జగనన్న కోసం ఏం చేయాలనుకొంటున్నారు?

గాజువాక (విశాఖ జిల్లా) :

‘బాగున్నారా..! అన్న కోసం ఏం చేయాలనుకొంటున్నారు..!’ శ్రీమతి షర్మిల ప్రశ్న. ‘జగన్ రావాలని కోరుకొంటున్నాం’ విశాఖ జిల్లా దువ్వాడ సమీపంలోని సంపత్‌ వినాయకనగర్‌ వద్ద బుధవారం ఆవిష్కృతమైన సందర్భం ఇది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్న శ్రీమతి షర్మిలకు సంపత్ వినాయకనగ‌ర్ వద్ద మహిళలు హారతి పట్టారు. ఈ సందర్భంగా వారితో శ్రీమతి షర్మిల ముచ్చటించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగనన్న సోదరి శ్రీమతి షర్మిల ఆత్మీయ పలకరింపుతో జనమంతా ఆనందభరితులవుతున్నారు. నడుస్తూనే ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ మరో ప్రజాప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా అందరితో కరచాలనం చేస్తూ ఆప్యాయతను పంచుతున్నారు.

వడ్లపూడి నిర్వాసిత కాలనీలో భవన నిర్మాణ కార్మికులు తమ పనులను కొద్దిసేపు నిలిపివేసి శ్రీమతి షర్మిలను చూసేందుకు వచ్చారు. అప్పికొండ కాలనీలో 108 అంబులెన్సు సిబ్బంది వాహనాన్ని నిలిపి శ్రీమతి షర్మిలకు అభివాదం చేశారు. వడ్లపూడిలో ఒక చిన్నారికి ఆమె నామకరణం చేశారు. అక్కడి నుంచి ముందుకు సాగిన షర్మిలకు కార్యకర్తలు భారీ బాణ సంచా వెలుగులతో స్వాగతం పలికారు.

పులకించిన గాజువాక :
రాజన్న బిడ్డ రాకతో గాజువాక పులకించింది. మహానేత తనయ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో పారిశ్రామిక ప్రాంతం జనసంద్రంగా మారింది. జగనన్న సోదరి షర్మిలను చూసేందుకు జనం హోరెత్తారు. గాజువాక నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల తొలిరోజు 8.5 కిలోమీటర్లు నడిచారు. దువ్వాడ సెక్టార్-1 వద్ద గాజువాకలోకి ప్రవేశించిన పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహపూరితంగా సాగింది. పెందుర్తి నియోజకవర్గంలోని కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం సాయంత్రం శ్రీమతి షర్మిల ప్రారంభించారు. అనంతరం దువ్వాడ సెక్టార్-1వద్ద గాజువాక నియోజకవర్గంలోకి ప్రవేశించారు.

గాజువాకలో శ్రీమతి షర్మిలకు పార్టీ గాజువాక నియోజకవర్గం కన్వీనర్‌ తిప్పల నాగిరెడ్డి సారథ్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కిక్కిరిసిన జనసందోహం మధ్య ఆమె పాదయాత్ర కొనసాగింది. మంగళపాలెం జంక్షన్, దువ్వాడ రైల్వే బ్రిడ్జి మీదుగా రాజీవ్‌నగర్‌ జంక్షన్‌కు చేరుకున్న పాదయాత్రకు పార్టీ నాయకులు దామా సుబ్బారావు సారథ్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ మహానేత వైయస్‌ విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి, ప్రజలకు అభివాదం చేశారు. వుడా ఫేజ్-7లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి దువ్వాడ స్టేషన్‌ రోడ్‌ మీదుగా కూర్మన్నపాలెం వైపు సాగారు. ముస్తాఫా జంక్షన్‌కు సమీపంలో 60 అడుగుల రోడ్‌లో వడ్లపూడి నిర్వాసిత కాలనీలోకి ప్రవేశించారు.

కణితి ఎస్సీ కాలనీ, లక్ష్మీపురం, అప్పికొండ, బొట్టవానిపాలెం, కణితి, వడ్లపూడి కాలనీల మీదుగా శ్రీమతి షర్మిల జాతీయ రహదారికి చేరుకున్నారు. వడ్లపూడి జంక్షన్‌ జాతీయ రహదారిపై నడుస్తున్న శ్రీమతి షర్మిలను చూసేందుకు రైల్వే క్వార్టర్లు, విశ్వేశ్వరాయనగర్‌ కాలనీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆమె చినగంట్యాడ, శ్రామికనగర్‌లు మీదుగా లంకా మైదానంలో ఏర్పాటు చేసిన బసవద్దకు చేరుకున్నారు.

Smt. Sharmila walkthon in Gajuwaka in Vizagదారులన్నీ లంకా మైదానం వైపే :
మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల గాజువాక ప్రాంతంలోకి అడుగిడిన సందర్భంగా ఆమెను చూసేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు వందలాది మంది వచ్చారు. అనంతరం ఆమె లంకా మైదానంలో రాత్రి బసకు ఉపక్రమించేందుకు సిద్ధమయ్యారు. రాత్రి ఎనిమిది గంటలవుతున్నా జాతీయ రహదారి కిటకిటలాడుతూనే ఉంది. రాజన్నబిడ్డను చూసేందుకు అభిమానులు బారులు తీరారు. మైదానంలో భారీగా లైట్లు ఏర్పాటుచేశారు. పార్టీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికేందుకు భారీగా ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది.

ఉక్కపోతనూ.. లెక్కచేయని జనం :
పెందుర్తి నియోజకవర్గం అనంతరం శ్రీమతి షర్మిల పాదయాత్ర బుధవారం సాయంత్రం గాజువాక నియోజకవర్గంలో కొనసాగింది. ఆ సమయంలో దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంత ఎండలోనూ జనం బారులు తీరారు. ఉక్కపోత తీవ్రంగా ఉన్నా జనం లెక్క చేయలేదు.

షర్మిల ‌నిలదీయడంతో చురుగ్గా తాండవ లైనింగ్ :

తాండవ రిజర్వాయర్‌ కాలువల ఆధునికీకరణ పనుల పూర్తిపై అధికారులు ఎట్టకేలకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రిజర్వాయర్‌ ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ. 55 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం కారనంగా పనులు పూర్తి కాకపోవడంతో 35 వేల ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. తాండవ పనులు సక్రమంగా జరగలేదని ఆయకట్టుదారులు, రైతులు గత నెల 25న నాతవరం మండలం మీదుగా పాదయాత్ర చేస్తున్న వైయస్‌ తనయ శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె ములగపూడి, బెన్నవరం వద్ద ఉన్న తాండవ కాలువను పరిశీలించి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన అధికారులు శివారు కాలువ లైనింగ్ పనులను చురుగ్గా చేస్తున్నారు. షర్మిలమ్మ కాలువలను పరిశీలించడం వల్లే పనుల్లో కదలిక మొదలైందని రైతుల్లో ‌ఆనందం వ్యక్తం అవుతోంది.

Back to Top