ఇది చెదరని సంకల్పం

ప్రజా సంకల్పం…ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం. ప్రజల కోసం ప్రభుత్వాన్నే కాదు, ప్రాణాన్నీ లెక్కచేయని సంకల్పం. ప్రజాక్షేమం కోసం ప్రజలతోనే ఉండాలనే సంకల్పం.  ప్రజాక్షేత్రమే తన మనో నేత్రమైన నేతకే అది సాధ్యం. పగలు రాత్రీ, తిండీ నిద్ర, పదవి ప్రతిపక్షం ఇవేం ఆ సంకల్పానికి అడ్డు కాదు. నమ్మకున్న ప్రజల సంక్షేమమొక్కటే ఆ నాయకుడి సంకల్పం. అలాంటి సంకల్పం ఉన్న ఒకే ఒక్కడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి….ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని నిలదీసే ఓ నాయకత్వం. పేద ప్రజల గుండెల్లో నా వాడు అన్న పేరు సంపాదించిన వారసత్వం. తండ్రి అకాల మరణం కుంగదీసినా, రాజకీయ నిరంకుశత్వం కుట్రలు పన్నినా ఆ అడుగులు వెనక్కి పడలేదు. తండ్రి పేరునే జెండా గా చేసుకుని, తండ్రి ఆశయాలనే దారిగా చేసుకుని ముందుకు సాగుతున్నాడు వైయస్ జగన్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజాపథాన్ని వీడలేదు. కక్ష కట్టి, కట్ర చేసి జైలుకు పంపినా తన ఆత్మస్థైర్యాన్ని వదలలేదు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న నాయకులను అవమానించి, సంతలో పశువుల్లా ప్రజా ప్రతినిధులను కొంటున్న ప్రభుత్వ నీచ పాలనను అతడు ప్రతిపక్షనేతగా ఎండగడుతున్నాడు. హామీలతో ఆశలురేపి, అందలం ఎక్కాక వాటిని ఆవిరి చేసిన పాలకుల నిర్లక్ష్యాన్ని అతడు అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు. అవినీతి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రగామి అనిపించుకోవడాన్ని సహించలేక అతడు తిరగబడ్డాడు. పేదల కన్నీళ్లు, రైతుల ఆక్రోశం, ఆడబిడ్డల ఆక్రందనలు ఆ సంకల్పాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. అంతులేని వ్యధలు అతడిని కదిలిస్తున్నాయి. 

వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే. రాజన్న రాజ్యం రావాలి. అది జగనన్నే తేవాలి అంటున్నారు ప్రజానీకం. వారి ఆశలకు అండగా, కష్టాలను తీరుస్తాననే హామీ ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత ప్రజా సంకల్పాన్ని చేపట్టాడు. తండ్రి దీవెనలు అందుకుని నవంబర్ 6, 2017 న ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురానికి పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు యువనేత. అశేష ప్రజావాహిని అతడితో అడుగులు వేస్తోంది. వైయస్సార్ కడప జిల్లా లో ఇడుపుల పాయ నుండి మొదలై వేంపల్లె, నేలతిమ్మాయిపల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల, పొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు,  ఎంకుపల్లి, జిల్లెల ప్రాంతాల మీదుగా వారం రోజులుగా పాదయాత్ర కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతను చూసిన ప్రజల్లో ఆనందోత్సాహాలు. జగనన్నా అంటూ ఆర్తిగా పిలుపులు. ఆత్మీయ ఆలింగనాలు. జన నీరాజనాలు…పుష్పవర్షాలు…ఒక నాయకుడికి ఇంత ఆదరాభిమానాలు ప్రజలెందుకు చూపిస్తారు. ఇంత ప్రేమను ఎందుకు కురిపిస్తారు…అంటే అది వైయస్సార్ రక్తం కనుక. అతడు వైయస్ బిడ్డ కనుక. మాట తప్పని, మడమ తిప్పని ఆ మహానేత కొడుకుగా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకుంటున్న దార్శనికుడు కనుక. అందుకే వృద్ధులు, మహిళలు, యువత, పిల్లలు అందరూ జై జగన్ అంటున్నారు. తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. వైయస్సార్ మరణం తర్వాత నుంచి నేటిదాకా అన్ని వర్గాల ప్రజలూ అడుగడుగునా మోసపోతూనే ఉన్నారు. వారందరికీ భరోసానిచ్చి నవరత్నాలను మీకు అందిస్తానని హామీ ఇస్తున్నారు వైయస్ జగన్. ప్రజలు దిద్దే మేనిఫెస్టోతో సమస్యలన్నీ తీరుస్తానని చెబుతున్నారు. ప్రత్యేక హోదా, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్, ప్రతిమండలంలోనూ వృద్ధులకు ఆశ్రమాలు, పింఛన్ల పెంపు, రైతులకు పంట నూర్పిడికి ముందే మద్దతు ధర, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇలా అన్ని వర్గాలకూ అవసరమైన పథకాలను అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసారు జన నేత. 

నాలుగేళ్ల పాలనలో చంద్రబాబుకు రాష్ట్రాన్ని దోచుకోవడంతోనే సరిపోయిందని, పాదయాత్రలో అడుగడుగునా ఆ నరకాసుర పాలన గురించే కథలు కథలుగా వింటున్నానన్నారు వైయస్ జగన్. వైయస్సార్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి…కొన్నిటిని 80శాతం పూర్తి చేసారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సాగు, తాగునీటి పథకాలు పూర్తికాకపోగా, కాంట్రాక్టర్లకు వరాలయ్యాయి అన్నారు జగన్. 108అంబులెన్సు, పేదలకు ఉచిత వైద్యం ఇచ్చిన ఆరోగ్యశ్రీ, విద్యార్థుల భవతకు బంగారు బాటలు వేసిన ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాలన్నీ అటకెక్కాయన్నారు. భూసేకరణలు, కబ్జాలు పెరిగిపోయాయని, నిరుద్యోగులకు ఉద్యోగం లేక, ఇస్తానన్న నిరుద్యోగభృతి కూడా అందక వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఒక్క ఏడాది ఓపికపడితే మన పాలన, మీ పాలన వస్తుందని, మీరు కోరుకున్నవన్నీ జరుగతాయని హామీ ఇచ్చారు వైయస్సార్ సిపి అధినేత వైయస్ జగన్. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పని చేయాలని, వైయస్సార్ ఫొటో పక్కనే నా ఫొటో కూడా పెట్టుకునేలా చేస్తానని, మీ ఆశీర్వాదం కావాలని వైయస్ జగన్ రాష్ట్ర ప్రజలను కోరారు. 
కుట్రల సంకెళ్లు ఇంకెన్నాళ్లో ఉండవు…కష్టాల పాలనలో మగ్గే రోజులకు ఇక శెలవు…ఇదే జగన్నినాదం…జగనన్న విధానం. సంక్షేమ పాలనకు, రాజన్న రాజ్యానికి ప్రజలంతా జగనన్నతో కలిసి చేస్తున్న ప్రయాణమే…. ఈ ప్రజాసంకల్పం. అంతిమ లక్ష్యం చేరేదాకా ఈ సంకల్పం సడలదు…ఆ అడుగుల వడి ఆగదు. 

Back to Top