ప్రొద్దుటూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాలు, అమలుకాని హామీలు, సంక్షేమ పథకాల కోతలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4, 8, 12 తేదీల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు.