డీఎస్సీలో పారదర్శకత ఎక్కడ?

 అనంతపురంలో రౌండ్‌టేబుల్ సమావేశంలో అనంత వెంకటరామిరెడ్డి సూటి ప్ర‌శ్న‌

అనంతపురం: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైయస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిబంధనలను మార్చారని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై స్వతంత్రంగా సీబీఐ విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.

యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఎన్నికల సమయంలో యువతకు ఏటా జాబ్ క్యాలెండర్, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 6 నుంచి 9 వరకు రిలే దీక్షలు... 10న భారీ ర్యాలీలు

డీఎస్సీ అక్రమాలు, విద్యార్థులు–యువతకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 9 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Back to Top