పోలవరం వైయస్ స్వప్నం

2004 వరకూ పోలవరంవైపు కన్నెత్తి చూడని సీఎంలు  
► వైయస్‌ సీఎం కాగానే నాలుగు నెలల్లోనే ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు
► అన్ని అనుమతులు సాధించిన మహానేత... విపక్ష నేతగా చంద్రబాబుది సైంధవ పాత్రే
► భూసేకరణకు సహకరించవద్దంటూ రైతులను..
► పనులు చేయొద్దంటూ కాంట్రాక్టర్లను రెచ్చగొట్టిన చంద్రబాబు
► అడ్డంకులు సృష్టించినా రూ.5135 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన వైయస్‌
► కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న రాష్ట్ర ప్రభుత్వం
► పోలవరం పనుల్లో అక్రమాలపై పోరాడుతున్న విపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
► పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు

అమరావతి:  తెలుగు ప్రజల వందేళ్ల స్వప్నం.. రాష్ట్ర వరదాయిని బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరం. అయినా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు 2004 వరకూ ఏ ఒక్క ముఖ్యమంత్రీ సాహసించ లేకపోయారు. కానీ ’మహాప్రస్థానం’ పాదయాత్రలో రైతుల కష్టాలు, కన్నీటి గాథలను పరిశీలించిన వైయస్‌ రాజశేఖరరెడ్డి.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలుగునేల పచ్చని పంటలతో పరిఢవిల్లుతుందని విశ్వసించారు. తాను ముఖ్యమంత్రి కాగానే పోలవరం చేపట్టి తెలుగు నేల నుంచి కరువును తరిమికొడతానని ప్రతినబూనారు. ఆ మేరకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల్లోగానే వందేళ్ల స్వప్నాన్ని సాకారం చేసేందుకు నడుం బిగించారు.

పోలవరం ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన పరిపాలనపరమైన అనుమతులు సెప్టెంబరు 10, 2004న జారీ చేశారు. నవంబర్‌ 29, 2004న శంకుస్థాపన చేసి శరవేగంగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు వైయస్‌ భగీరథుడిలా జలయజ్ఞం చేస్తే.. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సైంధవుడిలా అడుగడుగునా అడ్డుతగిలారు... కోర్టుల్లో కేసులు వేయించారు. 1995 నుంచి 2004 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టుపై కనీసం దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇప్పుడేమో పోలవరం తన కలంటూ.. రికార్డు పూర్తి చేస్తానంటూ  ప్రకటనలు చేస్తూ.. కేక్‌లు కట్‌ చేస్తూ.. సంబరాలు చేసుకుంటోండటం వింతగా ఉందని అధికారవర్గాలే బాహాటంగా విమర్శలు చేస్తుండటం గమనార్హం. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్రం ప్రభుత్వం చేజిక్కించుకుని.. అంచనా వ్యయం పెంచేస్తూ కమీషన్లు ఇచ్చేవారికి నామినేషన్‌పై పనులు అప్పగిస్తూ చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా, నిర్వాసితులకు మద్దతుగా విపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే.. ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారంటూ ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శతాబ్దం స్వప్నం పోలవరం..
బ్రిటీషు ప్రభుత్వంలో నీటిపారుదల విభాగంలో కీలకంగా వ్యవహరించిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌.. దేశంలో నదులను అనుసంధానం చేస్తే దుర్భిక్షాన్ని తరిమికొట్టవచ్చునని అప్పట్లో నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో పోలవరం ప్రాజెక్టు ప్రధానమైనది. ఆ ప్రతిపాదనను బ్రిటీషు ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 1952 వరకూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో భాగం. మద్రాసు రాష్ట్రంలో ప్రధాన ఇంజనీర్‌ బహద్దూర్‌ ఎల్‌.వెంకటకృష్ణ అయ్యర్‌ పోలవరం ప్రాజెక్టును చేపడితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని 1941లో అప్పటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాన్ని కూడా మద్రాసు ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రఖ్యాత ఇంజనీర్‌ కేఎల్‌ రావు కూడా రామపాదసాగరం పేరుతో పోలవరం ప్రాజెక్టును చేపట్టాలని 1946లో ప్రతిపాదించారు. నవంబర్‌ 1, 1956న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 1980 వరకూ పోలవరం ప్రాజెక్టుపై ఏ ఒక్క ముఖ్యమంత్రి దృష్టి సారించిన దాఖలాలు లేవు. జస్టిస్‌ బచావత్‌ నేతృత్వంలోని గోదావరి ట్రిబ్యునల్‌ పోలవరం ప్రాజెక్టును నిర్మించుకోవడానికి అనుమతి ఇస్తూ 1980లో తీర్పును ఇచ్చింది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ.. నిర్మాణ పనులను ప్రారంభించలేకపోయారు.

మహానేత అలుపెరగని పోరాటం..
’మహాప్రస్థానం’ పాదయాత్రలో రైతుల కష్టాలు, కన్నీటి గాథలను పరిశీలించిన వైయస్‌ రాజశేఖరరెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జలయజ్ఞం చేసి తెలుగు నేల నుంచి కరవును తరిమికొడతానని ప్రతినబూనారు. పోలవరాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగు నెలలు కూడా తిరక్కుండానే రూ.10,151.64 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి పరిపాలనపరమైన అనుమతులను సెప్టెంబరు 10, 2004న జారీ చేశారు. ఆ తర్వాత తొమ్మిది రోజులకే అంటే.. సెప్టెంబరు 19, 2004న పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి సైట్‌ క్లియరెన్స్‌ను కేంద్రం నుంచి సాధించారు. నవంబర్‌ 29, 2004న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైయస్‌.. ఆ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను సాధించడం కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఫలితంగా అక్టోబర్‌ 25, 2005న పర్యావరణ అనుమతిని, ఏప్రిల్‌ 17, 2007న సహాయ, పునరావాస ప్యాకేజీ(ఆర్‌ అండ్‌ ఆర్‌)కీ, సెప్టెంబరు 19, 2008న అభయారణ్యం అనుమతిని, డిసెంబర్‌ 26, 2008న అటవీ శాఖ అనుమతిని, జనవరి 20, 2009న సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ అనుమతిని కేంద్రం జారీ చేసింది. దాంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రధాన పనులు పూర్తి చేసే క్రమంలోనే వైయస్‌ హఠాన్మరణం చెందడంతో పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది.
Back to Top