చంద్రబాబు అవాకులు, చెవాకులు


హైదరాబాద్, 25 జనవరి 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీఏ సోమయాజులు పేర్కొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించి అలా మాట్లాడుతున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సోమయాజులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చౌకబారు విమర్శలతో టీడీపీ రోజు రోజుకు దిగజారుతోందన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గం నుంచి తప్ప రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన ఎద్దేవా చేశారు. గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలవలేదన్నారు. కాంగ్రెస్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయితే శ్రీ జగన్మోహనరెడ్డి ఎందుకు జైలులో ఉంటారని ఆయన ప్రశ్నించారు.

సహకార ఎన్నికల్లో అక్రమాలు
     సహకార ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని సోమయాజులు ఆరోపించారు.  ఎటువంటి రాజకీయ ప్రాబల్యంలేని సహకార ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే కిరణ్ ప్రభుత్వం చట్టాన్ని అపహాస్యం చేస్తొందన్నారు.  ఇప్పటికే 45 సంఘాల ఎన్నికలను వాయిదా వేసిందని, ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన 22సీ సెక్షన్‌ను వినియోగిస్తూ సహకార సంఘాలకు ఎన్నికలు జరగకుండా జీవోలు జారీ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా కలెక్టర్లు, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కిరిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు.

     సహకార ఎన్నికల్లో రైతులు స్వేచ్ఛగా ఓట్లు వేసే పరిస్థితులు కనిపించడంలేదన్నారు. నిజమైన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సోమయాజులు ఆరోపించారు. రైతులు కానీ వారికి సభ్యత్వం ఇచ్చారని, గడువు తేదీ డిసెంబర్‌లో ముగిసినా జనవరిలోనూ లక్షల మందికి సభ్యత్వం ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు నిజమైన రైతులను తీసుకు వెళ్లి సభ్యత్వం ఇవ్వమంటే ఇవ్వడం లేదన్నారు.   ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Back to Top