సోనియా విభజన ఆరాటంతోనే కృష్ణా కష్టాలు

హైదరాబాద్ :

కృష్ణానది జలాల పంపిణీపై‌ జస్టిస్ బ్రిజే‌శ్ కుమార్ ట్రిబ్యున‌ల్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బలంగా ప్రభావితం చేశారని, అందువల్లే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా తుది తీర్పు వచ్చిందని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించాలనే ఆరాటంతోనే ఆమె మిగులు జలాల అంశమే లేకుండా చేశారని విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు, ట్రిబ్యునల్ తీర్పు‌కూ లింకు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని చెప్పి సోనియాగాంధీ పుట్టిన రోజైన 2009 డిసెంబర్ 9 న ప్రకటన చేశారు. 2010లో బ్రిజేశ్ కుమా‌ర్ ట్రిబ్యున‌ల్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయం తీసుకున్న తరువాత 2010లో ఈ ఉత్తర్వులు వచ్చాయి. ఇపుడు మళ్లీ డిసెంబర్ 9న రాష్ట్ర విభజన చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ మిగులు జలాల విషయం వివాదాస్పదం కాకుండా చేయాలని.. ఎటువంటి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 9లోపు ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడేలా చేశారు. ‌ఇంత స్పష్టంగా తేదీలతో సహా జరుగుతూ ఉంటే ఇంత కన్నా సంకేతాలు ఏం కావాలి.. ట్రిబ్యునల్‌ను ప్రభావితం చేశారనడానికి? తాజా తీర్పుతో ఇక మిగులు జలాలే మీకు లేవు, మీ చావు మీరు చావండి అని చెపుతున్నారు’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తూర్పారపట్టారు.

చంద్రబాబూ.. ఒక్క ప్రాజెక్టయినా ఎందుకు కట్టలేదు?:
‘1973లో కృష్ణానది జలాలపై బచావత్ ట్రిబ్యున‌ల్ తీర్పు‌ ఇచ్చింది. ఈ తీర్పుపై.. 1976లో కర్ణాటక కొన్ని వివరణలు అడిగింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆ వివరణల ప్రకారం, ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్రానికి మిగులు జలాలపై పూర్తి హక్కులు ఉన్నట్లే! అప్పటి నుంచి 2004 సంవత్సరం వరకూ అంటే 1976 నుంచి 28 సంవత్సరాల్లో ‌తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ఈ తీర్పును అనుసరించి ప్రాజెక్టులు కట్టుకుందామన్న ఆలోచన ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు’ అని శ్రీ జగన్ విమర్శించారు.

‌‘ఆ తరువాత 1997లో కర్ణాటక వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటికి దేవెగౌడను ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ఈ సమయంలోనే కర్ణాటక సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక వాదనకు పూర్తిగా మద్దతునిచ్చింది. దేవెగౌడ ప్రధానిగా, చంద్రబాబు సీఎంగా ఉండగా ఇది జరిగింది. ఆ తరువాత 2000లో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా తీర్పు వచ్చింది. అంటే చంద్రబాబు.. మంచి న్యాయవాదులను పెట్టలేదా? లేదా నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారా? మరొకటా...మరొకటా...అనేది నేను వేరే చెప్పనవసరం లేదు’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

ఆ తీర్పు అత్యంత దారుణం :
‘ఆ తీర్పు ఎంత దారుణమైనదీ అంటే.. దిగువ రాష్ట్రాలకు.. కేటాయించిన జలాలకన్నా ఎక్కువ  హక్కు ఉండదు. మరో మాటలో చెప్పాలంటే , బచావత్ ట్రిబ్యున‌ల్ ఇచ్చిన మిగులు జలాలపై దిగువ రాష్ట్రాలకు ఎలాంటి హక్కూ ఉండదు. (బాబు హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును‌ శ్రీ జగన్ ఈ సందర్భంగా చదివి వినిపించారు) అంటే మనకున్న మిగులు జలాలను, మనకున్న హక్కును సుప్రీంకోర్టు తీసేసింది. దీనిని కౌంట‌ర్ చేయాల్సింది పోయి, దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాల్సింది పోయి, 2000 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు, ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 1973 నుంచి 2003 వరకూ ఈ ట్రిబ్యున‌ల్ తీర్పు అమల్లో ఉంటుంది‌. 2004లో కొత్త ట్రిబ్యునల్ వస్తుంది‌. ఈ లోపు ఎన్ని పెద్ద ప్రాజెక్టులను మనం కట్టగలితే అన్నీ కట్టి వాటన్నింటికీ కూడా మనం నికర జలాల హక్కును తెచ్చుకోవచ్చునని దివంగత రాజశేఖరరెడ్డి చెప్పినా.. చంద్రబాబు తాను చేయాల్సిన పని చేయలేకపోయారు’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు.

