తిరువూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరువూరు నియోజకవర్గానికి వరాలు కురిపించారు. నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి అభ్యర్థన మేరకు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల బహిరంగ సభా వేదిక నుంచి తిరువూరు అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను కేటాయించారు.
– కట్టలూరు వాగు మీదుగా హైలెవల్ బ్రిడ్జి కోసం రూ.26 కోట్లు మంజూరు చేస్తున్నాను.
– ఏ.కొండూరులో కిడ్నీ బాధితులకు మంచి చేయడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం కావాలంటే కృష్ణా జలాల సర్వేస్ వాటర్ తీసుకొని రావాలని ఎమ్మెల్యే రక్షణ నిధి అన్న అడిగాడు. ఇందుకోసం మరో 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. ఈ రూ.50 కోట్లు కేటాయిస్తున్నాను.
– ఇప్పటికే తిరువూరులో 8 వేలపైచిలుకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇందులో 4 వేల ఇళ్లకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో 6 వేల ఇళ్లు కావాలని అడిగాడు.. ఆ ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నాను. 10 వేల ఇళ్లు ఉజ్జాయింపుగా తీసుకుంటే వీటి ఖరీదే రూ.250 కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
– రోడ్ల మరమ్మతుల కోసం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నాను.
– తిరువూరు మున్సిపాలిటీలో డ్రైనేజీ కోసం రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నాను.
– పాలిటెక్నిక్ కాలేజీ కావాలని అడిగాడు. తిరువూరులో స్కిల్ డెవలప్‌మెంట్ అంటే ఐటీఐ, పాలిటెక్నిక్ డ్రాపౌట్ల కోసం వృత్తి నైపుణ్య శిక్షణ ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఏసీ రిపేర్లు, మోటార్ మెకానిక్స్ ఇవన్నీ కలిపి ఒకే కాంప్లెక్స్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు కింద 175 నియోజకవర్గాల్లోనూ తీసుకురావాలని ప్రభుత్వం ఒక కార్యాచరణ చేస్తోంది. అందులో భాగంగా ఇవన్నీ కలిపి కూడిన ఒక స్కిల్‌డెవలప్‌మెంట్ రాబోయే రోజుల్లో తిరువూరుకు వస్తుంది.
వీటన్నింటి ద్వారా తిరువూరు నియోజకవర్గానికి ఇంకా మంచి జరగాలని మనసారా ప్రార్థిస్తున్నాను`` అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.