సమైక్య ఉద్యమంలో19 సభ కీలక మలుపు

హైదరాబాద్, 12 అక్టోబర్ 2013:

ఈ నెల 19న హైదరాబాద్‌ లాల్‌ బహదూర్‌ స్టేడియంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే 'సమైక్య శంఖారారం' బహిరంగ సభ  సమైక్య ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పబోతున్నదని ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సమైక్య ఉద్యమాన్ని పార్టీ పరంగా చిత్తశుద్ధితో నిర్వహించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మొదటి నుంచీ పోరాడుతున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అని ఆయన పేర్కొన్నారు. బయటికి వచ్చిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారన్న ఆశాభావం ప్రజ‌ల్లో ఉందన్నారు. వారి ఆశలకు అనుగుణంగానే అన్ని విధాలుగా పార్టీ పోరాటాలు చేస్తున్నదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో శనివారం మధ్యాహ్నం మీడియాతో ఆయన మాట్లాడారు. సమైక్య శంఖారావం సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సమైక్య శంఖారావం సభకు హాజరయ్యేందుకు కాకినాడ నుంచి, నర్సాపురం, గుంటూరు, మంగళగిరి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు నుంచి అభిమానులు, పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఏర్పడిన తుపాను పరిస్థితులను బేరీజు వేసుకుని అక్కడి నుంచి కూడా ప్రత్యేక రైళ్ళలో సభకు రాబోతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణం, నగరం, గ్రామాల నుంచి కూడా బస్సులలో సభకు వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బయటికి వచ్చిన తరువాత ఆయన పాల్గొనబోయే మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. శ్రీ జగన్‌ను ప్రత్యక్షంగా చూడాలని, ఆయన సందేశాన్ని వినాలని రాష్ట్రం నలుమూలల నుంచీ ప్రజలు స్వచ్ఛందంగా బయలుదేరి వచ్చే అవకాశం ఉందన్నారు. సమైక్య శంఖారావం సభ జరిగిన తరువాత కేంద్రం గాని, ఇతర పార్టీలు గాని దిగి వస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. సమైక్యాంధ్ర కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని ప్రజలంతా స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు.

సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి, పార్కింగ్‌ మొదలు ఏర్పాట్లన్నింటినీ ఎవరు ఏయే బాధ్యతలు నిర్వహించాలనే నిర్ణయాన్ని పార్టీ చూస్తోందన్నారు. ఎల్‌బి స్టేడియంలో సభ నిర్వహించేందుకు ఎన్జీవోలకు అనుమతి లభించింది కనుక తమ సభకు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా త్వరలోనే అనుమతి వస్తుందన్న ధీమాతో ఏర్పాట్లన్నీ చేస్తున్నామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ సాయంత్రం లోగా తమ సభకు అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు.

సమైక్యాంధ్రను రాష్ట్ర ప్రజలు ఎంతగా కోరుకుంటున్నదీ ఆ నాటి సభతో తేలిపోనున్నది కనుక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ప్రజలతో సంప్రతింపులు జరుపుతున్నారన్నారు. తెలంగాణ నుంచి కూడా సమైక్యాంధ్రను కోరుకునే వారు భారీ సంఖ్యలో ఈ సభకు హారజయ్యే అవకాశం ఉందన్నారు.

Back to Top