వైయస్ఆర్ ఆ నో‌ట్ ఇచ్చింది అందుకే :
‘2004లో కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్రానికి నష్టం జర‌క్కూడదని చెప్పి కొత్త ట్రిబ్యునల్ తీర్పు వచ్చే ముందే, ఎన్ని ప్రాజెక్టులు కట్టగలిగితే అన్ని కట్టి వీలైన మేరకు నికర జలాలను కేటాయింపజేసుకోవడం కోసం‌ మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇలా‌ వైయస్ఆర్ ప్రాజెక్టులు కడుతున్నారని తెలిసి.. కర్ణాటక రాష్ట్రం కొత్త ట్రిబ్యున‌ల్‌ను కలిసి ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేస్తూ ఇంజెక్షన్ ఆర్డ‌ర్ ఇవ్వ‌మని అడిగింది.‌'

'అలాంటి పరిస్థితుల మధ్య వైయస్ఆర్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఒక నో‌ట్ ఇచ్చారు. ఆ నో‌ట్‌ను ప్రభుత్వం అంతర్గతంగా సర్క్యులేట్ చేసింది. సచివాలయంలో ఎవరినడిగినా ఈ నో‌ట్ ఇస్తారు. రహస్యమేమీ కాదు. ఇందులో స్పష్టంగా ఇచ్చారు. ఆ లేఖలో తప్పేమీ అనలేదు. అవన్నీ నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులు అని అంటూ తన మనసులో ఉన్న మాట, ఏదైతే తాను చేయాలనుకున్నారో అదే వై‌యస్ఆర్ చెప్పారు. అది తప్పు కూడా కాదు.'

'ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే.. చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా, దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడే రాష్ట్రానికి అన్యాయం జరిగే తీర్పు వచ్చింది. ఇందుకు సంబంధించి వాదనలు జరిగినపుడు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యున‌ల్ .. బాబు హయాంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ ‘మీ ప్రాజెక్టులను నిర్మించకుండా ఇంజెక్ష‌న్ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వకూడదు’ అని ప్రశ్నించింది. అపుడు ఆ ఇంజెక్ష‌న్ ఆర్డ‌ర్‌ను తప్పించుకోవడానికి, మన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముందుకు కొనసాగించడానికి వైయస్ రాసిన లేఖ ఇది. అందులో కూడా బచావ‌త్ ట్రిబ్యున‌ల్ ఇచ్చిన తీర్పునే ఆయన ఉటంకించారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా బాబు దానిని పట్టుకుని యాగీ చేస్తున్నారు.’ అని‌ శ్రీ జగన్ తీవ్రంగా దుయ్యబట్టారు.

తామేం చేస్తున్నారో కాంగ్రెస్‌వాళ్ళకు తెలుసా? :
‘విభజన విషయంలో ఏం చేస్తున్నారో అసలు కాంగ్రెస్ వాళ్ల‌కు తెలుసా..? ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా పడితే అలా విభజిస్తున్నారు. ఈ క్రమంలో వారేమీ పట్టించుకోవడం లేదు. ఇపుడు తాజాగా రాయల తెలంగాణను తెరమీదకు తెచ్చారు. జాతీయ స్థాయిలో నేను రాజకీయ పార్టీల వద్దకు వెళ్లి ఇక్కడ మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను. ఇపుడు ఈ విషయం అందరికీ తెలుస్తోంది. అందుకే ఇపుడు రాయల తెలంగాణ అంటున్నారు. అసలు రాయలసీమను విభజించే హక్కు వారికి ఎవరిచ్చారు? రెండు జిల్లాలనే ఎందుకు.. అసలు అన్ని జిల్లాలను కలిపేసి దానికి తెలంగాణ రాష్ట్రం అని పేరు పెడితే సరిపోతుంది కదా... ఇలా చేస్తే అందరమూ సంతోషంగా ఉంటాం. ఈ ప్రతిపాదనకు తొలుత మద్దతు తెలిపేది నేనే.. ఓట్ల కోసం సీట్ల కోసం ఇలా చేస్తున్నారు. ఏం నాన్సెన్సు ఇది!'

