బాబుగారి తోట‌లో అబ‌ద్ధాల సాగుబ‌డి

- భాగ‌స్వామ్య స‌ద‌స్సుల పేరుతో హ‌డావుడి
-  ఖ‌ర్చులే త‌ప్ప సాధించింది శూన్యం
- ఒక్క పెద్ద ప‌రిశ్ర‌మ కూడా రాష్ర్టానికి వచ్చింది లేదు
- ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని అణ‌చడానికే విశాఖ స‌ద‌స్సు

చొక్కాలు మార్చినంత సుల‌భంగా మాట‌లు మార్చ‌డం బాబుకు బాగా అలవాటైపోయింది.  విభ‌జ‌న హామీ మేర‌కు న్యాయంగా ఏపీకి ద‌క్కాల్సిన వ‌న‌రుల‌ను కాపాడ‌క‌పోగా.. పోల‌వరం ప్రాజెక్టు లాంటి కేంద్రం చేస్తాన‌న్న ప‌నినీ త‌న స్వార్థ రాజ‌కీయాల‌తో నాశ‌నం చేశాడు. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని అణ‌చివేసేందుకు భాగ‌స్వామ్య స‌ద‌స్సు పేరుతో పెద్ద డ్రామానే ఆడారు. దేశంలో వ్యాపార‌ నిర్వహణకు అత్యంత అనుకూలమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపామంటూ ఆమధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకున్న గొప్పలన్నీ ఒట్టి ప్రచార డాబేనని తేలిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లోనే ఈ విషయం స్పష్టం కావడం చర్చనీయాంశమైంది. ఢిల్లీలో గురువారం జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సదస్సులో ఒప్పందాలను అమలు చేసేలా చూడాలని ఆయన కోరడం పెట్టుబడుల రాక విషయంలో వాస్తవ పరిస్థితిని తేటతెల్లం చేసింది. దీంతో విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల ద్వారా, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోందంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలన్నీ ప్రజలను వంచించేవనే భావించక తప్పనిస్థితి ఏర్పడింది. 

ఒక్క ప‌రిశ్ర‌మ కూడా రాలేదు..
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారని, నిధుల వరద ప్రవహిస్తోందని సాగుతున్న భారీ ప్రచారానికి భిన్నంగా విశాఖ ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకురావాల్సిందిగా సిఐఐ ఛైర్మన్‌ చంద్రజిత్‌ బెనర్జీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొర పెట్టుకోవడం రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితికి దర్పణం పడుతోంది. విశాఖపట్నంలో 2016లోనూ, ఈ ఏడాది జనవరిలోనూ నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. విశాఖలో ఒకటీ అరా ఐటి కంపెనీలు, అనంతపురంలో కియా కార్ల తయారీ పరిశ్రమ మినహా ఈ మూడేళ్ల టీడీపీ ఏలుబడిలో రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పరిశ్రమలు భూత‌ద్దం వేసి వెతికినా కనపడవు. రాజధాని ప్రాంతం అమరావతిలోనూ ఒక్కటంటే ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాలేదు. 

ప్ర‌త్యేక ఉద్య‌మాన్ని అణ‌చ‌డానికే భాగ‌స్వామ్య స‌దస్సు
ప్రత్యేక హోదా డిమాండ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉద్యమ రూపు దాలుస్తున్న సమయంలో విశాఖ భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. భారీ పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులొచ్చేస్తాయని, లక్షలాది మందికి ఉద్యోగాలొచ్చేస్తున్నాయని ఊదరగొట్టడం వెనుక అసలు వంచన నాటి ఉద్యమాన్ని అణిచేయడమేనన్నది సుస్పష్టం. ఒకవైపు ఈ నయవంచక ప్రచారంతో ఏకంగా 10 లక్షల ఎకరాల భూములను ప్రజల నుంచి లాగేసుకుంటుండగా అందులో వివిధ పారిశ్రామికవాడల పేరుతో ఇప్పటికే 5 లక్షల ఎకరాల వరకూ భూమిని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ భూములను ఆయా కంపెనీలు బ్యాంకుల్లో తనఖా పెట్టి ప్రజల ధనాన్ని దోచుకుంటున్న పరిస్థితి. 


Back to Top