వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే టాస్కుఫోర్సు

హైదరాబాద్, 29 అక్టోబర్ 2013:

ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికే టాస్కుఫోర్సు బృందాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యురాలు, అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టాస్కుఫోర్సు బృందాన్ని పంపడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తన పైశాచిక ఆనందాన్ని స్పష్టంగా బయటపెట్టుకుందని వ్యాఖ్యానించారు. ఆంటోనీ కమిటి, మంత్రుల బృందం, టాస్కుఫోర్సు అనే కత్తులతో మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా విభజన ప్రక్రియను వేగవంతం చేయడానికి టాస్కుఫోర్సు బృందాన్ని పంపించడం చాలా దారుణం అని విమర్శించారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రం అల్లకల్లోలమై రైతులంతా ఇబ్బందుల్లో ఉంటే నష్టాలను అంచనా వేసే పరిహారం ఎలా చెల్లించాలనే దానిపైన బృందాన్ని పంపకుండా టాస్కుఫోర్సును పంపించటం కేంద్ర ప్రభుత్వం తీరుకు నిదర్శమని ఆమె అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారంనాడు రోజా మీడియాతో మాట్లాడారు.

తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని‌ రోజా డిమాండ్ చేశారు.‌ రైతులపై కేసులు పెట్టి, అవమానించి, వారు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన చంద్రబాబు ఇప్పుడు రుణాలు మాఫీ చేస్తాననడం హాస్యాస్పదం అన్నారు. రైతులకు రుణాలు కాదు కదా కనీసం వడ్డీ అయినా మాఫీ చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. తన చెంబు గ్యాంగ్‌తో చానళ్ళలో చర్చలు పెట్టించి ఎంతసేపూ శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయిస్తున్నారని, తన గురించి ప్రజలు ఆలోచించకుండా చూసుకుంటున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ళుగా ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు అసహ్యంచుకుంటున్నారు? తాను చేసిన తప్పేంటి, భవిష్యత్తులో ఏమి చేయాలనే దిశగా చర్చించి ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచించడం లేదన్నారు.

మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ సర్వనాశనం చేస్తోందని ప్రతి ఒక్కరికీ తెలుసని రోజా అన్నారు. రాష్ట్ర విభజన జరగడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణం అన్నారు. తన మీద ఉన్న కేసుల నుంచి బయట పడేందుకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నది నిజమా? కాదా? అనేది అందరికీ తెలుసన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాకుండా దాన్ని ఇప్పటికీ వెనక్కి తీసుకోకుండా సీమాంధ్రులను సర్వనాశనం చేస్తున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రం, తెలుగు ప్రజలు కలిసి ఉండాలని, భవిష్యత్తులోనూ మన రాష్ట్రం ఎప్పలాగే ఉన్నతంగా, గౌరవంగా ఉండాలని, మన్ననలు పొందాలని కోరుకుంటున్నది, సమైక్య రాష్ట్రంగా ఉంచడం కోసం పోరాడుతున్నది ఒకే ఒక్క శ్రీ జగన్‌ అనేది అందరికీ తెలుసన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా కాంగ్రెస్ ‌నాయకులు కల్లు తాగిన కోతుల్లా మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణమైన వారిని దీపావళి రోజున నరకాసురుడిని వధించిన మాదిరిగా చేయాలని అన్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న సోనియాను శ్రీ జగన్‌ విమర్శిస్తుంటే.. కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి నాయకులంతా ఆయనపై ఒకే విధంగా విరుచుకుపడుతున్న తీరును ఆమె తప్పుపట్టారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు రూ.200 కోట్లతో శ్రీ జగన్‌ సమైక్య శంఖారావం సభను నిర్వహించారనడం ఉందన్నారు. డబ్బులు వెదజల్లి సభలు నిర్వహించే సాంప్రదాయం టిడిపిదే అన్నారు. రెండుసార్లు అధికారం కోల్పోయి మతి తప్పి మాట్లాడుతున్నది చంద్రబాబు కాదా టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గుర్తుతెచ్చుకోవాలన్నారు.

సీనియర్‌ నాయకుడైన జేసీ దివాకరరెడ్డి మాటల తీరు చాలా హాస్యాస్పదంగా ఉందని రోజా వ్యాఖ్యానించారు. తన కుమారుడికి ఎమ్మెల్యే, తమ్ముడికి ఎంపీ టిక్కెట్‌ అడిగితే ఇవ్వనని అన్నందుకే జేసీ కక్షతో శ్రీ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని రోజా తెలిపారు. 'స్టార్‌ బ్యాట్సుమన్‌' అంటూ లగడపాటి చెప్పిన మాటలను ఆమె ఎద్దేవా చేశారు. ప్రత్యర్థిపై ఆ స్టార్ బ్యా‌ట్పుమన్‌ బ్యాటింగ్‌ చేస్తే ఆట అవుతుంది కాని స్వపక్షంలోనే ఆడితే అది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అవుతుందని విమర్శించారు.

సమైక్యవాదిననే ముద్ర వేసుకోవడానికి‌ సీఎం కిరణ్ కుమార్‌ రెడ్డి రకరకాల డ్రామాలాడుతున్నారని రోజా ఆరోపించారు. సోనియాను ఒక్క మాట అన్నా కాంగ్రెస్‌లో ఉండరన్న విషయం జగమెరిగిన సత్యం అన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అర్హత అసలు కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉందా? అని రోజా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధిష్టానానికి విధేయుడిగా ఉంటే.. వాళ్ళు చెప్పిన ప్రతిదానికీ తల ఊపితే సీఎం కావడం సులువు అని తాను ముఖ్యమంత్రి అయిన తరువాత కిరణ్‌రెడ్డి ప్రతి మీటింగ్‌లోనూ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అలాంటి కిరణ్‌రెడ్డి సోనియాను ఎదిరించారంటే నమ్మే పరిస్థితి ఉందా? అన్నారు.

