పడకేసిన ‘రెండు పడకల గదులు’

-ప్రచార ఆర్భాటమే తప్ప కనిపించని పురోగతి
-బాబు మోసపూరిత పాలన 
– ఆర్భాటంగా మొదలైన ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం
– అంబేడ్కర్‌ జయంతి రోజున మొదలెట్టి పక్కనెట్టారు
– వెక్కిరిస్తున్న శిలాఫలకాలు

చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు కొంచెం కూడా సంబంధం ఉండటం లేదు. మాటల్లోనేమో గాంధీ మహాత్ముడు చదివిన స్కూల్‌కి తాను ప్రిన్సిపాల్‌లాగా.. వివేకానందుడికి పెద్దన్నలాగా.. సాంఘిక అసమానతలను రూపుమాపిన గురజాడ అప్పారావు గురువులాగా.. రాజ్యాంగ నిర్మాత అండబ్కేర్‌కి ప్రియ శిష్యుడిలా ఉంటాయి. అయితే చేతల్లో మాత్రం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. బాబు ఎంతో ఆర్భాటంగా చెప్పుకుని ఎన్నికల్లో ప్రచారం చేసిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి పథకాల గతి ఏమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ పక్కా ఇళ్ల నిర్మాణం. పేదలందరికీ సొంతింటి కల నిజం చేస్తానని బీరాలు పలికిన బాబు  ఆ దిశగా అడుగులు వేసిన పాపాన పోలేదు. అంబేడ్కర్‌ను అడ్డం పెట్టుకుని ఆ మహానుభావుడి జయంతి రోజున ఇచ్చిన హామీని కూడా కనీసం నెరవేర్చకపోవడం చూస్తుంటే బాబుకు తన మాట మీద తనకే నమ్మకం ఉన్నట్టు కనిపించడం లేదని తెలుస్తుంది. 

‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించాలనే ఎన్టీఆర్‌ కల సాకారం చేసేందుకు రాష్ట్రంలో రూ.16 వేల కోట్లతో 6 లక్షల రెండు పడకల ఇళ్లు నిర్మిస్తాం.’ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తూ 2016 ఏప్రిల్‌ 14న సీఎం చంద్రబాబు అన్న మాటలివి.

ఎన్టీఆర్‌ గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాల కింద కొత్తగా 4 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, మరో 2 లక్షల పాత ఇళ్లకు మరమ్మతులు చేపడతామని  చంద్రబాబు ఆ రోజు ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగపూర్, మలేíసియా, చైనా తదితర దేశాల్లో అమలవుతున్న టెక్నాలజీని ఉపయోగించి రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి, పేదల కలలను సాకారం చేస్తామన్నారు. ఇక చూడు నా సామిరంగా తెలుగు తమ్ముళ్లు ఇక ఆగుతారా.. బాబు అలా అన్నాడో లేదో పలు జిల్లాల్లో పాత ఇళ్లను తొలగించి వాటి స్థానంలో ప్రజా ప్రతినిధులు కొత్త ఇళ్ల కోసం శంకుస్థాపనలు చేశారు. దాదాపు అమరావతి నిర్మాణానికి చేసినంత హడావుడి చేశారు. మొదలెట్టు.. పక్కనెట్టు అని చంద్రబాబు ఫార్ములా ఎలాగూ ఉండనే ఉందిగా. అంతే దానిని అప్లై చేసి పడేశారు. అమరావతిని ఎలాగైతే ముంచేశారో ఇప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆ విధంగా పక్కన పెట్టేశాడు. అయితే ఇక్కడ మాత్రం బాబు బారి నుంచి తృటిలో బయట పడ్డామనే చెప్పాలి. ఎందుకనేగా మీ అనుమానం. అయితే ఒక్కసారి వెనక్కి వెళితే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేశారో గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ ఇళ్ల నిర్మాణ పథకానికి మాత్రం బాబు ప్రజలను దయతలిచి ఒకే ఒక్క శంకుస్థాపనతో ఆపేశారు. గతంలో వైయస్‌ఆర్‌ సీఎంగా ఉన్న సమయంలోనే ఐదేళ్ల కాలంలో 43 లక్షల ఇళ్లు నిర్మిస్తే చంద్రబాబు మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఇళ్లు శంకుస్థాపన చేసే పనిలోనే ఉన్నారు. 

