వైయ‌స్ జగన్ పర్యటనలో కనపడని పోలీసులు

ప‌ల్నాడు ప‌ర్య‌ట‌న‌లో అడ్ర‌స్ లేని రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీ

ప‌ల్నాడు:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ప‌ల్నాడు జిల్లా ప‌ర్యట‌న‌లో పోలీసులు క‌న‌బ‌డ‌లేదు. దేశంలోనే అత్యంత‌ ప్రజాదరణ ఉన్న నేత‌పై కూటమి సర్కార్‌ కొత్త కుట్రలకు తెర లేపింది. ఆయన పర్యటనలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొత్త ప్లాన్ వేసింది. వైయ‌స్‌ జగన్ ఇవాళ‌ పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా.. ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైయ‌స్‌ జగన్‌ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్‌ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది. వైయ‌స్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అనుమతి కోసం ఇప్పటికే ఏడు సార్లు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు అడుగ‌డుగునా ఆంక్షలు విధించారు. చంద్రబాబు సర్కార్‌ ఆదేశాల మేరకే వైయ‌స్‌ పర్యటనకు బందోబ‌స్తును ఏర్పాటు చేయ‌లేదు. వైయ‌స్ జ‌గ‌న్‌ ప‌ల్నాడుకు వెళ్తున్న స‌మ‌యంలో పోలీసులు రోడ్ క్లియర్ చేయ‌క‌పోవ‌డంతో ఆరు గంట‌లు ఆల‌స్య‌మైంది. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న వైయ‌స్‌ జగన్ కాన్వాయ్ కి ముందు  రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీలు అడ్ర‌స్ లేకుండా పోయాయి. కాన్వాయ్ తో వస్తున్న పోలీసు వాహనాలు తప్ప రోడ్డుపై ఖాకీలు క‌న‌బ‌డ‌లేదు. అధినేత‌ కాన్వాయ్ కి ముందు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నానిలు పరిగెత్తుతూ రోడ్ క్లియర్ చేయాల్సి వచ్చింది.  


 
దారిపొడవునా అభిమానమే..  
వైయ‌స్ జ‌గ‌న్ ప‌ల్నాడు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా దారిపోడ‌వునా పార్టీ శ్రేణులు, అభిమానులు ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికారు. జ‌న‌నేత‌ను చూసేందుకు ప‌నులు మానుకొని రోడ్ల‌పైకి వ‌చ్చి పూల‌వ‌ర్షం కురిపించారు. అభిమాన నేత‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు, ఆయ‌న్ను ద‌గ్గ‌ర నుంచి చూసేందుకు ఎగ‌బ‌డ్డారు.  గుంటూరు వై జంక్షన్‌లో వైయ‌స్ జగన్‌కు అపూర్వ స్వాగతం ప‌లికారు. పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీ ఆధ్వ‌ర్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు దారిపొడవునా జై జగన్‌.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఏ రోడ్డు చూసినా వైయ‌స్‌ జగన్‌కు  అభిమానం ఉప్పొంగింది. ఊరూరా రోడ్డుకు ఇరువైపులా జ‌నం బారులు తీరి వైయ‌స్ జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికారు. మార్గమధ్యలో అందరినీ వైయ‌స్ జ‌గ‌న్ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.

జన ప్రభంజనమైన సత్తెనపల్లి
వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో స‌త్తెన‌ప‌ల్లి ప‌ట్ట‌ణం జ‌న‌సంద్ర‌మైంది. కిలోమీటర్ల పొడవునా జ‌నం బారులు తీరి అభిమాన నేత‌కు స్వాగ‌తం ప‌లికారు. ఇసుకేస్తే రాలనంతగా జ‌నం తరలివచ్చారు. బైకులు, కార్లలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు  భారీగా వచ్చారు. వైయ‌స్ జగన్ ని చూసేందుకు రోడ్డు పక్కన బిల్డింగులు ఎక్కారు. వైయ‌స్ జగన్ పై అభిమానాన్ని అడ్డుకోలేక పోయిన ప్రభుత్వం  ఆంక్షలు పెట్టినా..పోలీసుల చెక్ పోస్టులు దాటుకుని రెంటపాళ్ల వైపు జ‌నం క‌దిలివ‌చ్చారు. సత్తెనపల్లి నుండి రెంటపాళ్ల వరకు జనమే జనం.
 

Back to Top