ముందస్తు ఎన్నికలకు మీరు సిద్ధమా?

‌హైదరాబాద్, 8 మే 2013: కాంగ్రెస్, టిడిపిలకు దమ్మూ ధైర్యం ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌ చేసింది. కర్నాటక తరహా ఫలితాలే మన రాష్ట్రంలోనూ పునరావృతం అవుతాయన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో పార్టీ సీఈసీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి ఏకీభవించారు. కర్నాటకలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్  పార్టీకి అలాంటి తీర్పే రావడం తథ్యమని ఆమె అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో భూమా శోభా నాగిరెడ్డి మాట్లాడారు. అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు టిడిపి ముందుకు వస్తే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందన్నారు. ప్రజల్లో తమ పట్ల విశ్వాసం సడలలేదని భావిస్తుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ పార్టీని ఆమె సవాల్‌ చేశారు.

కర్నాటకలో బలమైన ప్రత్యామ్నాయం లేకే ఈ తీర్పు : 
కర్నాటక అసెంబ్లీ ఫలితాలను చూసి మన రాష్ట్రంలోని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కలిసి సంబరాలు చేసుకుంటున్నారని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. కర్నాటక బిజెపిలోని అంతర్గత కుమ్ములాటలకు ప్రజలు విసిగి వేసారిపోయి దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆమె విశ్లేషించారు. అదే తరహాలో మన రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. మొన్నటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 17 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు రాగలరా? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆమె బొత్స సత్యనారాయణను డిమాండ్ చే‌శారు.

కర్నాటకలో బలమైన ప్రత్యామ్నాయం లేకే ఈ తీర్పు : 
కర్నాటకలో అవినీతికి వ్యతిరేకంగా గాలి జనార్దనరెడ్డి పార్టీని ఓడించినట్లే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనీ రాష్ట్ర ప్రజలు ఓడిస్తారని టిడిపి నాయకులు చెబుతున్నారని శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు. కర్నాటకలో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ‌తప్ప దాని మీద విశ్వాసంతో మాత్రం కాదన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే ఆ రాష్ట్ర ప్రజలు ఓటు వేశారన్న విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు.

ఉప ఎన్నికల్లో వాటిని దారుణంగా ఓడించారు : 
మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని, టిడిపిని వేర్వేరుగా ప్రజలు చూడడం లేదన్నారు. ఆ రెండు పార్టీలూ కలిసిపోయాయని ప్రజలు నమ్మినందువల్లే మొన్నటి ఉప ఎన్నికల్లో అవి కుమ్మక్కయ్యి, అవగాహనతో పోటీ చేసిన చోటల్లా ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. మన రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐ కలిసి కుట్ర పన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని దాదాపు సంవత్సర కాలంగా జైలులో పెట్టారని శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్ళ చంద్రబాబు పాలన చూసిన తరువాత కూడా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలకు రావాలని టిడిపి నాయకులను డిమాండ్‌ చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిచి, ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతూనే మరో పక్క అది ఒక్కరోజు కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదంటూ అసత్య ప్రచారం చేయడాన్ని శోభా నాగిరెడ్డి తప్పుపట్టారు.

తనపై కేసులు బయటికి తీస్తుందని బాబుకు భయం : 
ప్రతి చిన్నదానికీ హడావిడి చేసే చంద్రబాబు నాయుడు సిబిఐ తీరును సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో తప్పుపట్టినా దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడంలేదని శోభా నాగిరెడ్డి నిలదీశారు. సిబిఐ గురించి మాట్లాడితే తనపై ఉన్న అవినీతి కేసులను అది బయటికి తీస్తుందన్న భయం బాబులో ఉందన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టినందువల్లే సిబిఐని చంద్రబాబు ప్రశ్నించడం లేదా అన్నారు.

శ్రీ జగన్‌కు అధికారం ఇచ్చేందుకు జనం ఎదురు చూపులు : 
1983లో ఎన్టీ రామారావు టిడిపిని పెట్టినప్పుడు ఎదురుచూసి ప్రజలు దాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని, అలాంటి ఆదరణే 30 ఏళ్ళ తరువాత ఇప్పుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్ల వచ్చిందని శోభా నాగిరెడ్డి తెలిపారు. దేశ చరిత్రలో ఎవ్వరిపైనా లేనంతటి అన్యాయంగా శ్రీ జగన్‌ను జైలులో పెట్టారని, బ్రిటిష్‌ పాలకులు కుడా ఇంత దారుణంగా వ్యవహరించలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. విచారణ పేరుతో దాదాపు 12 నెలలుగా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో పెట్టి వేధిస్తున్నారని శోభా నాగిరెడ్డి దుమ్మెత్తిపోశారు.
Back to Top