'బాబును చూస్తే చవితి చంద్రుడ్ని చూసినట్లే'

హైదరాబాద్‌, 24 సెప్టెంబర్‌ 2012: 'అబద్ధాలకోరు చంద్రబాబునాయుడిని చూస్తే చవితి చంద్రుడ్ని చూసినట్లు'గా జనం ఆందోళన చెందుతారని అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. వంట గ్యాస్‌ ధర తన హయాంలో పెరగలేదని చెబితే వినేందుకు ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదని పార్టీ అధికార ప్రతినిధి బి. జనక్‌ప్రసాద్‌ నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో గ్యాస్‌ ధర రెట్టింపు అయిన విషయాన్ని మరిచిపోయారా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ గెజెట్ పత్రికలా పనిచేస్తున్న 'ఈనాడు' లో ఈ విషయాన్ని రాసినా మీరు విశ్వసించరా అని సూటిగా ప్రశ్నించారు. 'వస్తున్నా- మీకోసం' అంటూ మీరు చేపట్టబోయే పాదయాత్రకు ప్రజలు 'రావొద్దనే' పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.

గతంలో గ్యాస్‌ ధర పెరిగినప్పుడు ఒక్కసారైనా ధర్నా చేశారా? అని చంద్రబాబు నాయుడిని జనక్‌ప్రసాద్‌ సూటిగా ప్రశ్నించారు. అదే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్‌ ధరను కేంద్రం పెంచితే కేవలం నిమిషం వ్యవధిలోనే పెరిగిన గ్యాస్‌ ధర భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.‌ బషీర్‌బాగ్‌లో విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు తుపాకీ కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలను బలిగొన్నది మీరు కాదా అని చంద్రబాబునాయుడిని నిలదీశారు. అప్పటి కాల్పుల్లో మరణించిన వారి పట్ల కనీసం మీరు విచారం కూడా వ్యక్తం చేయని విషయం గుర్తు చేసుకోవాలని అన్నారు. అమరవీరులకు కనీసం సంస్మరణ స్తూపాన్ని కూడా నిర్మించేందుకు బాబు అనుమతించని విషయాన్ని ప్రస్తావించారు. అలాంటి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్‌ మృతుల స్తూపాన్ని ఏర్పాటు చేయించడమే కాకుండా వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం కల్పించిన  ఉదారుడని కొనియాడారు.

‌మన రాష్ట్రానికి గ్యాస్‌ ఇస్తారా? లేదా? అన్నది నిర్ధారించుకోకుండా రిలయన్సు‌ సంస్థతో కుమ్మక్కయి ప్రజలను మోసగించింది చంద్రబాబు నాయుడే అని జనక్‌ప్రసాద్‌ దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడి స్వార్థపూరిత వ్యవహారం వల్లే మనకు ఇప్పుడు గ్యాస్‌ దొరకని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులు విద్యుత్‌ చార్జీలు చెల్లించగలిగే పరిస్థితి లేకపోయిందని జనక్‌ప్రసాద్‌ ప్రస్తావించారు. అలాంటి దుస్థితిలో ఉన్న అన్నదాతను కేసులు పెట్టి శిక్షించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2000 సంత్సరం అక్టోబర్‌ 17న ప్రత్యేకంగా ఫాస్టు ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు ఒక జీఓను,‌ విద్యుత్‌ చార్జీలు చెల్లించలేని వారిని వేధించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం 2001 మే 22న మరో జీఓను విడుదల చేసిన విషయాన్ని జనక్‌ ప్రసాద్‌ ప్రస్తావించారు. ఈ జీఓలకు చంద్రబాబు బాధ్యత వహిస్తారా లేదా అని ప్రశ్నించారు. తమ సమస్యల కోసం ఉద్యమిస్తున్న అంగన్‌వాడి కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది అని దెప్పిపొడిచారు.

ఒక పక్కన తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు బూటకపు మాటలు చెబుతుంటే ఆ పార్టీ నాయకులు ఎందుకు నిలదీయడం లేదని జనక్‌ప్రసాద్‌ నిలదీశారు. రైతన్నలను ఇబ్బంది పెట్టే అలాంటి జీఓలు ఇచ్చిన విషయం ఆ పార్టీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రపంచబ్యాంకు జీతగాడిగా చంద్రబాబు మారిపోయినందుకే గతంలో ప్రజలు తరిమికొట్టారని పేర్కొన్నారు.

ఈ రాష్ట్ర ప్రజల ముందు మళ్ళీ ఎలా నటించాలా అనే విషయంలో చంద్రబాబు ఇప్పుడు సినిమా దర్శకుల సలహాలు తీసుకుంటున్నారని జనక్‌ప్రసాద్ ఎద్దేవా చేశారు. ‌2014 ఎన్నికల్లో ప్రజలను కల్లబొల్లి మాటలతో ఏమార్చడానికే పాదయాత్ర పేరుతో వస్తున్నారా? నిలదీశారు.

రూ. 650 కోట్ల భారం వేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం:
అంతకు ముందు జనక్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, గత రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ. 650 కోట్ల ఆర్థిక భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఎస్‌ఎ) నెపంతో ఈ బరువును మనపై వేసిందని తెలిపారు. ఈ అసమర్థ ప్రభుత్వ విధానాలకు ప్రజలు ఎందుకు బాధ్యత వహించాలని జనక్‌ ప్రసాద్‌ సూటిగా ప్రశ్నించారు. ప్రైవేటు ల్యాంకో, జిఎంఆర్‌ లాంటి సంస్థలకు గ్యాస్‌ ఇవ్వాలని సిఫార్సు చేసిన ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఎందుకు పట్టుపట్టలేదని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే విద్యుత్‌ చార్జీలు రూ. 2.18 నుంచి రూ. 5.50కు పెరిగిపోయాయని ఆయన దుయ్యబట్టారు.

ఆర్టీసీ బస్సు చార్జీలు రూ. 400 కోట్లు మాత్రమే పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని, అయితే, లోతుగా పరిశీలిస్తే ఆ భారం రూ.700 నుంచి రూ. 750 కోట్ల రూపాయలకు పైనే పడే ప్రమాదం ఉందని జనక్‌ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వారాంతంలో లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారి నుంచి అధికంగా ముక్కు పిండి వసూలు చేసేందుకు 'ఫ్లెక్సీ ఫేర్'‌ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిట్‌ లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను‌ నియంత్రించకుండా ఇలా ప్రజలపై భారం మోపడమేమిటని నిప్పులు చెరిగారు. ‌పెంచిన డీజిల్ ధరలు రవాణా వాహనాలు, ఆర్టీసి, రైతులు వినియోగించే విద్యుత్‌ మోటార్లకు కూడా విపరీతమైన భారంగా మారతాయని అన్నారు. ఎవరి వత్తిడి వల్ల ప్రధాని డీజిల్‌ ధరలు పెంచారని జనక్‌ప్రసాద్‌ ప్రశ్నించారు.

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డ ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జనక్‌ప్రసాద్‌ హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పడు వచ్చినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా తమ పార్టీ ఈ నెల 26 బుధవారంనాడు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు, ఆందోళనలు చేస్తుందని తెలిపారు.
Back to Top