వృద్ధునికి షర్మిల పరామర్శ

పరిమెళ్ళ ఎరుకల కాలనీ(ఉంగుటూరు) 23 మే 2013:

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గంలోని పరిమెళ్ల ఎరుకల కాలనీలో ఓ వృద్ధుడి పరిస్థితి చూసిన శ్రీమతి వైయస్ షర్మిల చలించిపోయారు. అక్కడ ఓ వృద్ధుడి దీని స్థితి ఆమెను కలచివేసింది. రోడ్డు పక్కన నాలుగడుగుల గుడిసెలో, లేవలేని స్థితిలో జీవచ్ఛవంలా పడి ఉన్న గాదె నరసింహుల్ని చూసిన ఆమె గుడిసెలోకి వెళ్లి పలకరిద్దామని ఆమె యత్నించారు. అంత చోటు కూడా లేకపోవడంతో బయట నుంచే అతడికి ధైర్యం చెప్పారు. ఉండడానికి ఇల్లు లేక, ఆర్థిక ఇబ్బందులతో బతుకే భారంగా ఇలా రోడ్డు పక్కన గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నామని ఆయన భార్య పెద్దింట్లు.. శ్రీమతి షర్మిల వద్ద కన్నీళ్ల పర్యంతమైంది. ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడని, ఇద్దరు కూతుళ్లూ పెళ్లిళ్ళయ్యి వెళ్లిపోయారనీ, తమను చూసే వారే లేరనీ ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. తమ కోడలు, ముగ్గురు పిల్లలతో పక్కన మరో చిన్న గుడిసెలో ఉంటున్నట్లు ఆమె తెలిపింది.  ‘మళ్లీ మంచి రోజులొస్తాయమ్మా.. అందరి కష్టాలు తీరతాయి’ అని ధైర్యం చెప్పి బరువెక్కిన హృదయంతో శ్రీమతి షర్మిల ముందుకు సాగారు.

9.8 కిలోమీటర్లు నడిచిన షర్మిల
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 156వ రోజు బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారులో ప్రారంభమైంది. అక్కడి నుంచి పెంటపాడు, కే పెంటపాడు, యానాలపల్లి మీదుగా పరిమెళ్ల చేరుకున్నారు. ఇక్కడ రచ్చబండ నిర్వహించిన అనంతరం ఉంగుటూరు నియోజకవర్గంలోని జె.కొమ్మర గ్రామం వరకు యాత్ర చేశారు. ఆ గ్రామసమీపంలో ఏర్పాటుచేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.35 నిమిషాలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 9.8 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, స్థానిక నేతలు తోట గోపి, మొవ్వ ఆనంద్ శ్రీనివాస్, గంటా ప్రసాద్, పాశం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top