'అందుకే అన్ని రాజకీయ పక్షాలకూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అన్యాయాన్ని ఆపమని. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను సవరించాలని కోరుతున్నా... కేంద్రంలో 272 సీట్లతో ఎవరు అధికారంలో ఉంటే వారు రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నైనా ఇష్టమొచ్చినట్లు చీల్చేసే పరిస్థితి ఉండకూడదని అంటున్నా.. ఈ రాష్ట్రాలన్నీ కూడా భాషా ప్రాతిపదికన ఏర్పడినవే.‌ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కాకపోయినా మూడింట రెండువంతుల మెజారిటీ ఉంటేనే రాష్ట్రాలు విభజించేలా ఉండాలి. అలాగే పార్లమెంటులో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంటేనే విభజనకు పూనుకోవాలి. ఈ సవరణ ప్రజాస్వామ్యం బతికి బట్టడం కోసం చేయాలని కోరుతున్నా.

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే అదొక చెడు సంప్రదాయంగా మిగిలిపోతుంది. ఇవాళ ఇక్కడ చేస్తే రేపు ఇతర రాష్ట్రాలను కూడా ఇలాగే ఓట్ల కోసం, సీట్ల కోసం విభజించే ప్రమాదం ఉంది. పార్లమెంటులో మా పార్టీకి ఉన్న బలం మూడే.. అందుకే ఈ అన్యాయాన్ని వ్యతిరేకించాలని అన్ని పార్టీల నేతలను కోరుతున్నాం. దేవుడు కూడా మాకు తోడుగా ఉండి నడిపిస్తాడని నమ్ముతున్నాం’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

సమైక్యం కోసం అందర్నీ కలుస్తాం :
ఏవో ఇతర పనుల కారణంగా యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌తో మంగళవారం ఉన్న అపాయింట్‌మెంట్ రద్దయిందని‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మళ్లీ ఆరవ తేదీన కలవమని సమాచారం ఇచ్చారని, ఆ రోజు కలుసుకోవడానికి మళ్లీ ప్రయత్నిస్తామని అన్నారు. ‘వారిని మళ్లీ కలవడానికి మాకు ఎలాంటి నామోషీ లేదు, తగ్గుతాం.. ప్రాధేయపడతాం... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తగ్గి వ్యవహరిస్తాం’ అని శ్రీ జగన్ అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు‌ ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.

నాలుగేళ్ల కిందట మరణించిన వ్యక్తిపై నిందలా? :
‘రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని తిట్టాల్సింది పోయి చంద్రబాబు.. నాలుగేళ్ల క్రితం చనిపోయిన వై‌యస్ రాజశేఖరరెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట చనిపోయిన ఆ వ్యక్తి ఏదో ఒక లెట‌ర్ ఇచ్చారని చంద్రబాబు చెబుతారు. ఆ లెటర్ ఎందుకు ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఆ లెట‌ర్ మంచి చేయడానికే ఇచ్చారని అందరికీ తెలుసు. వై‌యస్ చనిపోయాక రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతూ వస్తున్నాయి. రోశయ్యను గాని, కిరణ్‌ను గాని ట్రిబ్యునల్‌కు వేరే లేఖ ఎవరైనా ఇవ్వొద్దన్నారా? వేరే వాదనలు వినిపించవద్దని ఎవరైనా మెడపై కత్తి పెట్టారా? అవన్నీ చేయరు కానీ, అన్యాయంగా మాట్లాడతారు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు.. సోనియాను, రోశయ్యను, కిరణ్‌ను‌ తిట్టకుండా నాలుగేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై విమర్శలు చేస్తారు.'

'ధర్నా చేస్తానని చంద్రబాబు అంటారు.. అసలు ముందు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసి ఆయనే తప్పు చేశారు. రెండవది ఇపుడు సోనియాగాంధీ తప్పిదం చేస్తున్నారు. ఇవీ రాజకీయాలు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందీ అంటే నీళ్లు కూడా లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. విభజనతో కింది రాష్ట్రానికి నీళ్లు దొరకవు అన్న సంగతి తెలిసినా, పిల్లలకు ఉద్యోగాలు కూడా దొరకవు అని తెలిసినా చంద్రబాబు వ్యతిరేకించరు... పైగా మద్దతిస్తారు. ఈ వ్యవస్థలో నిజాయితీ పూర్తిగా కరవైన ఇంతటి దారుణమైన రాజకీయాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదు’ అని శ్రీ జగన్ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top