తాడిపత్రిలో కేతిరెడ్డి అరెస్ట్ యత్నం

అనంతపురంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల‌ను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం :  టీడీపీ దాడుల‌ను నిర‌సిస్తూ ఇవాళ తాడిప‌త్రిలోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన సామూహిక దీక్షాను అడ్డుకునేందుకు పోలీసులు  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేతిరెడ్డి నివాసం వద్ద భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకుని నిరసన వ్యక్తం చేశాయి. ఇంటి లోపలే ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అరెస్ట్‌ను అడ్డుకునేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున సమీకరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు తాడిపత్రికి బయలుదేరిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అనంతపురంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు వెళ్లనీయకపోవడంతో ఇరువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసుల వైఖరికి నిరసనగా అనంతపురంలోని కోర్టు రోడ్డుపై అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నిరసనతో కోర్టు రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను బారికేడ్లతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పార్టీ నాయకులు విమర్శించారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ యత్నం, అనంతపురంలో నేతల బైఠాయింపుతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 

Back to Top