వారి అభివృద్ధికి, సమానత్వానికి సంబంధించిన వాస్తవాలు ఏరకంగా ఉన్నాయని గమనిస్తే.. మన ఆడబిడ్డలకు దక్కుతున్న ప్రాధాన్యం ఏంటని గమనిస్తే.. ఆంధ్రరాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 2011 జనాభా లెక్క వివరాలు గమనిస్తే.. కేవలం 60 శాతం మాత్రమే అని తెలుస్తోంది. ఇప్పటికీ 40 శాతం మహిళలు చదువులకు దూరంగా ఉన్నారనే వాస్తవం కనిపిస్తుంది. ఆహారం మొదలు, అధికారం వరకు అన్ని అంచనాల్లో, గర్భస్త శిశువు నుంచి జీవనసంధ్యలో ఉన్న అవ్వ వరకు స్త్రీల‌పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే.. మన సమాజం ఎటుపోతుందో ఒకసారి ఆలోచన చేయాలి.

 కనీసం స్పృహ కూడా లేకుండా మాట్లాడారు. ..
నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు.. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తుల నోట్ల నుంచి వచ్చిన మాటలు చూసి ఆశ్చర్యపోయాను. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి కోడలు మగపిల్లాడిని కంటానంటే.. అత్త వద్దంటుందా.. అని మాట్లాడారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తికి ‘కారు షెడ్‌లో ఉండాలి.. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి’ అని మాట్లాడారు. ఇటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కనీసం స్పృహ కూడా లేకుండా మాట్లాడారు. 

ప్రతి అడుగు వారి మంచి కోసం.. 
ఇటువంటి దారుణమైన పరిస్థితులు మార్చాలి.. అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మలను ముందు వరుసలో నిలబెట్టాలని చెప్పి అక్కచెల్లెమ్మల కోసం ఈ 21 నెలల పాలనలో ప్రతి అడుగు వారి మంచి కోసం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యారంగంలో అన్ని రంగాలో పైకి తీసుకురావాలని అడుగులు ముందుకువేయడం జరిగింది. ఇందులో భాగంగానే.. అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. 

ఇప్పటికే రూ.80 వేల‌ కోట్లు ఇవ్వ‌గ‌లిగాం..
చదువురాని వారు ఏ ఒక్కరూ ఉండకూడదు అని, చదువులకు పేదరికం అడ్డుకాకూడదని, వందశాతం అందరూ చదువుకోవాలని, ఆడపిల్లలంతా బడిబాట పట్టి గొప్పగా చదవాలని, ఇంగ్లిష్‌ మీడియం, నాడు–నేడు మొదలు వసతులు మెరుగుపర్చడం, గోరుముద్ద, సంపూర్ణ పోషణతో పాటు అమ్మఒడి అనే గొప్ప పథకాన్ని తీసుకొని అక్షరాల 44.50 లక్షల మంది తల్లులకు తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ఏటా అమ్మఒడి పథకం ద్వారా రూ.6500 కోట్లు చొప్పున కేటాయించాం. రెండేళ్ల పరిపాలన పూర్తవ్వకముందే ఇప్పటికే రూ.13,022 కోట్లు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇవ్వగలిగామని గర్వంగా తెలియజేస్తున్నా.

అమ్మఒడి పథకం ద్వారానే ఐదేళ్లలో తల్లులకు అక్షరాలు రూ.32,500 కోట్లు నేరుగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది. 

వైయస్‌ఆర్‌ ఆసరా పేరుతో మరో పథకాన్ని అక్కచెల్లెమ్మల కోసం తీసుకువచ్చాం. అక్షరాల 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, 8.71 లక్షల గ్రూపులకు ఇప్పటి వరకు కలిగిన లబ్ధి రూ.6,792 కోట్లు. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారానే అక్కచెల్లెమ్మలకు కలగబోయే లబ్ధి రూ.27,163 కోట్లు జరగబోతుంది.

