పట్టిసీమ ఉట్టిసీమేనట

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చేసే ఆర్భాటాలు, చెప్పే మాటలూ అన్నీ అబద్ధాలని తేలిపోయింది. దగాకోరు టిడిపి ప్రభుత్వం ప్రజల ముందో మాట, కేంద్రం వద్ద మరో మాట, జలసమీక్షల దగ్గర ఇంకోమాట మార్చి మార్చి చెబుతోంది. పట్టిసీమ విషయంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే నిజమైంది. పట్టిసీమ ప్రాజెక్టుద్వారా 1600కోట్ల రూపాయిల నిధులను నీళ్లపాలు చేసారని వైయస్ జగన్ ఆది నుంచీ ఆక్షేపిస్తూనే ఉన్నారు. ఇది ప్రజాధన దుర్వినయోగం అంటూ ప్రతిపక్ష నేత అన్ని వేదికలపైనా చంద్రబాబు తీరును ఎండగడుతూనే ఉన్నారు. కాని చంద్రబాబు మాత్రం పట్టిసీమే రాష్ట్రానికి పట్టుకొమ్మ అంటూ, వేలాది ఎకరాలను కాపాడామంటూ కాకమ్మ కథలు చెప్పుకొచ్చారు. కాని ఆసలు నిజాలేంటో బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకునే తీరాల్సి వచ్చింది. 

కృష్ణా జలాల వివాదంలో బైట పడ్డ నిజాలు
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణ జరిగింది. జలాల పంపిణీకి సంబంధించి ఎపి తన అవసరాలకు అనుగుణంగా దాఖలు చేసిన అఫిడవిట్ పై తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసారు. ఎపి తరఫున సాక్షి అయిన సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావుకు పలు ప్రశ్నలు సంధించారు. పోలవరం, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు శాశ్వత ప్రాతిపదికన సాగు నీరు ఇవ్వొచ్చు గదా అని ప్రశ్నించారు. గోదావరి జలాలను వినియోగించుకోటానికి ఎపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా చెపట్టిందని అసలు విషయాన్ని బైటపెట్టారు. పోలవరంలో గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే ప్రధాన హెడ్ వర్క్స్ పనులు పూర్తి అయ్యాక పట్టిసీమలో బిగించిన 30వర్టికల్ టర్బైన్ పంపుల్ని తొలగిస్తామని సిఎమ్ కేంద్రమంత్రికి లేఖ రాశారాని సుబ్బారావు ఈ సందర్భంగా చెప్పారు. దాంతో న్యాయవాది వైద్యనాధన్ తో పాటు, ట్రిబ్యునల్ కూడా అవాక్కైంది. 1.667 కోట్లు వినియోగించి కట్టిన పట్టిసీమ తాత్కాలిక అవసరానికా అంటూ వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. పట్టిసీమను శాశ్వత ప్రాతిపదికన వినియోగించవచ్చు కదా అని సూచించారు.
 
విపక్ష నేత వివరించిన వాస్తవాలు
పట్టిసీమపై చంద్రబాబు చెప్పేవన్నీ ఒట్టి గొప్పలే అని విపక్ష నేత ఎన్నో సార్లు చెప్పిన మాట వాస్తవం అని రుజువైంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు కిందకు వెళుతున్నాయంటే అది పోలవరం కుడికాలువ వల్లే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో వివరించారు. పోలవరం కుడి కాల్వ పనులు 70శాతం వైయస్సార్ హయాంలోనే పూర్తి అయినట్టు ఆయన ప్రజలకు గుర్తు చేసారు. ఎటువంటి స్టోరేజీ లేకుండా పట్టిసీమను నిర్మించారని పలు వేదికలపై జగన్ టిడిపి సర్కార్ పై మండిపడ్డారు కూడా. స్టోరేజ్ కెపాసిటీలేని పట్టిసీమకు పెట్టిన 1600  కోట్లను పోలవరం ప్రాజెక్టుక్గ్ పెడితే అది ఒక కొలిక్కి వచ్చేదని, గాలేరు, నగరికి ఖర్చు చేస్తే అది పూర్తయ్యేదని, హంద్రీనీవాకు ఖర్చు చేసినా కొంతభాగం పనులు అయ్యేవని జగన్ మునుపు శాసనసభా సమావేశాల్లో చంద్రబాబును దుయ్యబట్టారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రతిపక్షాన్ని’మీకు అర్థం కాలేదా…?, మీకు పాఠం చెబుతా, క్లాసులు పెట్టిస్తా, ఇరిగేషన్ బడికి పంపిస్తా, మేధావులతో మాట్లాడిస్తా…’ అంటూ విమర్శించారు. పట్టిసీమను వ్యతిరేకించడం జాతి ద్రోహం అన్నారు. 

నిజానికి కృష్ణా డెల్టాకు 180tmcల నీరు అవసరం. కాని పట్టిసీమకు వచ్చింది 4 టిఎమ్ సిలే. గోదావరి నుంచి 2000 tmcల నీరు సముద్రంలో కలుస్తోంది. స్టోరేజ్ లేని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా 180tmcల అవసరం ఎలా తీరుతుందని విపక్షనేత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పనే లేదు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మాత్రం పట్టిసీమ తాత్కాలిక ప్రాజెక్టు అని, పోలవరం పూర్తయిన తర్వాత దాన్ని పక్కకు పెడతామని వాదన వినిపిస్తున్నాడు. పోలవరంపై శ్రద్ధపెట్టకుండా కోట్లాది రూపాయలను తాత్కాలిక పనులకు వెచ్చించడం చంద్రబాబు మతిలేనితనమని సాగునీటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదో చేసేసామనే గొప్పలు చెప్పుకోడానికే తప్ప, రాష్ట్రానికి అది ఉపయోగపడేదో కాదో చంద్రబాబు ఆలోచించడం లేదు. ఇక పట్టిసీమ పేరుతో అస్మదీయులకు అందినకాడికి దోచిపెట్టారనీ ఆరోపణలున్నాయి. రాజధానిలో సైతం ఇలాగే తాత్కాలిక భవనాలకోసం కోట్ల రూపాయిలు తగలేసిన విషయాన్ని ఈ సందర్భంలో తెలుగు ప్రజలు గుర్తు చేసుకోకుండా ఉంటారా? టిడిపి ప్రభుత్వాన్ని త్వరలో తాత్కాలికం చేయక మానతారా అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

Back to Top