బాబు కోటలో వైయస్ జగన్‌ 'శంఖారావం'

తిరుపతి :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాకా కుప్పం నుంచి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 30న కుప్పం వస్తున్న శ్రీ జగన్‌కు స్వాగత ఏర్పాట్లలో పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఆ రోజున శ్రీ జగన్ బెంగళూరు నుంచి కుప్పం చేరుకుంటారు. బుధవారం నాడు పార్టీ కార్యకర్తలు కుప్పంలోని  వాణి మహల్‌లో‌ సమావేశమై ‌శ్రీ జగన్‌ సమైక్య శంఖారావానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు.

సమైక్య శంఖారావం తొలిరోజున శ్రీ జగన్మోహన్‌రెడ్డి కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేశ్ కుటుంబా‌న్ని ఓదారుస్తారు. తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెలో దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగిస్తారు. అనంతరం కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబాన్ని ఓదారుస్తారు. ఆ తరువాత పలమనేరు వెళతారు.

వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం :

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తమ బలం నిరూపించుకునేందుకు వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో‌ టీడీపీ ఓటు బ్యాంకు తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్లు గతుకులమయం కావడం, వీధి కుళాయిల్లో నీళ్లు రాకపోవడం, విద్యుత్ కోత‌లు ఎక్కువైపోవడంతో కుప్పం ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాకతో చంద్రబాబు ఓటు బ్యాంకు వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ వైపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో శ్రీ జగన్ పర్యటకు హాజరు కాకూడదని కుప్పం ప్రజలను టీడీపీ ‌నాయకులు అభ్యర్థిస్తున్నారు. శ్రీ జగన్ పర్యటన కుప్పం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కుప్పం ‘‌టీడీపీ’లో పెరుగుతున్న గుబులు :
కుప్పంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పర్యటన కోసం పార్టీ కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నేతృత్వంలో చేస్తున్న ఏర్పాట్లు టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతోంది. ఏర్పాట్ల సమావేశానికే భారీగా కార్యకర్తలు తరలిరావడం కొత్త పరిణామం అని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో జరిగే సభకు ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీ జగన్‌ సమైక్య శంఖారావం సభకు కుప్పం వాసులు హాజరు కాకుండా చూడాలని తన పార్టీ నాయకులను చంద్రబాబు నాయుడు కోరినట్లు తెలిసింది. కుప్పం వాసులు సభ రోజు  తలుపులు మూసేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

చంద్రబాబు సమైక్యవాదా?.. తెలంగాణవాదా? :
ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా ? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు జిల్లా నియోజకవర్గం కన్వీనర్ నారాయణ‌ స్వామి ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ఆయన ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ‌కుప్పంలో శ్రీ జగన్ సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏర్పాట్లపై వాణి మహల్‌లో పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయుకర్గ సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. బీసీలు అధికంగా ఉన్న కుప్పం ప్రాంతంలో వారిని నమ్మించి మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు సమైక్యవాదో లేక తెలంగాణ వాదో స్పష్టం చేయూలని డిమాండ్ చేశారు.‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం ఆయనకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Back to Top