వైయస్‌ఆర్‌ చేయూత అని మరో పథకాన్ని తీసుకువచ్చాం. అక్షరాల 24.56 లక్షల మంది 45 నుంచి 60 సంవత్సరాలలోపు వయస్సున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు పథకం అందిస్తున్నాం. ఆర్థిక స్వావలంబన అక్కడి నుంచే మొదలుకావాలి.. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు చాలా బాధ్యత కలిగిన వయసు అని భావించి.. అక్కలకు మంచి చేయాలనే ఉద్దేశంతో 24.56 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా రూ.4,604 కోట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పథకం ద్వారానే అక్కచెల్లెమ్మలకు ఈ నాలుగేళ్లలో రూ.18,750 కోట్లు నేరుగా జమ చేయనున్నాం. 

అమ్మఒడి, వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత.. కేవలం ఈ మూడు పథకాల ద్వారానే అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 78 వేల కోట్లకు పైగా ఇవ్వబోతున్నాం. లంచాలకు తావులేకుండా, వివక్ష ఎక్కడా లేకుండా.. పాత అప్పులకు జమ కాని విధంగా నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోనే డబ్బులు జమ చేస్తున్నాం. 

ఇంకా గర్వపడే విషయం ఏంటంటే.. కేవలం 21 నెలల పాలనలోనే అక్కచెల్లెమ్మల చేతుల్లో.. నేరుగా రూ.80 వేల కోట్లు జమ చేయగలిగామని ఆ అక్కలకు తమ్ముడిగా, ఆ చెల్లెమ్మలకు అన్నగా గర్వంగా చెబుతున్నా. 
వైయస్‌ఆర్‌ అమ్మ ఒడి రూ.13 వేల 22 కోట్లు ఇచ్చాం. 
వైయస్‌ఆర్‌ కాపు నేస్తం రూ.491 కోట్లు ఇచ్చాం.
వైయస్‌ఆర్‌ చేయూత రూ.4,604 కోట్లు ఇచ్చాం.
వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ రూ. 1400 కోట్లు
వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం రెండు సార్లు రూ.383 కోట్లు
వైయస్‌ఆర్‌ ఆసరా రూ.6792 కోట్లు
వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక (అక్కచెల్లెమ్మలు మాత్రమే ఇంత వరకు తీసుకున్నది) రూ.15613 కోట్లు,
వైయస్‌ఆర్‌ రైతు భరోసా (అక్కచెల్లెమ్మలకు) రూ.3,567 కోట్లు
వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా (అక్కచెల్లెమ్మలకు) రూ.4.58 కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.1220 కోట్లు
జగనన్న విద్యా దీవెన రూ.1806 కోట్లు
వైయస్‌ఆర్‌ వాహన మిత్ర (అక్కచెల్లెమ్మలకు) రూ.45.69 కోట్లు
లా నేస్తంలో కూడా కేవలం అక్కచెల్లెమ్మలను తీసుకుంటే.. రూ. 3.24 కోట్లు
జగనన్న తోడులో రూ.136 కోట్లు
వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరాలో రూ.50 కోట్లు
జగనన్న గోరు ముద్దలో చిన్నారులకు రూ.415 కోట్లు
వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ రూ. 1863 కోట్లు
అక్కచెల్లెమ్మలకు అక్షరాల 30.76 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ రూ. 27 వేల కోట్లు
వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ రూ.824 కోట్లు 
జగనన్న విద్యా కానుక ద్వారా చిట్టి చెల్లెమ్మలకు రూ.334 కోట్లు
వెరసి అక్షరాల రూ.80 వేల కోట్లు 21 నెలల్లో అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడాలని, ఆర్థిక స్వావలంబన కోసం చేయగలిగామని గర్వంగా చెబుతున్నా.. 

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో అక్షరాల 31 లక్షల ఇళ్లు.. వీటి నిర్మాణం కూడా లెక్కలోకి తీసుకుంటే.. కనీసం అంటే వీటి విలువ రూ.7 నుంచి రూ.10 లక్షల ఆస్తిని ఒక్కో అక్కచెల్లెమ్మలకు క్రియేట్‌ చేస్తున్నాం. ఈ స్థాయిలో మంచి చేసే అవకాశం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్ల వచ్చింది. 

అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలని, రాజకీయంగా వాళ్ల మీద వారు నిలబడాలని, కేవలం ఒంటింటికే పరిమితం కాకూడదు.. అక్కచెల్లెమ్మలు దేశానికి కూడా దిశ చూపించే పరిస్థితిలోకి రావాలని నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలని ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది అని గొప్పగా చెబుతున్నా. 

