అభ్యర్థులను గెలిపించడం మీ బాధ్యత

షెడ్యూల్‌ వచ్చిన ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
 
ఆ వెంటనే బస్సు యాత్ర కూడా.. 

రానున్న 45రోజులు అత్యంత కీలకం

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జీల సమావేశంలో వైయ‌స్‌ జగన్‌

 హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తానని పార్టీ అధ్యక్షులు , ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. బస్సుయాత్ర కూడా షెడ్యూలు విడుదలైన వెంటనే మొదలు పెడతానని ఆయనన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌చార్జీల సమావేశంలో వైయ‌స్ జగన్‌ పై విధంగా చెప్పారు. సామర్థ్యం ఉన్న వారికే ఎన్నికల ఇన్‌ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నానని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపులో ఇన్‌చార్జీలు పోషించే పాత్రే కీలకమని ఆయనన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థులకు చేదోడు వాడోడుగా ఉండాలని కూడా ఆయన వారిని కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించడమే ఇన్‌చార్జీల బాధ్యత అని.. వారి గెలుపును తమ భుజస్కంధాలపై వేసుకోవాలని వైయ‌స్ జగన్‌ సూచించారు.

ప్రస్తుత సమయంలో రానున్న 45 రోజుల కాలం అత్యంత కీలకమన్నారు. ‘తొమ్మిదేళ్లుగా పోరాటాలు చేశాం. ఈ 45 రోజులు కూడా అదే స్ఫూర్తితో పోరాట పటిమను ప్రదర్శించాలి. ఇనుమడించిన ఉత్సాహంతో కార్యకర్తలతో పనిచేయించాలి’.. అని జగన్‌ వారిని ఉత్తేజపరిచారు. ఈ 45 రోజులు త్యాగాలు చేయాలని కలిసివచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవడం మనందరి ముందున్న కర్తవ్యం ఉద్బోధించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ బతికి బట్టకట్టాలంటే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఒక్కటే మార్గమని జగన్‌ స్పష్టంచేస్తూ.. ఆ దిశగా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయాలని ఇన్‌చార్జీలకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ప్రశాంత్‌ కిశోర్, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top