నాలెజ్డ్ సొసైటీ కాదు సూసైడ్ సొసైటీ

ఎపి సిఎమ్ చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు తిమ్మిని బమ్మిని చేయడానికే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బంగారు భవితను అందుకోవాల్సిన విద్యార్థులు అర్థంతరంగా ప్రాణాలు తీసుకుంటుంటే కళాశాలలపై కొరడా ఝుళిపించాల్సింది పోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒత్తిడితో పిల్లల ప్రాణాలు నిలువునా తోడేస్తున్న తోడేళ్ల కాలేజీ పేరు కాని, దాని అధినాయకుల పేరుగాని తలవలేదు చంద్రబాబు. ప్రస్తుత కార్పొరేట్ విద్యా విధానంలో మార్పులకోసం కమిటీ వేసారు బాబుగారు. ఇంత వరకూ బాబుగారు వేసిన ఏ ఒక్క కమిటీ రిపోర్టను ఆయన పట్టించుకున్నదే లేదు. కంటి తుడుపు చర్యలా ఈ కమిటీలు వేయడం, వాటి నివేదికలను చెత్తబుట్టల పాలు చేయడం చంద్రబాబు నైజం. 

విద్యార్థుల మరణాలకు కారణమైన యాజమాన్యాలను, కళాశాల నిర్వాహకులను శిక్షించాల్సిది పోయి, ప్రైవేటు కళాశాలల ప్రతినిధులతో తాపీగా సమావేశం నిర్వహించారు బాబుగారు. గ్రేడ్ల కోసం ఆరాటపడుతూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయద్దంటూ వారికి సూచనలు చేసారు. అలాంటి సూచనలకే మార్పులు జరిగిపోతే ఇక తప్పులే జరగవు కదా. కాని చంద్రబాబు ప్రైవేటు కళాశాలలను పల్లెత్తు మాట అనడం లేదు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ, సామాజిక సేవకు 5 మార్కులు, నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దడాలంటూ కాకమ్మ కబర్లు మొదలు పెట్టాడు. 
ఇక మంత్రి గంటా శ్రీనివాసరావైతే విద్యార్థుల మరణాలపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి ప్రాణాలు పోవడానికి గల కారణాలను కూడా దాచిపెడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా ప్రేమకు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించినవే అని తేల్చేశారాయన. సూసైడ్ నోట్సు లో క్లియర్ గా కాలేజీల ఒత్తిడుల వల్ల, వారి వేధింపుల వల్లే చనిపోతున్నామని రాసి మరీ ఉరి తీసుకుంటున్నా…ఇలాంటి వివక్షా పూరిత వాఖ్యలు చేయడం టిడిపి నేతలకే చెల్లింది. ఇక ఆత్మహత్యలు జరిగింది ఎక్కువగా శ్రీచైతన్యాలోనే అని శెలవిచ్చారు అమాత్యులు. గత మూడేళ్లలో నారాయణలో పదుల సంఖ్యలో విద్యార్థుల మరణాలు జరిగాయి. కొన్ని ఆత్మహత్యలైతే, కొన్ని మిస్టరీగా మిగిలిపోయాయి. కాని మంత్రి మాత్రం ఆ కాలేజీ పేరు గాని, యాజమాన్యం గురించి కాని ఒక్కమాటైనా మాట్లాడలేదు. కనీసం ఆ సంస్థల యజమాని, బాధ్యత గల మంత్రి అయిన నారాయణ కూడా వీటిపై స్పందించకపోవడం అమానుషం. ఇక మరణాల విషయంలోనూ తప్పుడు లెక్కలే చెబుతున్నారు గంటా. కోటి ఆశలో కన్నవాళ్ల కలలను మోసుకుని కాలేజీల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులను ఉరితాళ్లకు వేళ్ళాడేలా చేసే అరాచక విద్యావిధానాలకు చరమగీతం పాడకపోతే ఆ విద్యార్థిలోకమే ఈ ప్రైవేటు విద్యా విధానంపై, ప్రభుత్వంపై తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు. 

Back to Top