దిశ పోలీస్‌ స్టేషన్‌లు తీసుకువచ్చాం. అక్కచెల్లెమ్మలను వేధిస్తే వారికి తగిన బుద్ధి వెంటనే వచ్చేలా 13 జిల్లాలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 2019తో పోల్చితే 2020లో మహిళల మీద నేరాలను 7.5 శాతం తగ్గించగలిగాం. మహిళలపై జరిగే నేరాల దర్యాప్తుకు గతంలో 100 రోజులు పట్టేది.. ఇప్పుడు 53 రోజులకు తగ్గించగలిగాం. 7 రోజుల్లోపే 563 నేరాలకు సంబంధించిన చార్జ్‌షీట్లు తయారు చేయగలిగాం. సైబర్‌ నేరాలకు సంబంధించి 1531 కేసుల్లో, లైంగిక వేధింపులకు పాల్పడే నేరగాళ్ల మీద 1194 కేసుల్లో చార్జ్‌ షీట్లను కూడా నమోదు చేయగలిగాం. 

ఏ చెల్లెమ్మకు ఏ సమస్య వచ్చినా కూడా దిశ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకొని బటన్‌ నొక్కిన వెంటనే కేవలం 20 నిమిషాల్లో పోలీసులు వారి దగ్గరకు వచ్చి అన్ని రకాలుగా తోడుగా ఉండే వ్యవస్థను కూడా తీసుకురాగలిగాం. 

ఈ ఏడాది మహిళా దినోత్సవం నేపథ్యంలో అక్కచెల్లెమ్మల కోసం మరిన్ని అడుగులు ముందుకు వేస్తూ నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అక్కచెల్లెమ్మలకు ఇంత వరకు క్యాజువల్‌ లీవ్స్‌ 15 ఉంటే.. ఇవాల్టి నుంచి 20 రోజులకు పెంచుతూ ప్రకటన కూడా చేయడం జరిగింది. 

చిట్టి చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ప్రముఖ కంపెనీలతో మాట్లాడి బయోడీగ్రేడబుల్‌ శానిటరీ న్యాప్‌కిన్స్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమం చేసేందుకు అధికారులు అడుగులు ముందుకు వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న చిట్టి చెల్లెమ్మలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందించే కార్యక్రమం జూలై 1 నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. చేయూత కిరాణా షాపుల్లో తక్కువ ధరకే ఇవే నాణ్యమైన శానిటరీ న్యాప్‌కిన్స్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమం జూలై 1కి చేయబోతున్నాం. 

దిశ చట్టం కింద నమోదు చేసిన కేసుల సత్వర దర్యాప్తు కోసం ప్రత్యేకంగా 18 వాహనాలను ఇవ్వడం జరిగింది. కేసు దర్యాప్తు చేసే బృందం ఒకేసారి నేరం జరిగిన ప్రదేశానికి ఈ వెహికిల్స్‌లో తరలిరావడం వల్ల వేగంగా కేసు దర్యాప్తు జరుగుతుంది. బాధితురాలితో పాటు పౌరుల్లో కూడా దిశ పోలీసులపై ఒక విశ్వాసం కలిగే విధంగా ఈ చర్య ఉపయోగపడుతుంది. ఈ వాహనాల్లో దర్యాప్తును చేధించే పరికరాలు కూడా ఉంటాయి. 

మహిళా దినోత్సవం సందర్భంగా దిశ పెట్రోలింగ్‌ అని, మహిళల రక్షణ కోసం మహిళా కానిస్టేబుళ్లతో పెట్రోలింగ్‌ చేయించేందుకు ప్రత్యేకంగా 900 స్కూటీలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ జీపీఎస్, దిశ యాప్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌తో అనుసంధానం చేయడం జరుగుతుంది. స్నేహపూర్వకంగా పనిచేసే ఈ పోలీసులంతా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు డివిజన్‌ స్థాయిలో పెట్రోలింగ్‌ బృందాలతో నేరుగా అనుసంధానమై ఉంటారు. మహిళలు, విద్యార్థులపై నేరాలకు ఎక్కువగా అవకాశం ఉన్న మార్కెట్, స్కూల్స్, కాలేజీల ప్రాంగణాల్లో తిరుగుతూ పెట్రోలింగ్‌ చేస్తారు. వీటి ద్వారా చెల్లెమ్మల రక్షణకు అవకాశాలు మెరుగవుతాయి. 