నాలుగేళ్ళ మూడు నెలల కాంగ్రెస్‌ పాలనలో వ్యవహరించిన ప్రజావ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ ఆ పార్టీని సహించబోరన్న భయంతో ఓట్లు, సీట్ల కోసం విభజించి ఇప్పుడు ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణలో ప్రయోజనం పొందుతూనే సీమాంధ్రలో కూడా లబ్ధి పొందాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌ అధిష్టానం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని సమైక్య వాదిగా ముద్ర వేసి పంపిస్తోందన్నారు.

పీసీ చాకో ఒకలా, దిగ్విజయ్‌ మరోలా మాట్లాడి నాటకాలాడుతూ మిగతా వాళ్ళు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారంటూ మాట్లాడడం ఎంతవరకూ సమంజసం అన్నారు. కేసీఆర్‌ను విమర్శించలేదంటే ఆయనతో శ్రీ జగన్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారంటూ ఆరోపిస్తున్నారని, అలాగైతే ఆయనను సోనియాగాంధీ జైలులో పెట్టించారు కాబట్టి ఆమెతో విమర్శించేవారు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని సోనియా భ్రష్టుపట్టించారని, ఇటలీ వెళ్ళగలరా? అని శ్రీ జగన్‌ సమైక్య శంఖారావం సభలో సూటిగా ప్రశ్నించినా‌ ఆమెతో మ్యాచ్‌ ఫిక్సింగ్ అనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. లేనిపోని అబద్ధాలు మాట్లాడి జనం గుండెల్లో పదిలమైన స్థానం పొందిన శ్రీ జగన్‌ను వారి నుంచి దూరం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని రోజా అన్నారు. ప్రజలకు మంచి జరిగే ఒక్క కార్యక్రమం అయినా కాంగ్రెస్‌ పార్టీ చేస్తోందా? అని ఆమె నిలదీశారు.

రాష్ట్రాన్ని విభజిస్తే.. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో శ్రీ కృష్ణ కమిటి నివేదికలో స్పష్టంగా పేర్కొన్న విషయం కాంగ్రెస్‌ నాయకులకు తెలియదా? అని రోజా ప్రశ్నించారు. చిదంబరం ప్రకటన తరువాత రాష్ట్రం ఎంత అల్లకల్లోలం అయిందో చూడలేదా? అన్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని అత్యధికులు కోరుతున్నా, ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చే వరకూ వేచి ఉండకుండా, మంత్రుల కమిటీ వేసి, వాళ్ళ ఇష్టానికి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని, భారీ వర్షాలు, వరదల వల్ల మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు నష్టపోయి, ప్రాణాలు పోయి ఆవేదన చెందుతుంటే టాస్కుఫోర్సు కమిటిని పంపించడం అవసరమా? అని రోజా ప్రశ్నించారు. 57వ రాష్ట్ర అవతరణ ఇంకా రెండు మూడు రోజులు ఉందనగా మన సెంటిమెంటును గౌరవించకుండా, ఈ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న నరకాసురులందర్నీ అణచివేయాలని అన్నారు. టిడిపి ప్యాంటు, కాంగ్రెస్‌ చొక్కా వేసి రాష్ట్ర విభజనకు దోహదపడుతున్న ప్రతి ఒక్కరి దిష్టిబొమ్మలు తగులబెట్టాలని పిలుపునిచ్చారు. మన ఓట్లతో అధికారంలోకి వచ్చి, మన జీవితాలు, ప్రాణాలను సంకట స్థితిలోకి నెడుతున్న అందరినీ శిక్షించాలన్నారు.

విభజన విషయంలో మొండిగా ముందుకు వెళ్ళడం సరికాదని కేంద్రానికి రోజా విజ్ఞప్తిచేశారు. కొందరు కాంగ్రెస్‌ వాళ్ళో, టిడిపి వాళ్ళో ఇచ్చే ఫ్యాక్సులతోనో, ప్రకటనలతోనో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బేరీజు వేయాలని, అందరితో చర్చించాలని, విభజనను ఆపాలన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల మూడు ప్రాంతాల్లోని రైతులకు నష్టం జరిగిపోయిందని, దాన్ని సరిచేయాలని కేంద్రానికి రోజా సూచించారు. రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తిచేశారు. ఇరు ప్రాంతాల ప్రజలు సఖ్యతగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆ స్థానం నుంచి దిగజార్చకుండా చూడాలని రోజా డిమాండ్‌ చేశారు.

వర్షాలు, వరదల కన్నా రాష్ట్ర విభజన జరిగితే తీరని నష్టం జరుగుతుందని సమైక్య శంఖారావానికి ప్రతి తల్లి చెల్లీ తమ వారిని పంపించారని ఒక ప్రశ్నకు రోజా సమాధానం చెప్పారు. బొత్స ఇంటిలో పెళ్ళికి ఆర్టీసీ బస్సులు ఉచితంగా వినియోగించుకున్నారని, శ్రీ జగన్‌ సభకు కార్యకర్తలు తమ సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని స్వచ్ఛందంగా తరలి వచ్చారని చెప్పారు.

Back to Top