150 రోజులు.. 2000 కి.మీ

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల 150 రోజులలో  2,000 కిలోమీటర్లు నడిచి చరిత్ర సృష్టించారు. ఈ మహోజ్వల ఘట్టానికి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని రావికంపాడు గ్రామం వేదికైంది. ఇందుకు జ్ఞాపకంగా ఏర్పాటుచేసిన మహానేత విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, అభిమానులు వెల్లువలా తరలివచ్చారు.

ప్రజలతో మమేకమవుతూ.. వారి గోడు వింటూ.. కాంగ్రెస్ సర్కారు, దానితో అంటకాగుతూ టీడీపీ సాగిస్తున్న కుట్రపూరిత రాజకీయాలను ఎండగడుతూ.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇస్తూ.. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రికార్డులకెక్కింది. చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమర శంఖం పూరిస్తూ ఓ మహిళ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం ప్రపంచంలోనే అరుదైన ఘట్టంగా నమోదైంది. 9 జిల్లాల్లో రెండుకోట్ల మందికి పైగా ప్రజలను పలకరించి.. ఆరు రోజుల క్రితం చింతలపూడి మండలం గురుభట్లగూడెం వద్ద ‘పశ్చిమ’లో ప్రవేశించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం రాత్రి 150 రోజులు పూర్తి చేసుకుంది. కామవరపుకోట మండలం రావికంపాడులో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించి చరిత్రకెక్కింది. మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ‘పశ్చిమ’తోపాటు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, మహానేత డాక్టర్ వైయస్ఆర్, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి అభిమానులు వెల్లువలా తరలివచ్చారు.

‘నేను.. మీ రాజన్న కూతుర్ని.. మీ జగనన్న చెల్లెల్ని.. జగనన్న నాయకత్వంలో.. ఇడుపులపాయలో నాన్నగారి సాక్షిగా మొదలుపెట్టిన పాదయాత్ర ఇప్పుడు.. ఇలా.. ఇక్కడ.. 2వేల కిలోమీటర్లు పూర్తయ్యింది. ఇది వినోద యాత్ర కాదు..

నిరసన యాత్ర. అన్నివర్గాల ప్రజలను వంచిస్తున్న కిరణ్ సర్కారు దుర్మార్గమైన పాలనను.. ప్రజలపక్షాన నిలబడాల్సిన చంద్రబాబు నాయుడు సర్కారుతో కుమ్మక్కవడాన్ని నిరసిస్తూ చేపట్టిన యాత్ర. ఓటు అనే ఆయుధంతో ఈ కుట్రలను.. ఈ కుతంత్రాలను.. ఈ నరకాసురులను వధించిన రోజునే మనకు నిజమైన పండుగ. అంతవరకు యుద్ధమే.. అంతవరకు పోరాటమే...’ అంటూ రావికంపాడు బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. అన్నివర్గాల ప్రజలను అవస్థలకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కారు, దానికి సహకరిస్తున్న తెలుగుదేశం పార్టీ విధానాలపై నిప్పుల వర్షం కురిపించారు. ‘ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు.. జగనన్నని ఎవరూ ఆపలేరు. అన్న బయటకు వస్తారు. రాజన్న రాజ్యం తెస్తారు.. మీ మధ్యకు వచ్చిన నాపై ఆకాశమంత అభిమానాన్ని.. భూగోళమంత ఆత్మీయతను కురిపిస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను’ అంటూ శ్రీమతి షర్మిల ప్రసంగాన్ని ముగించారు.

పది జిల్లాలు.. 150 రోజులు..
రెండువేల కిలోమీటర్లు... ఎన్నో కష్టాలు.. మరెన్నో ఆటంకాలు.. అన్నింటినీ చిరునవ్వుతో భరిస్తూ పేదలకు బతుకుపై భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న మహానేత రాజన్న బిడ్డను ఆశీర్వదించేందుకు వచ్చిన అశేష జనవాహినితో రావికంపాడు జనగోదావరిగా మారింది. కుట్రలు.. కుమ్మక్కు రాజకీయాలకు వెరవక తమ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చిన జగనన్న చెల్లెలికి హారతిచ్చి అభినందనలు తెలిపారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నడుచుకుంటూ వచ్చిన శ్రీమతి షర్మిలకు అడుగడుగునా పూలతో ఆత్మీయ స్వాగతం పలికి మహానేత కుటుంబంపై తమకున్న మమకారాన్ని చాటారు.

Back to Top