పాడేరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ మరోసారి మండిపడింది. సోమవారం పాడేరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సదస్సు లో పార్టీ నేతలు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలు 300 అంశాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టును తన కోటరీకే అప్పగించేందుకు చంద్రబాబు ఈ ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. అన్ని ప్రాజెక్టుల నుంచి చంద్రబాబుకు కమీషన్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.<br/>చంద్రబాబు అరకును దత్తత తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బాక్సైట్ గనులను తవ్వుకునే పన్నాగం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నట్లు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమకోసం వైఎస్సార్ సీపీ నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుందన్నారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడిన ఎమ్మెల్యేను ఎంచుకున్నందుకు గిరిజనులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. . కార్యకర్తలు పార్టీ వెన్నంటే ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తేవాలని ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. పది నెలల్లోనే టీడీపీ 60 శాతంపైగా ఆదరణ కోల్పోయిందని ధర్మాన తెలిపారు.