కరువు ఛాయల్లో 625 మండలాలు.. 

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని వినియోగించుకోలేని కూటమి ప్రభుత్వం: పి. రవీంద్రనాథ్‌రెడ్డి

కడప: రాష్ట్రంలోని 687 మండలాలకు గాను 625 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 నుంచి 70 శాతం వరకు వర్షపాతం తగ్గడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. కరువు పరిస్థితులు ముందుగానే తెలిసినా విత్తనాలు, ఎరువుల లభ్యతపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించలేదని పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కరువు ప్రకటించినప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.

నీటి మట్టం అందుబాటులో ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని ఆయన అన్నారు. కడప జిల్లాలో కేసీ కెనాల్‌ కింద 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సకాలంలో యూరియా, ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతోందని పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

Back to Top