సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ దిశగా ముందుకెళ్తున్నాం

ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

పోలీసులంటే సేవకులని ప్రజలంతా గుర్తించాలి

పోలీసులు అందించే సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చాం

పీఎస్‌కు వెళ్లకుండానే అందుబాటులోకి 87 రకాల సేవలు

మహిళల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ 12 మాడ్యూల్స్‌

సైబర్‌ సేఫ్టీ అండ్‌ సైబర్‌ క్రైమ్‌ గురించి 16 మాడ్యూల్స్‌

ఫిర్యాదుదారు ఫోన్‌కు కంప్లయింట్, ఎఫ్‌ఐఆర్, కేసు పురోగతి ఎస్‌ఎంఎస్‌లు

పోలీస్‌ సేవా యాప్‌లో అందుబాటులో ఫ్యాక్ట్‌ చెక్‌ ఫీచర్‌  

యాప్‌ రూపొందించిన పోలీసులకు అభినందనలు

రాష్ట్ర ప్రజలంతా ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోండి

తాడేపల్లి: ‘‘పోలీసులంటే ఒక బలగంగా, ఫోర్స్‌గా కాకుండా సేవలు అందించే మన కుటుంబ సభ్యులుగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పదానికి అర్థం వస్తుంది. ఆ దిశగానే అడుగులు వేస్తూ.. దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ను రూపొందించాం. ఈ యాప్‌ ద్వారా 87 రకాల పోలీస్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. పోలీస్‌ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

‘ప్రజల ఇళ్ల సంబంధించిన భద్రత నుంచి అనేక సేవలను ఈ ద్వారానే పొందవచ్చు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని ఈ యాప్‌ ద్వారా తగ్గించే కార్యక్రమం జరుగుతుంది. నేరాలు, భద్రత, ఇతర పోలీస్‌ సేవలకు సంబంధించి, పోలీసులు అందిస్తున్న అన్ని సేవలు ఒక ప్లాట్‌ఫాం కిందకు తీసుకురావడం జరుగుతుంది. ఏదైనా సర్టిఫికేట్, పాస్‌పోర్టు, ల్యాండ్‌ డాక్యుమెంట్స్‌ మిస్‌ అయ్యాయని ఫిర్యాదు చేయాలన్నా.. పోలీసులు ఇచ్చే లైసెన్స్‌లు తీసుకోవాలన్నా.. రెన్యూవల్‌ చేయాలన్నా.. నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ కావాలన్నా.. ఇవన్నీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అక్కడ అప్లికేషన్‌ పెట్టడం, ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ఏపీ పోలీస్‌ సేవ యాప్‌లోనే కావాల్సిన సేవలకు నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే అవన్నీ అందించబడతాయి. 

కంప్లయింట్‌ దగ్గర నుంచి ఎఫ్‌ఐఆర్‌ స్టేజ్, ఏ దశల్లో కేసు ఉందని పురోగతి ఫిర్యాదు దారుడి ఫోన్‌కు సమాచారం అందుతుంది. యాప్‌లో మహిళల భద్రతకు, రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 12 మాడ్యూల్స్‌ పెట్టడం జరిగింది. దిశ యాప్‌ను కూడా దీంట్లో అనుసంధానం చేయడం జరిగింది. 

రోడ్‌ సేఫ్టీ గురించి కూడా పొందుపరిచాం. చిన్న యాక్సిడెంట్‌ జరిగితే రిపోర్టు చేయడం దగ్గర నుంచి క్షతగాత్రుడిని ఆస్పత్రిలో చేర్చేందుకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఒక స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉండి ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకుంటే అదే మనల్ని గైడ్‌ చేస్తుంది. రోడ్డు సేఫ్లీ గురించి 6 మాడ్యూల్స్‌ ఉన్నాయి. 

సైబర్‌ సేఫ్టీ అండ్‌ సైబర్‌ క్రైమ్‌కు సంబంధించి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులున్నా.. ఏ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా నేరుగా కంప్లయింట్‌ దగ్గర నుంచి కేసు పురోగతి వివరాలను యాప్‌ తెలియజేస్తుంది. సైబర్‌ సేఫ్టీ అండ్‌ సైబర్‌ క్రైమ్‌ గురించి దాదాపు 16 మాడ్యూల్స్‌ను పొందుపరిచారు. 

