మూడు కాన్ఫరెన్సులు ఆరు సమీక్షలు

చంద్రబాబు డైరీ బిజీ బిజీగా ఉంటోంది. అసలు రాష్ట్రాన్ని పరిపాలించడానికి టైమే ఉండటం లేదు. వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సులు, సమీక్షలు, చర్చలతో చంద్రబాబు మహా బిజిగా ఉంటున్నారు. గత మూడేళ్లలో చంద్రబాబు వందలాది కాన్ఫరెన్సులు, వేలాది సమీక్షలు నిర్వహించారు. ఇంతకీ సమీక్షలు నిర్వహించడంలో తప్పేముంది. సిఎమ్ స్థాయి వ్యక్తి రోజూ ఏదో సమీక్ష లేకుండా ఎలా ఉంటుంది అని ముందు ప్రజలు భావించినా, తరువాత అసలు తత్వం బోధపడింది. కమిటీలు వేయడం కాలయాపన చేయడం, సమీక్షలు చేయడం ఫలితాలు లేకపోవడం చంద్రబాబు ప్రత్యేకత అని తెలిసి వచ్చింది. 

అధికారులతో సమీక్షలు
పగలు రాత్రీ తేడా లేకుండా ప్రభుత్వాధికారులను పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు అంటూ భజన పరులు తప్పెట్లు తాళాలు వాయిస్తున్నారు. కాని కలెక్టర్ల నుంచి కింది స్థాయి అధికారుల వరకూ సిఎమ్ సమీక్ష కోసం తప్ప మరో పని చేయడానికి మాకు టైమే ఉండటం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కలెక్టర్లు సైతం ఏ నిమిషంలో చంద్రబాబు ఏ సమీక్ష అంటాడో అనుకుంటూ జిల్లా కేంద్రాన్ని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లడం లేదు. ఒక పక్క మీటింగులు పెట్టి బాబు గంటలు గంటలు అధికారుల బుర్ర తినేస్తున్నాడు.  క్షేత్రస్థాయిలో పని చేయండంటూ నీతులు బోధిస్తున్నాడు. వారంలో నాలుగు రోజులు సిఎమ్ సమీక్షలుంటున్నాయి. వాటిని అటెండ్ అవటానికి, సమీక్షలకు ప్రిపేర్ అవ్వడానికే అధికారులకు వారం అంతా సరిపోతోంది. వారాంతపు సమీక్షలంటూ,  ఆదివారాలను, సెలవు రోజులనూ వదలడం లేదు బాబు. ఇలా అధికారులను అన్ని విధాలుగా ఆడుకోవడం చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటే. 

రాజధాని సమీక్షలు
అమరావతి అభివృద్ధికోసం చంద్రబాబు పగలు నిద్రపోవడం లేదు. రాత్రి పని చేయడం లేదట. మూడేళ్లుగా రాజధాని కోసం చేయని సమీక్షంటూ లేదు. భూసేకరణ నుంచి, రాజధాని నిర్మాణ డిజైన్ల వరకూ నిత్యం సమీక్షలు చేస్తూనే ఉన్నాడు. కాని అమరావతి కోసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గంటల తరబడి సమీక్షలు, రోజుల తరబడి చర్చలతో బాబు బాగా బిజీ గా ఉంటున్నారు. లక్ష సమీక్షలు చేసి, డిజైనర్లతో భేటీలు వేసి, కమిటీలతో కుమ్మక్కులయ్యీ దసరాకు పునాది వేస్తానన్న అమరావతి రాజధాని శంకుస్థాపన ఇంత వరకూ ప్రారంభమే కాలేదు. ఇదీ బాబుగారి సమీక్షా సారాంశం.

జిల్లాలవారీ సమీక్షలు
ఇక పార్టీలోనూ చంద్రబాబు ధోరణి అసహనానికే గురిచేస్తోంది. రోజులో 24 గంటలుంటే 12 గంటలు సమీక్షలు, 12 గంటలు ప్రయాణాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు చంద్రబాబు. ఒక్కోసారైతే సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకే సిఎమ్ అపాయింట్మెంట్ లభించడంలేదని నేతలంతా గుర్రు మంటున్నారు. ఇక తమ కష్టాలేమైనా చెప్పుకోవాలని వచ్చిన సామాన్యులకైతే చంద్రబాబు దర్శనమే ఉండటం లేదట. జిల్లాల వారీ సమీక్షలంటూ హడావిడి చేసినప్పుడు కూడా ఆయా జిల్లాల సమస్యల గురించి నేతలు మాట్లాడినప్పుడల్లా వారిని విసుక్కోవడం, ఈ విషయాలు మాట్లాడవద్దుంటూ వారిని వారించడం చేసారు. ఇక ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల నేతల గొడవలు సర్దిచెప్పడం, అంతర్గత కలహాలను తగ్గించుకోవడంతోనే ఈ సమీక్షలు సరిపోయాయి. 

చంద్రబాబు మూడేళ్ల కాలం కుర్చీల్లో కబుర్లతో కాలక్షేపం అయిపోయింది. విలువైన కాలం అంతా కాన్ఫరెన్సుల్లో కరిగిపోయింది. బాబు వారసుడిగా లోకేష్ కూడా తండ్రి బాటలోనే పనులెందుకు దండగ సమీక్షలుండగా అని ఆ విధంగా ముందుకు పోతున్నాడు. ఒకే రోజు వివిధ కార్యక్రమాలపై సమీక్షలు చేస్తున్నాడు. ఈ సమీక్షల్లో తండ్రి గొప్పతనం గురించి చెప్పుకోవడం, తను చేయబోయే అభివృద్ధి గురించి దండోరా వేయడంతోనే సరిపెడుతున్నాడు. అందుకే ఇప్పుడు చంద్రబాబును సమీక్షల ముఖ్యమంత్రి అని, చిన బాబును బాజాల భజంత్రీ అని పిలుస్తున్నారట వీరి శైలితో విసుగెత్తిపోయిన అధికారులు.

తాజా వీడియోలు

Back to Top