ప్రణాళిక ప్రకారం ప్రజాధనం లూటీ

  • పోలవరంలో టీడీపీ దోపిడీ
  • చంద్రబాబు కనుసన్నల్లో కమీషన్ల వ్యవహారం
  • ఈపీసీ నిబంధనలు.. మంత్రి వర్గం తీర్మానాలు హుష్‌కాకి
  • కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌తో సర్కారు పెద్దలు కుమ్మక్కు
  • గతంలో బిల్లులు ఇవ్వని రాయపాటిపై సబ్‌ కాంట్రాక్టర్ల ఫిర్యాదు
  • సర్కార్, పీపీఏ స్పందించకపోవడంతో పనులు ఆపేసిన వైనం

ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ ‘ప్రత్యేక హోదా’ను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్యాకేజీకి మొకరిల్లిన చంద్రబాబు సర్కార్.... అందుకు ప్రతిఫలంగా దక్కించుకున్న పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి  కేంద్రం పోలవరం ప్రాజెక్టును అప్పగించి 24 గంటలు గడవక ముందే హెడ్‌ వర్క్స్‌ అంచనాను రూ.1,482 కోట్లు పెంచేసి.. ఆ మేరకు దోచుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇదే విషయాన్ని సాగునీటి శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ కమీషన్ల వ్యవహారం ముందుకు సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈపీసీ(ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో సర్కార్‌ అనుమతితో 50 శాతం పనులను మాత్రమే సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ, ఈ నిబంధనను తుంగలో తొక్కి హెడ్‌ వర్క్స్‌ పనులను గంపగుత్తగా సబ్‌ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి.. ప్రధాన కాంట్రాక్టర్‌ రాయపాటితో కలిసి పర్సంటేజీలు పిండుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు వినిపిస్తోంది.

కాంట్రాక్టరును రక్షించి కమీషన్లు కొట్టేయడమే లక్ష్యం..
పోలవరం హెడ్‌ వర్క్స్‌ పనుల తీరుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. పీపీఏ అసహనం నేపథ్యంలో ఈపీసీ విధానంలో 60సీ నిబంధన కింద ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు వేసి.. మళ్లీ టెండర్‌ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. స్టీలు, సిమెంటు, డీజిల్‌ వంటి ధరలు తగ్గిన నేపథ్యంలో అంచనా వ్యయం కూడా తగ్గుతుందని.. ఆ మేరకు ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుందని సూచించారు. కానీ.. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. కాంట్రాక్టర్‌ రాయపాటిని రక్షించడం, భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకోవడానికి ‘పెద’బాబు ఎత్తు వేశారు.

మెజారిటీ వాటా పెదబాబుకే..
అంచనాలు పెంచేసిన నేపథ్యంలో ప్రధాన కాంట్రాక్టర్‌ రాయపాటి 25 శాతం కమీషన్‌పై పనులను సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చినట్లు ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే ఓ కీలక అధికారి చెప్పారు. ఇందులో మెజారిటీ వాటా పెదబాబుకు దక్కుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గంపగుత్తగా పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడం నిబంధలనకు విరుద్ధం కావడంతో, సర్దుబాటు చేసేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంపై ఆమోదముద్ర వేసేందుకు జలవనరుల శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అధికారులతో సోమవారం సమావేశమవుతున్నారు. పనులను 2018లోగా పూర్తి చేయాల్సి ఉందన్న సాకు చూపి సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై అధికారముద్ర వేయనున్నారు. కానీ ‘ఎస్క్రో అకౌంట్‌’ వ్యవస్థ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో హెడ్‌ వర్క్స్‌ పనులు చేసిన సంస్థకు కాకుండా ప్రధాన కాంట్రాక్టర్‌ రాయపాటికి బిల్లులు చెల్లిస్తారు. ఇప్పటికే బిల్లులు చెల్లించడం లేదని  రాయపాటిపై ఫిర్యాదు చేసినా సర్కార్‌ స్పందించకపోవడంతో ఎల్‌ అండ్‌ టీ, బావర్‌ సంస్థలు పనులు ఆపేశాయి. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తే.. సబ్‌ కాంట్రాక్టు సంస్థలు కమీషన్‌ ఎగ్గొడతాయేమోననే భావన వల్లే సర్కార్‌ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.

అనుమతులు లేవు.. ఎస్క్రో అకౌంట్‌ లేదు..
మంత్రివర్గం తీర్మానం అలా ఆమోదించిందో లేదో ట్రాన్స్‌ట్రాయ్‌ ఇలా సబ్‌ కాంట్రాక్టర్లను తెరపైకి తెచ్చింది. రాక్‌ఫిల్‌ డ్యాం పనులను పెదబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎల్‌ అండ్‌ టీకి, డయా ఫ్రం వాల్‌ పనులను బావర్‌(జర్మనీ)కు ట్రాన్స్‌ట్రాయ్‌ అప్పగించింది. కానీ.. ఇందుకు జలవనరుల శాఖ అనుమతి ఇప్పటివరకూ తీసుకోలేదు. కేబినెట్‌ తీర్మానం ప్రకారం ‘ఎస్క్రో’ అకౌంట్‌ వ్యవస్థ ను ఏర్పాటు చేయనేలేదు. సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించిన తర్వాత చేసిన పనులకు రూ.385 కోట్లకుపైగా బిల్లులను ట్రాన్స్‌ట్రాయ్‌కు ప్రభుత్వం చెల్లించింది. కానీ.. ఆ బిల్లులను సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు పీపీఏకు, సర్కార్‌కు ఫిర్యాదు చేశాయి. ఇవేవీ పరిగణనలోకి తీసుకోని సీఎం చంద్రబాబునాయుడు హెడ్‌వర్క్స్‌లో మట్టి పనులు, స్పిల్‌ ఛానల్‌ పనులను త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు, కాంక్రీట్, పవర్‌ హౌస్‌ పునాది పనులను పూజి మీయిస్టర్‌కు, స్పిల్‌ వే పనులను ఎల్‌ అండ్‌ టీ– బావర్‌(జేవీ)లకు సబ్‌ కాంట్రాక్టుకు అప్పగించాలన్న ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసేశారు. దాంతో ఆ సంస్థలు మిషనరీని రంగంలోకి దించాయి.
Back to Top