మహిళలు ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా సహాయక డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ డెస్క్‌లలో మహిళా అధికారులే పనిచేస్తారు. స్టేషన్‌కు వచ్చిన మహిళ సమస్య వినడం మొదలు, ఎలా ఫిర్యాదు చేయాలి.. ఫిర్యాదు పత్రం రాయడం, సమస్య పరిష్కారం అయ్యే వరకు మహిళా సహాయక డెస్క్‌లు తోడుగా ఉంటాయి.  

మహిళా దినోత్సవం సందర్భంగా సైబర్‌ కియాస్క్స్‌ ప్రారంభించడం జరుగుతుంది. మహిళల మీద సైబర్‌ నేరాలను అరికట్టడానికి.. ఆర్థిక నేరాలు, మోసాలు, ప్రైవసీకి భంగం కలిగించే సాఫ్ట్‌వేర్స్, మొబైల్‌ ఫోన్స్‌లో చొరబడే మాల్వేర్, వైరస్‌ను ఈ కియాస్క్స్‌ ద్వారా గుర్తించనున్నాం. ఇప్పటికే 50 కియాస్క్స్‌ కొనుగోలు చేయగా.. వాటిని దిశ మహిళా పోలీస్‌ స్టేషన్లతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పబ్లిక్‌ ప్లేసుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 

మనం అమలు చేస్తున్న ప్రతిపథకం, ప్రతి కార్యక్రమంలోనూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. మారుతున్న సమాజాన్ని, రాబోయే రోజుల్లో పరిస్థితులు, మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకొని వారికి చేయూతనిచ్చే దిశగా 21 నెలల పాలనలో ఎన్నెన్నో అడుగులు ముందుకువేస్తూ వచ్చాం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రం నుంచే ఆవిర్భవించాలనే ధృడ సంకల్పంతో.. రేపటి తరం చిన్నారులకు సింహ భాగం అన్ని పథకాల్లో వారికిచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాను.

మహిళా దినోత్సవం రోజున.. మరో రెండు క్రిటికల్‌ ఏరియాస్‌లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అక్కచెల్లెమ్మలకు తోడుగా ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ.. దేశంలో ఎక్కడా జరగని విధంగా మొట్టమొదటి సారిగా ఈ ఏడాది బడ్జెట్‌లో జెండర్‌ బడ్జెట్‌ కాన్సెప్ట్‌ తీసుకురాబోతున్నాం. నేరుగా అక్కచెల్లెమ్మలకు బడ్జెట్‌లో ఎంత కేటాయింపులు చేస్తున్నాం.. ఎంత ఖర్చు చేస్తున్నామనే డేటాను నేరుగా బడ్జెట్‌లోకి ఈ ఏడాది ప్రవేశపెట్టబోతున్నాం. 

అంతేకాకుండా పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నిరోధించే చట్టం ఉంది. పది మందికి మించి మహిళా ఉద్యోగులు ఎక్కడైనా పనిచేస్తుంటే.. ఆ సంస్థల్లో వేధింపుల నిరోధానికి విచారణకు ఒక కమిటీ కచ్చితంగా ఉండాలి. ఆ కమిటీ ఉండాలని చట్టం చెబుతున్నా.. ఎక్కడా కూడా జరగడం లేదు. చివరకు మా సెక్రటేరియట్‌లోనే ఇంత వరకు కమిటీ లేదు. అందరికీ చెబుతున్నాను.. మొట్టమొదటగా సచివాలయం నుంచే కమిటీ వేయడం మొదలుపెడదాం.. ప్రతి చోట ప్రైవేట్, గవర్నమెంట్‌ సంస్థల్లో కమిటీలు ఏర్పాటయ్యేలా మానిటర్‌ చేయాలని ఆదేశాలిస్తున్నాను. ఈ కమిటీల ఏర్పాటు గొప్ప విప్లవాత్మక అడుగు కాబోతుంది.‌

తాజా ఫోటోలు

Back to Top