హైదరాబాద్, 13 డిసెంబర్ 2012: వాల్‌మార్టు లాబీయింగ్ వ్యవహారంపై కేంద్ర చేయించే న్యాయ విచారణలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని, ఆ పార్టీ ఎంపీలను కూడా చేర్చాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దేశంలోని చిల్లర వ్యాపార రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు లాబీయింగ్ కోసం వాల్‌మార్టు సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నది. లాబీయింగ్‌లో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడికి వాల్‌మార్టు సంస్థ నుంచి ఎంత వాటా వచ్చిందో వెల్లడి కావాలన్నారు. చంద్రబాబు పేరు కూడా విచారణ జాబితాలో చేర్చాలని వైయస్‌ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి. జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. నేరం రుజువైతే కఠినంగా శిక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనక్‌ప్రసాద్ మాట్లాడారు.
రిటైల్ రంగ దిగ్గజం వాల్‌మార్టు భారతదేశంలోకి ప్రవేశించడానికి లాబీయింగ్ చేసి కోట్ల రూపాయలు లంచాలిచ్చిందన్న వార్తలపై రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ బుధవారం లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. భారత మార్కెట్‌లోకి ప్రవేశించడం సహా పలు లాబీయింగ్ కార్యక్రమాలకు గడిచిన నాలుగేళ్లలో రెండున్నర కోట్ల డాలర్లను వాల్‌మార్టు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీయే అమెరికా సెనేట్‌కు తెలిపింది.
దేశంలోని లక్షలాది చిల్లర వ్యాపారుల కుటుంబాలను దెబ్బతీసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని చంద్రబాబు స్వాగతించడం వెనుక పెద్ద కథే నడిచిందని జనక్ ప్రసాద్ అన్నారు. నిజానికి లాబీయింగ్ చేయడంలో చంద్రబాబు సిద్ధమస్తుడన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కడప, పులివెందుల ఎన్నికల్లో, ఇటీవలి ఉప ఎన్నికల్లో కూడా ఆయన లాబీయింగ్ ద్వారా టిడిపి ఓట్లను హోల్‌గా అమ్మేశారని ఆరోపించారు. ఎఫ్‌డిఐ బిల్లుపై ఓటింగ్ సమయంలో రాజ్యసభలో యుపిఎ ప్రభుత్వానికి మెజారిటీ లేకపోయినా గెలవడానికి చంద్రబాబు పరోక్షంగా దానికి సహాయపడ్డారని నిప్పులు చెరిగారు. ఉన్న ఐదుగురు ఎంపీల్లో ముగ్గురిని చంద్రబాబు యుపిఎకు అమ్మేశారని దుయ్యబట్టారు. ఈ విధంగా చంద్రబాబునాయుడు ప్రజాద్రోహానికి పాల్పడ్డారని జనక్‌ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి తాను సిఇఓనని చెప్పుకున్న చంద్రబాబు మన సంక్షేమ ప్రభుత్వాన్ని కార్పొరేట్ సంస్థగా మార్చివేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్సు నుంచి హెరిటేజ్ ఫ్రెష్‌ను విడగొట్టి, అనుబంధ సంస్థగా మార్చి దానిలోకి ఎఫ్‌డిఐలు తీసుకువస్తామని ఆ సంస్థ ఎండి సాంబశివరావు చెప్పిన మాటలను ఈ సందర్భంగా జనక్‌ప్రసాద్ ప్రస్తావించారు. అంటే రాష్ట్రంలోకి ఎఫ్‌డిఐలను దొడ్డిదారిలో అనుమతించేందుకు హెరిటేజ్ ఫ్రెష్ ద్వారా చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు చిల్లర వర్తకుల పొట్టగొట్టే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని నిలదీశారు. చంద్రబాబు స్వార్థం కోసం ప్రజలను పణంగా పెట్టారని దుయ్యబట్టారు. ఈ దేశం, రాష్ట్ర ప్రజల కన్నా చంద్రబాబుకు స్వార్థమే ముఖ్యమా అని జనక్‌ప్రసాద్ నిలదీశారు. రెండెకరాల చంద్రబాబుకు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు.
ఎఫ్‌డిఐలను అనుమతించడం, అనుమతించకపోవడం ఆయా రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం చెబుతున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంటుందన్నారు. ఎఫ్‌డిఐలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోయినా వాల్‌మార్టు సంస్థకు వచ్చే నష్టమేమీ ఉండబోదన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడి హెరిటేజ్ ఫ్రెష్‌లో అది పెట్టుబడి పెట్టే అవకాశం ఉందన్నారు. అలా రాష్ట్రంలోని వేలాది మంది చిల్లర వర్తకులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. వాల్‌మార్టు కారణంగా దేశంలోని 4 లక్షల కుటుంబాలు నష్టపోతాయని జనక్‌ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.