దిగ్విజయ్‌కు ఇంగ్లీషు కూడా రాదా?

హైదరాబాద్, 8 అక్టోబర్ 2013:

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 70 రోజులుగా సీమాంధ్రలోని ఆరు కోట్ల ప్రజల గుండెలు గాయపడి, ఆ ప్రాంతం అంతా అగ్ని జ్వాలగా మారిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సీమాంధ్ర ద్రోహులను ఆగ్రహ అగ్నికీలల్లో వేసి దహించాలన్నంత మహోధృతంగా ఉద్యమం కొనసాగుతోందన్నారు. ఆ ఉద్యమం పట్ల ఎలాంటి సహేతుకమైన ఆలోచనా లేకుండా, శాస్త్రీయమైన సమాధానం చెప్పకుండా, విభజన ప్రకటనను వాపస్‌ తీసుకోకుండా.. మహా ఘనత వహించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ ఒక పత్రికా ప్రకటన చేస్తూ.. విభజనకు‌ అనుకూలంగా వైయస్ఆ‌ర్ కాంగ్రెస్‌ పార్టీ లేఖ ఇచ్చిందంటూ దానిని టిడిపి లేఖతో పాటు జత చేసి విడుదల చేశారన్నారు. 2012 డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అందజేసిన లేఖ అది అని భూమన వివరించారు. అది రహస్యంగా ఇచ్చిన లేఖ కాదన్నారు. దాచిపెట్టిందీ కాదన్నారు. ఆ రోజునే మీడియా ప్రతినిధులకు బహిరంగంగా ప్రకటించామన్నారు. ఆ లేఖలోని అంశాలను ఆంధ్రదేశం అంతటా వినిపించామని కూడా చెప్పారు. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కేంద్రానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఏనాడూ చెప్పలేదన్నారు.

ఇంగ్లీషు, తెలుగు భాషల్లో విడుదల చేసిన ఆ లేఖలోని అంశాన్ని దిగ్విజయ్‌ సింగ్‌కు ఎలా వక్రీకరిస్తారని భూమన నిలదీశారు. ఆయనకు తెలుగు ఎలాగూ రాదని, ఇంగ్లీషు కూడా రాదనుకోవాలా? అని ప్రశ్నించారు. 'అన్ని సమస్యలనూ పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా త్వరితగతిన అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని చూపాలని కోరుతున్నామని' పార్టీ లేఖలో పేర్కొందని ఆయన చెప్పారు. పార్టీ చెప్పని, ప్రకటించని విషయాన్ని దిగ్విజయ్‌ సింగ్‌ చెబుతూ కాంగ్రెస్‌ పార్టీ చేసి విభజన పాపంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని భాగస్వామిని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ లేఖలో స్పష్టంగా ఉన్న విషయాలను ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు. అడ్డగోలుగా విభజనకు అనుకూలంగా రాసి ఇచ్చిన చంద్రబాబు నాయుడి లేఖతో జత కలిపి తమ లేఖను విడుదల చేయడమేమిటని భూమన నిలదీశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం పార్టీలు మూడు మాత్రమే అని భూమన స్పష్టం చేశారు. టిడిపి, టిఆర్ఎస్‌ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ చేస్తున్న వీరోచిత పోరాటాలకు సీమాంధ్రలోని ఆరు కోట్ల ఆంధ్రులు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని, తోడ్పాటు అందిస్తున్నారన్నారు.

విభజనకు అనుకూలమని, తనది రెండు కళ్ళ సిద్ధాంతమని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, సమస్యలకు పరిష్కారం చూపాలని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని భూమన దుయ్యబట్టారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడమే కాకుండా ప్రకటన వచ్చిన వెంటనే సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఇస్తే సరిపోతుందంటూ మాట్లాడిన ద్రోహి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా అడ్డగోలు విభజన సరికాదని ప్రకటకు ముందే పదవులను గడ్డిపోచల్లా త్యజించిన పార్టీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులది అన్నారు. విభజన ప్రకటన వచ్చిన వెంటనే రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు నిర్మించిన పార్టీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అన్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేశారని, నిర్బంధంలో ఉన్నప్పటికీ జైలులోనే ఏడు రోజుల పాటు నిరశన దీక్ష చేసిన ఘనత పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిదని భూమన పేర్కొన్నారు. ఇప్పటి వరకూ చరిత్రలో ఎవ్వరూ చేయని రీతిలో ఒకే సమస్య మీద ఒకే నెలలో శ్రీ జగన్‌ మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడంపై ఢిల్లీలోని జాతీయ పార్టీల నాయకులను ఈ రోజున శ్రీమతి విజయమ్మ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం కలిసి మద్దతు కూడగడుతున్న వైనాన్ని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అనేక విధాలుగా ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తమ పార్టీపై బురదచల్లుతున్నారని భూమన తీవ్రంగా ఖండించారు.

రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని భూమన అన్నారు. ఒక తండ్రిలా సమన్యాయం పాటిస్తూ సమస్యకు పరిష్కారం చూపించమంటే అది విభజన కాదన్నారు. సమన్యాయంతో పరిష్కారం చేయడానికి అవకాశం లేదు కనుక సమైక్యంగా ఉంచాలన్నదే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఆలోచన అన్నారు. సెంటిమెంటును గౌరవిస్తున్నామంటే.. విభజించమని అర్థం కాదన్నారు.

రాష్ట్ర విభజనకు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆద్యుడంటూ చేస్తున్న ఆరోపణలను కూడా భూమన తీవ్రంగా ఖండించారు. 2009 మార్చి 4న రోశయ్య కమిటీని వేసినప్పుడు కూడా విభజన ఎంత కష్టసాధ్యమైన విషయమో వైయస్ఆర్‌ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన విభజన పాపంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను భాగస్వామిని చేయాలని కాంగ్రెస్‌ చేస్తున్న కుటిల యత్నాలు ఫలించబోవని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు.

Back to Top