చాలు బాబూ నీ డాబు...

తెలంగాణా ఎన్నికల్లో బలాబలాలు తేలిపోయాయి. చంద్రబాబు లెగ్గు మహిమ ఎలాంటిదో కాంగ్రెస్ కు అనుభవపూర్వకంగా అర్థం అయ్యింది. కానీ వాస్తవాలు తెలిసేసరికే చాలా అనర్థం జరగిపోయింది. మహాకూటమికి తెలంగాణాలో తేరుకోలేని దెబ్బపడిపోయింది. కనీసం చంద్రబాబుతో పొత్తులేకున్నా పరిస్థితి బాగుండేదేమో అని కాంగ్రెస్ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 
దిల్లీ సమావేశంపై ప్రచారార్భాటం
సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు రోజు ఏర్పాటు చేసిన బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం గురించి తెలుగు మీడియాలో ప్రత్యేకించి బాబుగారి భజన మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం సాగింది. అసలీ సమావేశానికి చంద్రబాబే పెద్దన్న అని, అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి నడిపిస్తున్న నాయకుడు బాబే అని విపరీతమైన బిల్డప్ క్రియేట్ చేసింది. కానీ నిజాలు ఏమిటో ప్రజలకు మాత్రం తెలియవా? బీజేపీ లీడర్ జీవీఎల్ చెప్పినట్టు ఎప్పుడో షెడ్యూల్ లో ఉన్న ఈ సమావేశానికి కొత్తగా వస్తున్న అతిథి మాత్రమే చంద్రబాబు. అంతకు మించి ఈ సమావేశానికి చంద్రబాబు ఆర్భాటానికి సంబంధమే లేదు. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు మిగిలిన ప్రతి పక్షాలన్నీ కలవడం ఎప్పటి నుంచో రివాజుగా వస్తోంది తప్ప కొత్త విషయం కాదు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్షాలు తమ వైఖరిని ఎంచుకునే ప్రయత్నమే ఈ సాధారణ సమావేశం. గత నెల్లాళ్లుగా చంద్రబాబు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తున్న పచ్చ మీడియా కథనాల్లో ఆవగింజంత కూడా వాస్తవం లేదని తెలుస్తూనే ఉంది. చంద్రబాబు స్వచ్ఛందంగా ఈ కూటమిలో చేరి ప్రచార ఆర్భాటానికి పాకులాడటం, ఎపిలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేసే ప్రయత్నం తప్ప మరోటి కాదు. నిజానికి పార్లమెంటు సమావేశాలు ముందు పెట్టుకుని ఏ కూటమి లేదా ఏ ప్రతిపక్ష పార్టీ దీర్ఘకాలిక వ్యూహాలు అనుసరించవు.  
అబద్ధపు ప్రచారాలు
ఇక సమావేశానికి కొత్త పేరు ఖరారు చేసేందుకు చంద్రబాబు ఆలోచన అంటూ వచ్చిన వార్తలు అబద్ధాలని తేలిపోయింది. మమతా బెనర్జీ పెద్దక్కగా మారి అన్ని పక్షాల వారినీ ఆహ్వానించడం కనిపించింది. చంద్రబాబుకు కూడా బొకే ఇచ్చి ఆహ్వానించి సమావేశంలో బాబు పాత్రపై ఓ క్లారిటీని ఇచ్చింది. పదేళ్లకు ముందే ఏర్పడిన యుపిఎ కూటమికి కొత్తగా పేరు పెట్టవలసిన అవసరం అయితే లేదు. డి.ఎన్.కె, పి.ఎన్.కె. సమాజ్ వాద్ వంటి పార్టీలన్నీ యుపిఎలోకి తమ అవసరాలకు తగ్గట్టు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే పార్లమెంట్ లో అవిశ్వాసం సమయంలోనూ యుపీఏ పేరుతోనే తీర్మానాలు సాగినాయ్. ఇప్పుడీ కూటమిలోకి కొత్తగా వచ్చి చేరింది టీడీపీ. అంటే కేవలం చంద్రబాబు అడుగుపెట్టినంత మాత్రాన పదేళ్లుగా ఉనికిలో ఉన్న యుపిఎ పేరు మార్చుకుంటుందా? అస్తిత్వంలో ఉన్న పేరును కాదని కొత్త పేరుతో ఎన్నికల్లోకి వెళ్లేంత సమయం ఇప్పుడీ కూటమికి లేదు. ప్రజల్లోకి మరో కొత్త పేరుతో కూటమిని తీసుకెళ్లడం సాధారణ ఎన్నికలు అతికొద్ది నెలలే ఉన్న ఈ సమయంలో సాధ్యమయ్యే పని కాదు. బాబొచ్చాడని యుపిఏ కూటమి పేరు మార్చుకుంటుందా? కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా చంద్రబాబుకు ఎప్పుడూ కొత్త కొత్త పేర్లతో ప్రజల్లోకి రావడం అలవాటు. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అంటూ తిరిగిన బాబు ఇప్పుడు ప్రజా ఫ్రంట్ అంటూ తెలంగాణాలో చేసిన హడావిడి ఎందుకూ కొరగాకుండా పోయింది. 15 సీట్లు పంచుకుని, 14లో పోటీ చేసి చివరకు ముక్కీ మూలిగి ఒక్కసీటు గెలిపించుకోగలిగాడు చంద్రబాబు. చివరకు నందమూరి కుటుంబం సెంటిమెంట్ కూడా పనిచేయక హరికృష్ణ కూతురు సుహాసిని దారుణంగా ఓటమిపాలైంది. చంద్రబాబు రాజకీయ మనుగడ కోసం ఇటు నందమూరి కుటుంబాన్నీ, అటు జాతీయ పార్టీలను కూడా ముంచుతున్నతీరు విస్మయపరచకమానదు.
ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో వందలాది మండలాలు కరువుతో అల్లాడుతున్నాయి. శీతాకాలం తొలిరోజుల్లోనే నీటి ఎద్దడి కనిపిస్తోంది. తెలంగాణా ఎన్నికల మోజులో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు సొంత రాష్ట్రంలోని కరువు పరిస్థితుల గురించి ఆలోచించే తీరిక లేకుండా ఉన్నారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికందని పొరుగునున్న తెలుగు రాష్ట్రంలో ముచ్చటగా మూడు సీట్లు కూడా తెచ్చుకోలేని చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేయడం, యుపిఎ కూటమిలో కీలక పాత్ర పోషించేయడం లాంటి ప్రచారం చేసుకుంటే చూసేవాళ్లు నవ్వుతున్నారు. తాటాకుకు ఎక్కువ తమలపాకుకు తక్కువ అన్నట్టున్న బాబు పరిస్థితి గురించి నేటి తెలంగాణా ఎన్నికల ఫలితాలు చక్కని వివరణ ఇచ్చాయి. 



 
Back to Top