ఏపీ పోలీస్‌ సేవ యాప్‌ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. చివరకు రోజూ మీడియా, సోషల్‌ మీడియాలో వచ్చే వార్తల్లో కూడా ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకునే వీలు, అవకాశం కూడా ఈ యాప్‌ ద్వారా వస్తుంది. ఫ్యాక్ట్‌ చెక్‌ ఫీచర్‌ కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు. పోలీసులే సరైన సమాచారం ఇస్తున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం కూడా ఈ యాప్‌కు అనుసంధానం చేస్తున్నాం. 

పోలీస్‌ సేవలను ఇప్పటికే గ్రామ గ్రామానికి తీసుకెళ్లాం. 2 వేల మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ, వార్డు సచివాలయాలను పెట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్‌ను కూడా నియమించాం. వారి వరకు ఈ యాప్‌ అనుసంధానం చేసి ఉంది. ప్రజలు తాము ఇచ్చిన ఫిర్యాదులు, పోలీస్‌ సంబంధిత సేవలను యాప్‌ ద్వారా పొందవచ్చు. 

దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ఆమోదించిన మన ప్రభుత్వం దిశ యాప్‌ను ఇప్పటికే ప్రారంభించాం. ఇప్పటి వరకు దిశ యాప్‌ను 11 లక్షల మంది డౌన్లోడ్‌ చేసుకున్నారు. దిశ యాప్‌ ద్వారా కూడా మేలు పొందే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇది గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. దిశ యాప్‌ ద్వారా 568 కేసులపై చర్యలు తీసుకున్నాం. ఇందులో నేరాలకు సంబంధించి 117 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరిగింది. 

సైబర్‌ సేఫ్టీ కోసం ఇప్పటికే సైబర్‌ మిత్ర అనే వాట్సాప్‌ నంబర్, ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తీసుకువచ్చాం. రాష్ట్ర పోలీస్‌ చేతిలో స్టేట్‌ ఆఫ్‌ ది యాక్ట్‌ ఎక్‌నాలెడ్జి్జని పెడుతూ రిమోట్‌ ఏరియా కమ్యూనికేషన్స్, శాటిలైట్‌ ఫోన్‌ వ్యవస్థలు, వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం వంటి టెక్నాలజీని మన పోలీసులు ఉపయోగిస్తూ సేవలను అందిస్తున్నారు. దేశంలోనే ముందడుగులో ఉన్నారని గర్వంగా చెప్పగలుగుతున్నా. మరో అడుగు ముందుకు వేస్తే న్యాయ ప్రక్రియకు సహకరిస్తూ కేసులను వెంటనే పరిష్కరించేందుకు వీలుగా గత నెలలో ఇంటరాపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్‌ కోర్టుకు పంపించడం జరుగుతుంది. 

పోలీస్‌ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం, నేరాలను నిరోధించడం, నేరాలను విచారించడం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజల భద్రత మొత్తంగా సమాజంలో నేరాలను దాదాపు సున్నాకు తీసుకువచ్చేందుకు ఈ పోలీస్‌ వ్యవస్థ ఉంది. ఇటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ వ్యవస్థలో సులభతరం కోసం ఈ యాప్‌ తీసుకువచ్చాం. 

వీలైనంత పారదర్శకంగా పోలీస్‌ వ్యవస్థను మార్చుతున్నాం. ఒక కంప్లయింట్‌ ఇవ్వాలన్నా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావాలన్నా.. దాన్ని ఆపాలన్నా పెద్దవాళ్ల జోక్యం ఎక్కడా ఉండకూడదు. పారదర్శకంగా వ్యవస్థ అడుగులు ముందుకేస్తేనే సామాన్యుడికి మేలు, న్యాయం చేయడం జరుగుతుంది. ఆ దిశగానే అడుగులు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. యాప్‌ను రూపొందించిన పోలీస్‌ వ్యవస్థకు అభినందనలు, ఈ యాప్‌ను రాష్ట్ర ప్రజలు డౌన్‌లోడ్‌ చేసుకొని సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలను కోరుతున్నా’ అని సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.
 

Back to Top