జగన్ రాక, రాజన్న రాజ్యం కోసం ఆరాటం

మండపేట (తూ.గో.జిల్లా) :

ఆమె చేతిలో ఎలాంటి పదవీ లేదు. అధికారం అంతకన్నా లేదు.. ఉన్నది ఒకే ఒక్క హోదా.. పేదల గుండెల్లో కొలువైన రాజన్న తనయ.. జననేతగా ఎదిగిన జగనన్న చెల్లెలు! తమ కష్టాలు చెప్పుకునేందుకు ఆ హోదాయే చాలంటున్నారు ప్రజలు. కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు ప్రతి ఒక్కరూ ఆమెకు తమ సమస్యలు చెప్పాలని పోటీ పడుతున్నారు. చెప్పుకోగానే వారి కళ్లలో కొండంత అండ లభించిందన్న ఆనందం తొణికిసలాడుతోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాకంటక పాలన, చంద్రబాబు కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాదరణ ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు వర్ధిల్లుతోంది. మహానేత బిడ్డను చూసేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు అందరూ ఆరాటపడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఆరవరోజు ఆదివారం నాటి పాదయాత్రలో రైసుమిల్లు కార్మికులు, ఇటుకబట్టీ కూలీలు, వికలాంగులు, మహిళలు, వృద్ధులు శ్రీమతి షర్మిల వద్ద తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కొంతమంది కన్నీటి పర్యంతమైతే, మరికొందరు వైయస్ మరణానంతరం తమను పట్టించుకునే వారే లేరంటూ బావురుమన్నారు. ‘జగనన్న ఎప్పుడొస్తాడు..రాజన్న రాజ్యం ఎప్పుడొస్తుందని’ ఆత్రంగా అడిగారు. ‌‘మీ కుటుంబానికి ఎన్ని కష్టాలొచ్చాయమ్మా’ అంటూ శ్రీమతి షర్మిలను పట్టుకొని కరిగి నీరయ్యారు.

అర్తమూరులో ఆత్మీయ స్వాగతం :
అర్తమూరులో శ్రీమతి షర్మిలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ వాణిజ్య విభాగం‌ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో పార్టీ జెండా రంగుల అంచులతో ఉన్న చీరలు ధరించిన మూడు వందల‌ మంది మహిళలు, శ్రీ జగన్,‌ శ్రీమతి షర్మిల చిత్రాలతో కూడిన టి షర్టులు ధరించి ఐదు వందల మందికి పైగా యువకులు స్వాగతం పలికారు. వైయస్‌ఆర్,‌ శ్రీ జగన్,‌ శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల మాస్కులతో చిన్నారులు సందడి చేశారు. శ్రీమతి షర్మిలపై పూలవర్షం కురిపిస్తూ పూలబాటపై నడిపించారు.

జగన్ ‌సిఎం కావాలని పాస్టర్ల ప్రార్థనలు :
మండపేటలో కొత్తగా నిర్మించిన ఏసుక్రీస్తు మహిమ మందిరంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ల ఫెలోషిప్‌ సమావేశానికి శ్రీమతి షర్మిల విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రతా‌ప్‌ సిన్హా, ప్రధాన కార్యదర్శి డానియల్‌ పాల్, శుభక‌ర్, జాన్స‌న్‌ల ఆధ్వర్యంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. శ్రీమతి షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, శ్రీ జగన్ ‌సిఎం కావాలని పాస్టర్లు ప్రార్థనలు చేశారు. వైయస్ అధికారంలోకి రాగానే దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడంతో పాటు క్రిస్టియ‌న్ ఫైనా‌న్సు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, జెరూసలేం వెళ్లేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం చేసే వారని సిన్హా గుర్తు చేశారు.

జనసరోవరంగా మారిన కలువపువ్వు సెంటర్ :
మండపేటలో ప్రజలు‌ శ్రీమతి షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. వంతెన నుంచి బస చేసే కేపీ రోడ్ వరకు పూలపైనే నడిపించారు. మెయి‌న్‌రోడ్డు, బస్టాండ్ సెంట‌ర్‌ల మీదుగా పాదయాత్ర కలువపువ్వు సెంటర్ వరకు సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో‌ శ్రీమతి షర్మిల ప్రసంగానికి అనూహ్య స్పందన లభించింది. సెంటర్ నలువైపులా రహదారులన్నీ నేల ఈనిందా అన్నట్టు జనంతో కిక్కిసిరిపోయాయి. ‘వై‌యస్‌ఆర్ సువర్ణ యుగం కోసం..’ అంటూ శ్రీమతి షర్మిల ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెస్, ‌టిడిపిలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైయస్,‌ శ్రీ జగన్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జనం ‘జై జగ‌న్’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. పొట్టి‌ శ్రీరాములు రోడ్, రథం సెంట‌ర్‌ మీదుగా కేపీ రోడ్‌లో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.30 గంటలకు చేరుకోవడంతో జిల్లాలో ఆమె ఆరవ రోజు పాదయాత్ర ముగిసింది.

విరబూసిన కల్మషం లేని నవ్వులు :
శ్రీమతి షర్మిల పాదయాత్రకు అడుగడుగునా మహిళలు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీశారు. పచ్చని పొలాలు, పంట కాలువల మధ్య సాగిన పాదయాత్రకు జనం నీరాజనం పట్టారు. పల్లెల జనం రాజన్న బిడ్డను చూసేందుకు పొలాల గట్ల వెంట పరుగులు తీస్తూ వచ్చారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు శ్రీమతి షర్మిలను చూసేందుకు తహతహలాడారు. ఆమె తమ వైపు తిరిగి చేతులు ఊపగానే పట్టలేని ఆనందంతో ఉప్పొంగిపోయారు. ‘జై జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పొలమూరు-‌ అర్తమూరుల మధ్య, ఆ తర్వాత మండపేట వరకు రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చని పంటపొలాల్లో యాత్ర సాగుతున్నప్పుడు శ్రీమతి షర్మిలను చూసిన కష్టజీవుల మోముల్లో కల్మషం లేని చిరునవ్వులు విరబూశాయి.

Back to Top