వెక్కిరిస్తున్న శిలాఫలకాలు
జక్కంపూడితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాలకులు వేసిన శిలాఫలకాలు ఇప్పటికీ దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. శంకుస్థాపనల మహోత్సవం పేరిట ఉన్న ఇళ్లను కూలగొట్టి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో కొందరు పశువుల పాకల్లో, మరికొందరు గుడిసెల్లో కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఇల్లు మంజూరు కాక, గతంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు అందక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదు. కనీసం లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేయలేదు. ఇందిరమ్మ పథకం కింద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 44.80 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 25.63 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు నిలిపివేయడంతో 19.16 లక్షల ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల కాలనీలు మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి.

ఆ రూ.350 కోట్లు ఏమైనట్లు..? 
అందరికీ ఇల్లు పథకం (హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌) కింద 2015–16లో కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 37 నగర, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 1,93,647 ఇళ్లు కేటాయించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు కేవలం 35,510 మందికి అధికారికంగా ఇళ్లు మంజూరు చేశారే తప్ప నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదు. వీటిని రాష్ట్రంలో ఎన్టీఆర్‌ పట్టణ గృహæ నిర్మాణం పేరిట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం మొదటి విడతగా కేంద్రం ఇప్పటికే రూ.350 కోట్లు విడుదల చేసింది. అయితే ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. ఈ నిధులు ఏమయ్యాయో సవివరంగా నివేదిక పంపితే మరిన్ని నిధులు విడుదల చేస్తామని కేంద్రం లేఖ రాసి నాలుగు నెలలు దాటినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.

లబ్ధిదారుల ఎంపికలోనూ జాప్యం
ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులు మంజూరు చేసినా లబ్ధిదారులను ఎంపిక చేయలేని దుస్థితిలో ఉండటం మా ఖర్మ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించడం వల్ల క్షేత్ర స్థాయిలో గందరగోళం నెలకొందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణాలను ప్రీకాస్ట్, ప్రీఫ్యాబ్, పటిష్టమైన షియర్‌వాల్, స్టీల్‌ స్ట్రక్చర్, ఈపీఎస్‌ ప్యానెల్స్, కాంపోజిట్‌ స్ట్రక్చర్, చైనా స్టీల్‌ కన్‌స్ట్రక్షన్‌ తదితరాల్లో ఏ నిర్మాణం ఉపయోగించాలో నిర్ణయించి చెబుతానని ముఖ్యమంత్రి చెప్పి నాలుగు నెలలైనా ఇప్పటికీ తేల్చలేదు.

మొన్న ఇళ్లు.. ఇప్పుడు అపార్ట్‌మెంట్లు..
ముందు చెప్పిన ఇళ్లకే దిక్కులేకపోతే కొత్తగా గ్రామాల్లో అపార్ట్‌మెంట్‌లు కట్టిస్తానని చంద్రబాబు బాకా ఊదేస్తున్నాడు. నూతనంగా ఐదు లక్షల ఇళ్లను నిర్మించనున్నామని.. ఇంటి స్థలం ఉన్న వారికి ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌ ద్వారా ఇళ్లను కేటాయిస్తామనీ, లేని వారికి 1+1 లేదా 1+3 అపార్టుమెంట్లు నిర్మిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో జరిగిన ‘జన్మభూమి–మా ఊరు’ సభలో ఆయన ఈ కొత్త ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో త్వరలో ఫైబర్‌ కనెక్షన్‌ అందుబాటులోకి రానుందని, ఇక ప్రతి ఇల్లూ ఓ విజ్ఞాన గనిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.ఐదు వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును రూ.330 కోట్లతోనే పూర్తి చేశామన్నారు. అక్కడితో ఆగితేనా ప్రతి ఇంటికీ స్మార్ట్‌ ఫోన్‌ అందజేస్తామని, లబ్ధిదారుడు వెయ్యి చెల్లిస్తే, ప్రభుత్వం వెయ్యి ఇస్తుందన్నారు. ఒక వ్యక్తి పుట్టినప్పుటి నుంచి చనిపోయే వరకూ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. మభ్యపెట్టే మాటలు, మోసపూరిత వ్యాఖ్యలతో ప్రజలను నిలువునా దగా చేస్తున్న చంద్రబాబుపై  రాష్ట్రప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. 

తాజా ఫోటోలు

Back to Top