పశ్చిమలో దూసుకుపోతున్న జగనన్న బాణం

భీమవరం (ప.గో.జిల్లా) :

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు, దానికి రక్షణ కవచంలా నిలుస్తూ చంద్రబాబు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సంధించిన బాణం పశ్చిమగోదావరి జిల్లాలో దూసుకుపోతోంది. మహానేత రాజన్న తనయ, జననేత జగనన్న సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో జనభేరి మోగిస్తోంది. ఏ పల్లెలో చూసినా తోరణాలు, మేళతాళాల సందడితో పండుగ వాతావరణం నెలకొన్నది. శ్రీమతి షర్మిలకు ఆమె నడిచే దారి వెంట హారతులిస్తూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహానేత తనయ వెంట జనం సంద్రమై కదం తొక్కుతున్నారు.

‘అన్నా.. అక్కా.. అవ్వా..’ అనే పలకరింపులు విని వారంతా పులకించిపోతున్నారు. జగనన్న ఎప్పుడొస్తారని అడుగుతున్నారు. సమస్యలు చెప్పుకుని ఊరట చెందుతున్నారు. ‘ధైర్యాన్ని వీడవద్దు.. జగనన్న త్వరలోనే తప్పక వస్తారు. మన కష్టాలు తీరుస్తార’ని భరోసా ఇస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగుతున్నారు.

ఆదివారం పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ప్రారంభమైన పాదయాత్ర గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, వీరవాసరం మండలం నందమూరుగరువు, వీరవాసరం, బొబ్బనపల్లి, మత్స్యపురిల మీదుగా కొనసాగింది. జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని జైలులో అక్రమంగా నిర్బంధించి సోమవారానికి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో నరసాపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన, మంగళవారం పాలకొల్లులో శ్రీమతి షర్మిల నిరశనదీక్ష చేస్తారు.

పల్లె.. పట్టణమనే తేడాలేదు. ఎక్కడ చూసినా మహిళలు, యువకులు, విద్యార్థులు శ్రీమతి షర్మిలతో కలసి అడుగులు వేస్తున్నారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డిని, జననేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని శ్రీమతి షర్మిలలో వారు చూసుకుని ఆనందపరవశులవుతున్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల కష్టా‌లను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలన్నీ తీర్చి జన హృదయ నేతగా వారి మనస్సుల్లో నిలిచిపోయారు.

మహానేత వైయస్‌ఆర్ మరణానంతరం ఆయన తనయుడు‌ శ్రీ వైయస్ జగ‌న్ మాట‌ తప్పని.. మడమ తిప్పని తండ్రి అగుడుజాడల్లో ఓదార్పు యాత్ర చేసి జననేతగా ఎదిగారు. అది చూసి ఓర్వలేని కాంగ్రెస్, ‌టిడిపి నాయకులు దుష్ట పన్నాగాలతో ఆయనను అన్యాయంగా జైలులో పెట్టించారు. ప్రజల పక్షాన పోరాడే నాయకుడిని జనం మధ్య లేకుండా చేశామని ఆనందపడుతున్న ఆ రెండు పార్టీలకు చెంపపెట్టులా.. జగనన్న వదిలిన బాణంలా.. రాజన్న బాటలో పయనిస్తున్న శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్, ‌టిడిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 15వ రోజైన ఆదివారం విజయవంతంగా కొనసాగింది. ఉదయం 9 గంటలకు విస్సాకోడేరులో ప్రారంభమైన యాత్ర గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరుగరువు, వీరవాసరం, బొబ్బనపల్లి, మత్స్యపురి మీదుగా కొనసాగింది. అడుగడుగునా ప్రజలు హృదయపూర్వక స్వాగతం పలికారు. శ్రీమతి షర్మిలను చూసేందుకు చెట్లు, డాబాలు, మేడలు, వాహనాలు ఎక్కి అభివాదాలు చేశారు. బొబ్బనపల్లిలో‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

శ్రీమతి షర్మిల నందమూరుగరువు చేరుకున్నప్పుడు పి.లావణ్య అనే విద్యార్థిని వచ్చి ‘అక్కా...బాగున్నావా’ అని పలకరించింది. నాంచారమ్మ అనే మహిళ ‘మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లీ’ అంటూ ఆవేదన చెందింది. వారి మాటలకు స్పందించిన శ్రీమతి షర్మిల ‘మనందరికీ మంచిరోజులు వస్తాయి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ మేలు చేస్తార’ని పాదయాత్రను ముందుకు సాగించారు. వీరవాసరంలో ప్రధాన రహదారిపై ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీమతి షర్మిలతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. కాంగ్రెస్, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పాలని మహిళలకు శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

మరో ప్రజాప్రస్థానంలో చిన్నారులు కూడా 'మేము సైతం' అంటూ పాదయాత్రలో పాల్గొని ‘జై జగన్... జోహార్ వై‌యస్‌ఆర్’ ‌అంటూ నినదించారు. బొబ్బనపల్లిలో వెంకటలక్ష్మి అనే మహిళ ‘అమ్మా.. నాన్నగారు మాకెంతో మేలు చేశారు. ఆయన లేకపోవటంతో అందరికీ కష్టాలొచ్చాయి’ అంది. అప్పాయమ్మ అనే మహిళ కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, తమలాంటి పేదలు బిల్లులు ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేసింది. రాముడు అనే వృద్ధుడు మహానేత డాక్టర్ వై‌యస్‌ను గుర్తుచేసుకుంటూ ఆయన లేకపోవటంతో ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతోందని వాపోయాడు. పలువురు వికలాంగులు తమ బాధలు చెప్పుకున్నారు. మత్స్యపురి శివారులో మహిళలు శ్రీమతి షర్మిలకు హారతులు పట్టి స్వాగతం పలికారు.

Back to Top