అసెంబ్లీకి ఆహ్వానం ఒట్టి మాటే

– వైయస్‌ఆర్‌సీపీకి అందని పిలుపు 
– అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ పాటించని టీడీపీ
– విమర్శలు రావడంతో కథ సిద్ధం చేసిన బాబు 

నిద్ర లేచింది మొదలు పడుకునే దాకా తన గురించి గొప్పగా ప్రచారం చేసుకునే చంద్రబాబు కనీస సాంప్రదాయాలు పాటించాలని కూడా మరిచిపోవడం సిగ్గుచేటు. పార్టీకి తెలుగుదేశం అనే పేరు.. ప్రచారంలోనేమో తెలుగు వారి ఆత్మగౌరవం.... ఆచరణలో మాత్రం ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటు. బాబు గొప్పలు గురించి చెప్పడానికైనా.. మాట తప్పడం గురించి చెప్పడానికైనా మనం సందర్భం కోసం.. ఉదాహరణ కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఆత్మస్తుతి తప్పకుండా ఉంటుంది.. స్వామీ వివేకానందుడిలాగ నీతి సూత్రాలు వల్లిస్తాడు. కానీ ఒక్కటి పాటించడు. 

ఆత్మగౌరవం ప్రచార ఆర్భాటమే 
ఏపీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందంటే తప్పు మీద తప్పుల చేస్తూ పోవడం.. ప్రతి చిన్నదానికీ అబద్దమాడేయడం.. అదేమని ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీదకు నెట్టేయడం. మూడేళ్ల బాబు పాలన పరిశీలిస్తే ఇంతకంటే గొప్పగా ఏమీ కనిపించదు. ప్రతిపక్ష నేతకు కనీస గౌరవం ఇవ్వాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చట్టాలు, విలువలు, నిజాయితీ, ప్రజా సమస్యలు, ప్రతిపక్ష నాయకుడి హక్కులంటూ డబ్బా కొట్టుకునే బాబుకు అధికారం వెలగబెట్టేటప్పుడు మాత్రం ఇవేమీ గుర్తురావడం లేదు. దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష నాయకుడు నిరసన తెలపడానికి వస్తే ఎయిర్‌ పోర్టు రన్‌వేపైనే అరెస్టు చేస్తాడు. ఉమెన్‌ పార్లమెంట్‌కు రావాలని రోజాను ఆహ్వానించి ఎయిర్‌పోర్టు నుంచి పంపేస్తారు. బస్సు ప్రమాదంలో 11 మంది మరణిస్తే 30 కిమీల దూరంలో ఉన్నా కనీసం పరామర్శకు రాడు. 300 కిమీల దూరం నుంచి ప్రతిపక్ష నాయకుడు వస్తే కేసులు పెట్టిస్తాడు. సమస్యను పక్కదారి పట్టించేందుకు ఎదుటి వారి మీద బురద చల్లడమే బాబు ధ్యేయంగా కనిపిస్తుంది. డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకపోతే ‘జైలు కెళ్తావ్‌.. ’ అన్న మాటను పట్టుకుని పదే పదే రాజకీయం చేశారు. 11 మంది చనిపోతే విచారణ జరిపించి నిందితులను శిక్షించాల్సింది పోయి బాధితులకు న్యాయం చేయాలని నినదించిన ప్రతిపక్ష నాయకుడిపై కేసులు బనాయించారు. జనవరి 26న విశాఖలో జరిగిన క్యాండిల్‌ ర్యాలీకి వెళ్లకుండా రన్‌వేపై అడ్డుకుంటే పోలీసులను నిలదీసిన ప్రతిపక్ష నాయకుడిని పదే పదే టీవీల్లో చూపించుకున్నారు తప్ప ఆంధ్రులకు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కానీ.. ప్రతిపక్ష నాయకుడికి జరిగిన అవమానం గురించి కానీ ఎవరూ నోరెత్తరూ. మరిదే ఆత్మగౌరవం అంటే. చంద్రబాబు దృష్టిలో పనిచేయడం అంటే మాటలు చెప్పడం.. మేనిఫెస్టోలో చూపించడమే తప్ప చేతలు శూన్యం.  

ఆహ్వానం ఇవ్వకుండానే ఇచ్చామంటూ పచ్చి అబద్ధాలు
నిన్నటికి నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అనే సంగతి కూడా మరిచి చాలా ఛీప్‌గా అబద్దమాడేశాడు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీ ప్రారంభోత్సవానికి కూడా పిలవకుండానే పిలిచామని అబద్ధాలు ప్రచారం చేసేశారు. బాబు దర్శకత్వంలో హడావుడిగా కథను సిద్ధం చేసేసి ప్రచారానికి భజన బృందాలను రంగంలోకి దించేశారు. అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షం ఎందుకు రాలేదని విమర్శలు రావడంతో చంద్రబాబు కథను సిద్ధం చేసేశాడు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాక, కథలో మార్పులు, చేర్పులు చేసేశాడు. ప్రతిపక్ష నేతకు అసెంబ్లీ కార్యదర్శి తరఫున సమాచారం అందించేందుకు ప్రయత్నించారట, జగన్‌ ఓఎస్‌డీ ఆ ఫోన్‌ కాల్‌ అందుకుని, జగన్‌కి తెలియజేస్తామన్నారట. వైయస్సార్సీపీకి చెందిన ముఖ్యనేత శ్రీకాంత్‌రెడ్డికీ సమాచారమిచ్చారట. కాంగ్రెస్‌ నేత సి.రామచంద్రయ్యకు సమాచారమివ్వబోతే, ఆయన ’బిజీ’గా ఉన్నట్లు ’రిప్లయ్‌’ వచ్చిందట. కొందరికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందించారట. అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాన్ని పిలవకుండానే పిలిచామని చెబుతూ చంద్రబాబు సర్కార్ గుక్కతిప్పకుండా అబద్ధాలు ఆడేసింది. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్యే కదా..!
Back to Top