ప్రకాశం : కర్ణాటకలో పొగాకు క్వింటా ధర రూ.36 వేలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.16 వేలకే పరిమితమవడం వెనుక పొగాకు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుమ్మక్కు రాజకీయాలే కారణమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొగాకు ధర క్వింటాకు రూ.16 వేల వరకు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటకలో క్వింటా పొగాకు ధర రూ.36 వేలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.16 వేలకే పరిమితమవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పొగాకు కొనుగోళ్లలో సిఫార్సులు, పలుకుబడి ఆధారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అనుకూల వ్యక్తుల బేళ్లను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పొగాకు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుమ్మక్కయ్యారని ఆరోపించిన కాకాణి, రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి కంపెనీలకు లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి నెలకొందని, ఒక్కో పొగాకు రైతు ఒక్కో బ్యారెన్‌కు రూ.5 లక్షలకు పైగా నష్టపోతున్నారని తెలిపారు. రైతుల ఆందోళనలను అణచివేస్తూ వారిపై కేసులు నమోదు చేయడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.