ప్రొద్దుటూరు: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణపై ప్రొద్దుటూరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ఈనెల 6 నుంచి వైయస్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన హామీలు, వైఫల్యాలను వివరించాలని రాచమల్లు సూచించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని, పార్టీ నాయకత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.