అమరావతి అసాధ్యమేనా..?

– ఎన్నికల నాటికి రాజధాని నిర్మాణం పూర్తవడం కలే
– పెట్టుబడులు రాక చంద్రబాబు అతలాకుతలం
– కేంద్రం ఇచ్చిన నిధులు పుష్కరాలు, ఆడంబరాలకు ఖర్చు
– 4.5 లక్షల పెట్టుబడులు బోగస్‌ అని తేల్చిన ఆర్టీఐ 
– ఒక్కొక్కటిగా చంద్రబాబు మోసాలు బట్టబయలు

అమరావతిపై చంద్రబాబు ఆశలు వదిలేసుకున్నాడు. ఇక ప్రకటించడమే తరువాయి. మంచి సందర్భం చూసి అమరావతి కంటే మరో అద్భుతం చేయబోతున్నానని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అమరావతి ఆశల పందిట్లో జనాలను నిద్ర బుచ్చిన చంద్రబాబు... ప్రజలు ఒక్కొక్కరిగా నిద్ర లేస్తుంటే సమాధానాలు చెప్పుకోలేక గింగరాలు తిరిగిపోతున్నాడు. చైనా, జపాన్, సింగపూర్, అమెరికా, దుబాయ్‌లు తిరిగొచ్చి 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చిన బాబు మాటలు ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతో ఉత్తదే అని తేలిపోయింది. రాష్ట్రానికి కోటి రూపాయలు పెట్టుబడులు కూడా రాలేదని తేల్చిచెప్పారు. కేంద్రాన్ని నిధులు ఇవ్వమని అడిగితే ముందు తీసుకున్న వాటికి లెక్క చెప్పమని కాగ్‌ ప్రశ్నిస్తుంది. రాజధాని పేరుతో జనం నుంచి లాక్కున్న భూములు తాకట్టు పెట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామని చూసినా కుదరలేదు. ఎవరూ ముందుకు రావడం లేదు. 

విదేశీ కంపెనీలూ రావడం మానేశాయి
మనం అమరావతి రాజధాని నిర్మాణం ఎలా చేపట్టాలి? చేతిలో చిల్లిగవ్వలేదు.. కేంద్రం సహకరించడం లేదు.. విదేశీ పెట్టుబడులు రావడం లేదు.. ఇప్పుడెలా? ఇప్పటి వరకూ మీడియా ద్వారా చేసే అనేక ప్రకటనలను చూసి స్వదేశీ, విదేశీ కంపెనీలు కనీసం వచ్చి చూసి వెళ్లడం అయినా చేసేవి.. కానీ ఇప్పుడా పరిస్థితి కూడా లేదు. పెద్ద నోట్ల రద్దు.. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా రాజధాని నిర్మాణం అనేది కనుచూపు మేరలో కన్పించడం లేదు.. ఇవే అంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నీటిరాతలేననే నమ్మకానికి ప్రజలు వచ్చేశారు.  అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలు అంటూ దేశవిదేశాల్లో ప్రచారం చేసుకొన్న ముఖ్యమంత్రికి నోట్ల రద్దు తీవ్ర ఆవేదన మిగిల్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం కూడా ఎలాంటి సహాయ సహకారాలూ అందించే స్థితిలో లేదు. రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి కూడా ఆర్థిక అంశాలు సహకరించడం లేదు. మరి ఎలా అధిగమించాలి?

సాధ్యం కాదని బాబుకు తెలిసిపోయింది
అమరావతి రాజధాని నిర్మాణం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదని ముఖ్యమంత్రికీ తెలుసు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం కేంద్రం కొంత సమకూర్చింది. అయితే దానిలో చాలా భాగం బాబు తన పబ్లిసిటీకి, గోదావరి పుష్కరాలకు ఇష్టారీతిన ఖర్చు చేశారు. ఆ డబ్బులతో పునాది రాళ్లు కూడా లేపలేకపోయారు. పైగా ఇపుడు పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. అయితే అంతకు ముందు నుంచే శాశ్వత రాజధాని సాధ్యం కాదని గుర్తించిన ముఖ్యమంత్రి వెలగపూడి కేంద్రంగా తాత్కాలిక రాజధానిని నిర్మించారు. పాలనా పరమైన అంశాలను అక్కడ నుంచే ఆరంభించారు. 2019 ఎన్నికల సమయానికి శాశ్వత రాజధాని నిర్మాణాన్ని ఆరంభించి, దీన్ని పూర్తి చేయాలంటే తనను గెలిపించాలని ప్రజలకు మరోసారి నమ్మించాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన అన్ని మాటల్లాగానే ఇపుడు అమరావతి రాజధాని నిర్మాణం మాట కూడా తప్పబోతున్నారు. దానికి ఆయనకు దేశంలోని నెలకొన్న ఆర్థిక సంక్షోభం కలిసి వచ్చింది. శాశ్వత రాజధాని అనేది సాధ్యం కాదనేది చంద్రబాబుకు ముందే తెలుసు. అందుకే వెలగపూడిలో తాత్కాలిక రాజధాని పేరుతో హడావిడి చేశారు. రాష్ట్ర ప్రజలు ఇక దానితోనే సరిపెట్టుకోవాలని అధికారపార్టీ నేతలు సైతం పేర్కొంటున్నారు.

కేంద్రాన్ని బాధ్యులను చేస్తే పోలా 
అమరావతిని ఎందుకు నిర్మాణం చేయలేదంటే కేంద్రం నిధులు ఇవ్వలేదు అని చెప్పడానికి కూడా చంద్రబాబు దాదాపు సిద్ధమైపోయాడు. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తానన్నారు. కానీ వాటిని అమలు చేయడం లేదు. లోటు బడ్జెట్‌ ఇస్తానన్నారు. కానీ ఇవ్వలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్నారు. నిధులు ఇవ్వలేదు. అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. కానీ ఇంతవరకూ ఇవ్వలేదు. ఇంకా ఎలా అమరావతిని నిర్మాణం చేయాలి? కేంద్రం ఇంత కఠినంగా వ్యవహరిస్తుందని అనుకోలేదు. అనుకొని ఉంటే బీజేపీతో జతకట్టేవాళ్లం కాదు..అని 2019 ఎన్నికల నాటికి కొత్త పల్లవి అందుకోవడానికి చంద్రబాబు స్క్రిప్టు సిద్దం చేసుకున్నారు. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం కూడా టీడీపీ పోరాడిందని.. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరమని కూడా చెప్పినా చెప్పేంత ఘనుడే. ఈసారి టీడీపీని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించిపెట్టే బాధ్యత మాదేనని కూడా చెప్పేందుకు ఆయన వెనకాడరని అందరికీ తెలుసు. 
Back to Top