విద్యాలయాలు కాదు విషాలయాలు

నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాలయాలన్నీ మృత్యాలయాలయ్యాయి. నిత్యం విద్యార్థుల ఆత్మహత్యలే గంటలై మోగుతున్నాయి. ఇది విద్యావిధానాన్ని గుప్పెట్లో పెట్టుకుని, నిరంకుశంగా వ్యవహరిస్తున్న కొందరు పెద్దలు, వారి వెనక ఉన్న నేతలను నిలదీయాల్సిన సమయం. 
ఏ వేదిక ఎక్కినా చంద్రబాబు ఈ మధ్య ఒక మాట అంటున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి. వారే రేపటి భవిష్యత్తు అని. కాని రాష్ట్రంలో రేపటి భవిష్యత్తు ఉరికి వేళాడుతోంది. బలవంతంగా భవిష్యత్తును బలి చేసుకుంటోంది. రోజూ ఏదో ఒక చోట విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు చూసి ప్రజలు చలించిపోతున్నారు. కాని పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. గత మూడేళ్లలో వందల మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇందులో ఎక్కవశాతం మరణాలు చదువుల వత్తిడితో జరిగినవే. మరో విషయం ఏమిటంటే రాష్ట్రంలో రాబందుల్లా రెక్కలు చాచిన రెండు ప్రముఖ సంస్థల స్కూళ్లు, కాలేజీల్లోనే ఈ సంఘటనలు జరుగుతుండటం. 

 విద్యాశాఖామంత్రి గంటా గారు చెప్పొచ్చేదేమంటే ఈ విద్యార్థుల మరణాలకు కుటుంబ సమస్యలు, ప్రేమలే కారణమట. అందువల్ల కాలేజీలను కాని, యాజమాన్యాలను గానీ తప్పు పట్టకూడదని శెలవిచ్చారు అమాత్యులు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం, కేసులు పెట్టడం చేయనక్కర్లేదని కూడా మీడియాకు తెలియజేసారు. వందల మంది విద్యార్థులు ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం ఎందుకు వెనకేసుకొస్తోందో ప్రజలు ఆమాత్రం అర్థం చేసుకోగలరు. నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ ఏ రాజకీయ అనుభవం లేకుండా చంద్రబాబు మంత్రి వర్గంలో చేరడం వెనుక మతలబును గ్రహించగలరు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలను తీసేందుకు కూడ వెనుకాడడం లేదు. 

ప్రైవేటు కళాశాలలు అనుమతులు లేని హాస్టళ్లు నడుపుతున్నాయని, అందులో శ్రీచైతన్య, నారాయణ కూడా ఉన్నాయని మంత్రి గంటా వెల్లడించారు. కాని వాటికి నోటీసులిచ్చి, గడువులిచ్చి తప్పులు సరిదిద్దుకోమంటున్నారు. కాని జరిగిపోయిన నష్టానికి ప్రభుత్వం కాని, కళాశాలల యాజమాన్యాలు గానీ బాధ్యత వహించవట. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు. లక్షల ఫీజులు పోసి, కోటి కలలతో పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల గడపలోకి పంపిస్తే, అవి మృత్యు కుహురాలై తల్లిదండ్రులకు గుండెకోత మిగిలిస్తున్నాయి. సాలెగూటిలో చిక్కిన పురుగులా, చదువుల కోసం ప్రైవేటు కాలేజీల్లో చిక్కుకుపోతున్నారు విద్యార్థులు. గంటల కొద్దీ క్లాసులు, నిర్బంధాలు, టెస్టులు, బెదిరింపులు అన్నీ కలిసి విద్యార్థులపై పెంచే ఒత్తిడి వారిని ఆత్మహత్యలకు పురికొల్పుతోంది. 

ఇలాంటి దారుణ సంఘటనలు జరిగినప్పుడు యాజమాన్యాల తీరు విమర్శలకు తావిస్తోంది. ఘటన జరిగన విషయాన్ని పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆసుపత్రికి తరలించిన తర్వాత, ఎప్పుడో ఆలస్యంగా పేరెంట్స్ కు తెలియజేయడం, ఎలాంటి వివరాలూ చెప్పకూడందంటూ సహవిద్యార్థులను బెదిరించడం వంటి చర్యలతో జరిగే దారుణాలను కప్పిపెడుతున్నాయి కళాశాల యాజమాన్యలు. ఇంతటి వ్యవస్థాగత నేరాలు ప్రైవేటు విద్యాసంస్థల్లో జరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకోమంటోంది ప్రభుత్వం. ఇది దుర్మార్గపూరితమైన టిడిపి ప్రభుత్వ వైఖరికి పరాకాష్ట. కడుపుశోకంతో ఆక్రోశించే ఆ తల్లిదండ్రులు ఒకరోజు తమ సహనాన్ని విడిచి ప్రభుత్వంపై, ప్రైవేటు విద్యా సంస్థలపై తిరగబడితే, అప్పుడు జరిగే విపరీత పరిణామాలకు ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అన్యాయానికి కొమ్ము కాస్తున్న చంద్రబాబు, ఆయన ప్రభుత్వం ప్రజల చేతిలో చావు దెబ్బతినే రోజు ఇంకెంతో దూరంలో లేదని వారంటున్నారు.  

తాజా ఫోటోలు

Back to Top