తాడేపల్లి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు అర్థాలే వేరుగా ఉంటాయని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాయలంలో మీడియాతో మాట్లాడుతూ... జిల్లా ఎస్పీలతో సీఎంగా చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడేందుకు పోలీసులు పనిచేయాలని ఆదేశించినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారని అన్నారు. ఇదే సమావేశంలో ఆయన కూటమి ఎమ్మెల్యేలు చెప్పినట్లు చేయాలని కూడా ఎస్పీలను ఆదేశించడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శనం కాదా అని నిలదీశారు. అంటే పోలీసులు నిస్పక్షపాతంగా చట్ట ప్రకారం పనిచేయాలా? లేక కూటమి ఎమ్మెల్యేలు చెప్పిన ప్రతి తప్పుడు పనికీ వత్తాసు పలకాలా? చంద్రబాబు ఉద్దేశం ఏమిటో ఈ విషయంలోనే చాలా స్పష్టంగా బయటపడిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో కుల చిచ్చులు, రాజకీయ కక్షసాధింపులు సర్వసాధారణంగా మారాయని, రెడ్‌బుక్‌తో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న ఆయనకు శాంతిభద్రతల పరిరక్షణ అనే మాట మాట్లాడే అర్హతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... చంద్రబాబు మాటలు ఒకలా... చేతలు మరోలా ఉంటాయనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఏ సీఎం అయినా జిల్లా ఎస్పీలతో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను సమీక్షించి, రాబోయే రోజుల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే నిన్న జరిగిన మీటింగ్‌లో చంద్రబాబు ఎంతో ఉదాత్తమైన ఆదేశాలను జిల్లా ఎస్పీలకు ఇచ్చారని ఎల్లో మీడియాలో పతాక శీర్షికలతో వార్తలు వచ్చాయి. అదే క్రమంలో మా కూటమి ఎమ్మెల్యేలు చెప్పిన పనులన్నీ చేయాలని కూడా వారికి చంద్రబాబు సూచించారు. మా ఎమ్మెల్యేలు ఏం చెప్పినా, అది చేయాలని ఆదేశించడం చూస్తే, మా వాళ్ళు ఎవరి మీద తప్పుడు కేసు పెట్టమన్నా సరే నమోదు చేయాల్సిందే, మా వాళ్ళు చట్ట విరుద్దంగా ఏం చేసినా సరే దానిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించినట్లు కాదా? రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యమైపోతున్నాయంటే ఇటువంటి సీఎంలు ఇచ్చే ఆదేశాలే దానికి కారణం అని అందరికీ అర్థమవుతోంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో అశాంతి పెచ్చుమీరుతుంది, కులతత్వం విజృంభిస్తుంది, తక్కువ కులాల వారిపై దాడులు, దాష్టీకాలు పెరిగిపోతాయి అనేది చరిత్ర చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఘటనలు, ఏపీలో జరిగిన ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన అనేక దాష్టీకాలను మేం చెప్పగలం. తన గురించి తాను చెప్పుకునే సందర్భాల్లో క్రైసస్ నుంచి తాను అవకాశాలను వెతుక్కుంటాను అని స్వయంగా చంద్రబాబే తన నైజంను వెల్లడించుకున్నారు. అంటే ఇద్దరు తన్నుకుంటూ ఉంటే, ఒక కులంపై మరో కులం దాడి చేస్తే బాబు గారికి ఆనందం. ఆయన అసమర్థ పాలన గురించి జనం చర్చించుకోకుండా, ఇటువంటి దాడులు, అరాచకాలపైనే మాట్లాడుకోవాలనేదే ఆయన ఆలోచన. కూటమి ఎమ్మెల్యేల అరాచకంతో సమాజంలో అశాంతి కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరి, ఆయా నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్న పరిస్థితి రాష్ట్రం అంతా కనిపిస్తోంది. వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రజాసమస్యలపై స్పందించకుండా, ప్రభుత్వ అసమర్థతను నిలదీయకుండా ఎప్పటికప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులను బనాయించేలా పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అశాంతి తప్ప, ప్రశాంత వాతావరణం ఎక్కడ ఉంటుంది? సమాజంలో ప్రజలు పూర్తి భరోసాతో ఉండాలంటే శాంతిభద్రతలను కాపాడే పోలీస్ వ్యవస్థకు అండగా నిలిచి, వారిపై ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా పనిచేసేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా వ్యవహరిస్తుంటే, ఇక పోలీసులు ఏ ధైర్యంతో చట్టాలను అనుసరించి పనిచేస్తారు? ఒకవైపు ఇలాంటి విధానాలకు పాల్పడుతూ, మరోవైపు శాంతిభద్రతలు పటిష్టంగా కాపాడాలని చంద్రబాబు ఎంతో నిఖార్సైన పాలకుడు మాదిరిగా ఆదేశాలు జారీ చేస్తున్నాడని ఆయనకు భజన చేసే ఎల్లో మీడియాలో పచ్చి అబద్దాలను ప్రచారం చేసుకుంటున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు కూటమి పార్టీ నేతలు చేసే నేరాలు, ఘోరాలతోనే ఏపీలో అరాచకం సాగుతోంది. కేవలం వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడం, ప్రశ్నించే గొంతులను నొక్కేయడం, ప్రజా ఆస్తులను దోచుకోవడం లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. ఈ దుర్మార్గమైన పాలనకు అండగా పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. కొన్ని సందర్భాలు చూస్తే పోలీసులు రాజకీయ కార్యకర్తలుగా మారిపోయారు. నిస్పాక్షపాతంగా పనిచేసే పోలీస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇళ్ళకే పరిమితం చేస్తున్నారు. వారికి భజన చేసే వారికి మాత్రమే పోస్టింగ్‌లు ఇస్తూ, దోపిడీ వ్యవస్థకు అండగా నిలబెడుతున్నారు. చంద్రబాబు పాలనలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఈ దేశంలోని ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబు పాలనను సమర్థించే పరిస్థితి లేదు. ఒకవైపు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, తమకు నచ్చని వారిపై తప్పుడు కేసులు పెట్టించి, వారిని అరెస్ట్ చేసి, జైళ్ళకు పంపుతున్నారు. అటువంటి చంద్రబాబు నేరాలను అదుపు చేయాలని ఎస్పీలకు చెప్పే అర్హత ఎక్కడిది? ఈ రాష్ట్రంలో మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నారు. దళితులపైన అనేక దాష్టీకాలకు పాల్పడ్డారు. మీ అరాచకాలపై ఎటువంటి చర్యలకు సిద్దం..? కృష్ణా జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఒక ఆర్‌ఎంపీ డాక్టర్ సోషల్ మీడియాలో మాట్లాడిన దానిలో జనసేన పార్టీపైన ఒక మాట జారాడు. అందుకు గానూ అతడిపై దాడి చేసి, మోకాళ్ళపై కూర్చోబెట్టించి, రెండు చేతులు జోడించి, నేను తప్పుగా మాట్లాడాను అంటూ బలవంతంగా చెప్పించారు. అతడి షాప్‌ను ధ్వసం చేశారు. అతడి కుటుంబాన్ని భయబ్రాంతులకు లోను చేశారు. జనసేన నాయకులు చేసిన ఇదే పని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వర్తించదా? ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పబ్లిక్‌గా చెప్పు తీసుకుని చేతిలో పెట్టుకుని, 'వైయస్ఆర్‌సీపీ నా కొడుకుల్లారా... కొట్టుకుందాం రండిరా' అంటూ మాట్లాడారు. మరి ఆయనకు ఎటువంటి శాస్తి చేయాలి? ఆనాడు సీఎంగా ఉన్న వైయస్ జగన్‌ను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతూ 'యూజ్‌లెస్ ఫోలో... వాడు-వీడు' అన్నాడు. మరి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి 'మీ తాట తీస్తాను.. చర్మం ఒలుస్తాను' అంటూ బెదిరించారు. మరి ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి. వారు మాట్లాడినవన్నీ సుభాషితాలు, ఇతరులు మాట్లాడితే మాత్రం విద్వేషాన్ని కలిగించే వాఖ్యలు అని మార్చుకున్నారు. ఇదే విషయాన్ని పోలీసుకు కూడా చెబున్నారు. చివరికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి అభ్యర్ధులను గెలిపించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి ఆస్కారం ఎక్కడా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎంత మంది గ్రామాలను వదిలి పారిపోయారో తెలియదా? మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై జరిగిన దాడిని కనీసం చంద్రబాబు ఖండించారా? ఈ వ్యవహారంలో బాధితుడైన ప్రసన్నకుమార్ పైనే కేసు కట్టిన విషయం వాస్తవం కాదా? రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పనిచేసిన రిటైర్డ్ అధికారులైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందిని లేని లిక్కర్ స్కాంలో నిందితులుగా మార్చి, అరెస్ట్ చేసి, జైళ్ళకు పంపి వేధించారు. తమ రాజకీయ కక్షసాధింపులకు సిట్‌ను ఏర్పాటు చేసి, అనుకూలంగా మాట్లాడే పోలీస్ అధికారులకు బాధ్యతలు అప్పగించి, చట్టాలను అపహాస్యం చేస్తున్నన్నారు. అటువంటి చంద్రబాబును చూసి ప్రజలు 'నువ్వంటే మాకు నమ్మకం లేదు దోర' అంటున్నారు. పేదలు మీరు చెప్పిన పథకాలను నమ్మి ఓట్లు వేసి అధికారాన్ని అప్పగించారు. వారిని నిలువునా మోసం చేస్తున్నారు. ఒక్క పథకంను కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. మీ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసిన వైయస్ జగన్ గారి ప్రశ్నలకు బదులిచ్చే ధైర్యం లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిస్సిగ్గుగా అమ్మేసుకుంటున్నారు. మెడికల్ కాలేజీలు అసంపూర్తిగా ఉన్నాయని చెబుతున్న కూటమి నేతలు, ఆ పక్కనే ఉన్న ఆసుపత్రులను చూపించే ధైర్యం ఉందా? వైయస్ జగన్ గారు పేద విద్యార్ధులకు విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, సూపర్ స్పెషాలిటీ ఆసుత్రులతో సహా నిర్మిచేందుకు శ్రీకారం చుట్టారు. కానీ చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో నిలువునా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. పవన్ కల్యాణ్ అభిమానుల్లో క్రైస్తవులు, ముస్లీంలు, ఇతర కులస్తులు లేరా? సినిమా హీరోగా ఉండి, వివిధ వర్గాలకు చెందిన అభిమానులను పొంది, రాజకీయ నాయకుడుగా మారిన తరువాత తన రూపాన్ని మార్చుకున్నారు. రెండు కులాల మధ్య విభజన కోరుకుంటున్నారు.