విజయనగరం: ‘‘గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగినవారు. కల్మషం లేని మనుషులు. మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగుకు సాలూరు నుంచి బీజం çపడింది. మనం ఈరోజు శంకుస్థాపన చేసిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ రాబోయే రోజుల్లో గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రూ.834 కోట్లతో మూడు సంవత్సరాల్లో జాతికి అంకితం చేయబోయే గొప్ప ప్రాజెక్టుకు అడుగు వేశాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులోని మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్‌తో కలిసి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గిరిపుత్రులను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పూర్తి ప్రసంగం.. చిక్కటి చిరునవ్వులు, చెరగని ఆప్యాయతల మధ్య దేవుడి ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న నా గిరిజన జాతికి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీ జగన్ ఎప్పటికీ రుణపడి ఉంటాడని తెలియజేస్తున్నాను. సభకు విచ్చేసిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి నిండుమనసుతో రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గిరిజన ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణానికి సంబంధించి పునాదులు వేస్తున్నాం. దాదాపు రూ.834 కోట్ల ప్రాజెక్టు మరో మూడు సంవత్సరాల్లో జాతికి అంకితం చేయబోయే గొప్ప అడుగు వేశాం. ఈ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు దేశ ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గిరిజన యూనివర్సిటీ 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. మనం శంకుస్థాపన చేసిన సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్రంలో రెండవది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టు గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి రాబోయే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. గిరిజన మిత్రుడికి, గిరిజన పక్షపాతిగా రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగుకు సాలూరు నుంచి బీజం పడబోతోందని సగర్వంగా తెలియజేస్తున్నాను. మామూలుగా నా మనసులో ఎప్పుడూ ఉండేది.. గిరిజనులు స్వచ్ఛమైన మనసులు కలిగినవారు. కల్మషం లేని మనుషులు. తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం.. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు, ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికీ భావి ప్రపంచంతో అడుగులు వేయడంలో వెనకాలే ఉన్నారు. ఈ రోజు గర్వంగా చెబుతున్నాను.. ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ ప్రభుత్వంలో విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, జెండర్ పరంగా మనందరి ప్రభుత్వం గిరిజనులను గుండెల్లో పెట్టుకొని అడుగులు వేసిందని సగర్వంగా చెబుతున్నాను. మారుతున్న ప్రపంచంలో వారి జీవన ప్రమాణాలను పెంచడానికి, మిగతా ప్రపంచం దోపిడీ నుంచి గిరిజనులను రక్షించాం. వారికి ఉన్నత విద్యను, ప్రపంచంలో నిలబెట్టే విద్యను వారికి అందించాలి. అలాంటి సంకల్పంతోనే తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ వారు చదువుకునే మీడియం దగ్గర నుంచి వారికి అందే సదుపాయాల వరకు అన్నింటిలోనూ నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. గిరిపుత్రుల అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంత బాధ్యతతో, ఎంత దూరదృష్టిలో వ్యవహరిస్తుందో నాలుగు మాటల్లో వివరిస్తా.. విద్యా సాధికారత కోసం, ప్రపంచంలో వారు పోటీపడే పరిస్థితి రావాలని, ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని, వారు చదువుకునే మీడియంలో మార్పులు తీసుకువచ్చాం. గవర్నమెంట్ బడులు ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు అనే కాన్సెప్టు మన గవర్నమెంట్ బడుల్లో అమలవుతుంది. నాడు–నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు అన్నీ పూర్తిగా మారి కనిపిస్తున్నాయి. విద్యా కానుకతో బడి పిల్లల రూపాన్ని, బైలింగ్వెల్ టెక్ట్స్ బుక్స్‌తో వారి పాఠ్య పుస్తకాలను కూడా మార్చగలిగాం. గిరిజన ప్రాంతంలో చిన్న పిల్లల నుంచి బాలింతలు, గర్భవతులను కూడా బాగా చూసుకునే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ సంపూర్ణ పోషణ ప్లస్, చిన్న పిల్లలకు గోరు ముద్ద స్కీమ్‌తో వారు తినే ఆహారంలో కూడా మార్పులు తీసుకురాగలిగాం. గవర్నమెంట్ బడుల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తూ.. ఇంటరాక్టీవ్ ఫ్లాట్ ప్యానల్స్ ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఏర్పాటు చేస్తున్నాం.. ఇవి కనిపిస్తున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నాను. మన పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతికి వస్తే వారి చేతిలో ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని గర్వంగా చెబుతున్నాను. చివరకు చదువులను ప్రోత్సహిస్తూ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని కూడా తీసుకువచ్చాం. పిల్లలను మరింత గొప్పగా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకు ముందు చూడని విధంగా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో హయ్యర్ ఎడ్యుకేషన్‌లో విద్యా దీవెన, వసతి దీవెన తీసుకువచ్చాం. చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులకు ఏమాత్రం భారం పడకుండా మెరుగైన చదువులు కరికుళంలో మార్పులు చేస్తూ పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. విదేశీ విద్యా దీవెనలో ఎవరైనా సీటు సంపాదించుకుంటే టాప్–50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్లో ప్రపంచంలోని 350 కాలేజీల్లో సీట్లు సంపాదించుకుంటే చాలు రూ.1కోటి 25 లక్షల వరకు మన పిల్లలకు సపోర్టు చేస్తున్న ప్రభుత్వం దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అని తెలియజేస్తున్నా.. ఈ గిరిజన ప్రాంతం తీసుకుంటే.. ఈ ప్రాంతానికి మంచి చేస్తూ మూడు మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంది. గిరిజన ప్రాంతానికి గేట్ వేగా నర్సీపట్నం కనిపిస్తోంది. పాడేరులో మరో మెడికల్ కాలేజీ నిర్మాణం, పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంది. ఈ మూడు మెడికల్ కాలేజీలు గిరిజన ప్రాంతంలోని ప్రజలకు మంచి జరిగించేందుకు నిర్మిస్తున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసిన ట్రైబల్ యూనివర్సిటీ నుంచి ముందడుగు వేస్తే కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ కూడా నిర్మించబడుతుంది. ఈ ప్రాంతానికి ఎంత మంచి జరగుతుందని చెప్పడానికి ఒక చిన్న ఆలోచన చేయండి.. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి కాస్త దూరంలో పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మాణం కనిపిస్తుంది. పాడేరు నుంచి మరికాస్త దూరం వెళ్తే సాలూరులో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. సాలూరు నుంచి మరికాస్త దూరం వెళ్లే కురుపాం ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఒక్క గిరిజన ప్రాంతంలో మాత్రమే మూడు మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, నాడు–నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు మనం తీసుకువస్తున్న ఈ విప్లవాత్మక మార్పులతో గిరిజనుల విద్య సాధికారతకు కనీవిని ఎరుగని అభివృద్ధి బాటలు నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు పడుతున్నాయని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను. విద్యకు సంబంధించిన అంశాలే కాకుండా మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ 50 నెలల పాలనలో గిరిజనులకు ఏం చేసిందో నాలుగు మాటలు పంచుకుంటాను.. నా ఎస్టీలు అనే పదానికి అర్థం చెబుతూ రాజకీయంగా పదవుల్లో వారికి గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంతగా గిరిజనులను నా పక్కనే పెట్టుకున్నాను. ఏ నామినేటెడ్, కాంట్రాక్టు ఏది తీసుకున్నా కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ కార్యరూపం చేస్తున్న ప్రభుత్వం మనది. 50 నెలల కాలంలో మొట్టమొదట ఒక గిరిజన చెల్లెమ్మకు, ఆ తరువాత నా గిరిజన అన్నకు కేబినెట్లో ఏకంగా డిప్యూటీ స్థానం ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్న పరిస్థితి కూడా ఈ నాలుగేళ్ల మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని నియమించిన చరిత్ర కూడా మన ప్రభుత్వంలోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే. నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిషిగా ఎస్టీలకు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీని మనసా, వాచా, కర్మణా, త్రిఖర్ణ శుద్ధితో అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చాం. అక్షరాల జూలై2019 నుంచి ఇప్పటి వరకు 4.58 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఇందు కోసం అక్షరాల 410 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సవినయంగా తెలియజేస్తున్నాను. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీని నిలబెట్టుకుంటూ గిరిజనులకు ఇప్పటికే ఒక జిల్లా కాదు.. ఏకంగా రెండు జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశాం. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రూ.1000 కోట్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నాం. మన్యం జిల్లా పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా వేగంగా జరుగుతుంది. కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణం మన కళ్ల ఎదుటే కనిస్తోంది. గిరిజన తండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికే మరో 165 గిరిజన గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేశామని సవినయంగా తెలియజేస్తున్నా. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పిన మాట ప్రకారం మన్యం జిల్లాలో సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరంలో, ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెంలో, ప్రకాశం జిల్లాలోని దోర్నాల్లో రూ.250 కోట్లు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ఈరోజు ప్రతి గిరిజన గ్రామంలోనూ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు కనిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన అసైన్మెంట్ భూములకు ఇతర పట్టా భూముల కంటే పది శాతం ఎక్కువ పరిహారం ఇస్తామని మాటిచ్చాం.. ఆ మాటను నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా చైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులు ఉండే ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను తీసుకువచ్చింది కూడా ఈ నాలుగు సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే అని తెలియజేస్తున్నాను. గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. గిరిజనుల బాగోగుల కోసం అక్షరాల 1,53,820 గిరిజన కుటుంబాలకు మేలు చేస్తూ 3,22,538 ఎకరాలను ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలుగా వారి చేతికి అందించిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. పట్టాలు ఇవ్వడమే కాకుండా సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ము కూడా ఇస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే. రాష్ట్రంలో మన కళ్ల ఎదుటే గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు అక్షరాల 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్థులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాల వారు ఏకంగా 84 శాతం ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇదీ మీ బిడ్డ పరిపాలనలో జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇందులో మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 100 శాతం ఉద్యోగస్థులు నా గిరిజన తమ్ముళ్లు, చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వపడుతున్నా.. నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. ఎక్కడా అవినీతి లేదు, ఎక్కడా వివక్షకు తావే లేదు. పూర్తి పారదర్శకతతో పథకాలు అమలు చేస్తున్నాం. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోతున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. అక్షరాల 50 నెలల కాలంలో మీ బిడ్డ బటన్ నొక్కడం.. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిన సొమ్ము వెళ్తుంది. గిరిజనులకు సంబంధించిన సొమ్ము చూస్తూ అక్షరాల 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ అక్షరాల 11,548 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. దీనికి తోడు నాన్ డీబీటీ కలుపుకుంటే మరో 22.26 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ రూ.5257 కోట్ల మేలు అందించాం. నాన్ డీబీటీ అంటే ట్యాబ్స్, ఇళ్ల పట్టాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద ఇవన్నీ కలుపుకుంటే రూ.5257 కోట్లు. మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే అక్షరాల 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ రూ.16,805 కోట్లు నేరుగా అందించామని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇవన్నీ మీ ప్రాంతంలో నా గిరిజనులకు జరిగిన మార్పును వివరించడం కోసం చెప్పాను. ఈరోజు మరీ ముఖ్యంగా మరో గొప్ప ఈ యూనివర్సిటీ ద్వారా జరగబోతోంది. ఈ యూనివర్సిటీ వల్ల రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఈరోజు గుర్తిండిపోతుంది. దేవుడి చల్లని దీవెనలు మనందరిపై ఉండాలని, ఇంకా మంచిచేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మరింతగా మీ బిడ్డ ప్రభుత్వానికి నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.